భార్య, భర్త, మధ్యలో ప్రియుడు..!
► ప్రియుడితో కలిసి.. భర్తను చంపించింది
► భర్త ఏటీఎం కార్డుతో రెండులక్షలు డ్రా
► ఈ డబ్బు తీసుకుని, హంతకులుగా మారిన ప్రియుడి మిత్రులు
► హత్యకు సమష్టిగా పథకం రూపకల్పన
► నెత్తుటి నగదుతో నిందితుల జల్సాలు, షాపింగ్
► ఆరుగురి అరెస్ట్, పరారీలో మరొకరు
► నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం
►ఉపాధ్యాయుడు శ్యామ్ హత్య కేసులో వీడిన మిస్టరీ
భార్య, భర్త, మధ్యలో ప్రియుడు..! భర్త.. ప్రభుత్వోద్యోగి. ప్రియుడు.. నిరుద్యోగి. ఆమెకు ఇద్దరు కూతుళ్లు. అతడు అవివాహితుడు. ఆమె వయసు 32. ప్రియుడి వయసు 22. వీరిద్దరూ ఒక్కటయ్యారు. అతడిని చంపించారు. బంధాన్ని, బాంధవ్యాన్ని.. భౌతిక సుఖం తేలిగ్గా తెంపేసింది. బిడ్డలకు తండ్రిని దూరం చేసింది.
కొత్తగూడెంక్రైం: ఓ ఇల్లాలు, తన ప్రియుడితో కలిసి భర్తను పకడ్బందీగా చంపించింది. తమ మధ్య వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న ఏకైక కారణంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో సీఐ రవీందర్ వెల్లడించిన వివరాలు...
ఇదీ నేపథ్యం
పాల్వంచ మండలం సోములగూడెం గ్రామస్తుడైన సపావట్ శ్యామ్ (43), కిన్నెరసాని ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, అక్కడే ఒక్కడు ఉంటున్నాడు. సుమారు 13 సంవత్సరాల క్రితం బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామానికి చెందిన శారద(32)తో వివాహమైంది. వీరికి, 11, 7 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాపిల్లలు సోములగూడెంలో ఉంటున్నారు. సమీపంలోగల సూరారం గ్రామానికి చెందిన నిరుద్యోగి, అవివాహితుడు సోమిశెట్టి సాయికృష్ణ(22)తో శారదకు పరిచయమేర్పడింది. ఇద్దరూ సన్నిహితులయ్యారు. వీరు కొంతకాలంగా వివాహేతర సంబంధం సాగిస్తున్నారు.
అడ్డుగా భర్త
వేసవి సెలవులు మొదలవగానే ఆశ్రమ పాఠశాల నుంచి ఇంటికి శ్యామ్ వచ్చాడు. భార్యాపిల్లలతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ కారణంగా, ప్రియుడు సాయికృష్ణను కలుసుకునేందుకు శారదకు సాధ్యపడడం లేదు. శ్యామ్–శారద దంపతుల మధ్య అంతకు ముందు నుంచే గొడవలు జరుగుతున్నాయి.
చంపేందుకు పన్నాగం
ఆ దంపతుల మధ్య బాంధవ్యం బలహీనపడింది. ఆమెకు, ప్రియుడికి మధ్య సంబంధం బలపడింది. తమ మధ్య అడ్డంకిగా నిలిచిన శ్యామ్‌ను చంపేయాలనుకున్నారు. పన్నాగం పన్నారు. ప్రియుడు సాయికృష్ణ తన మిత్రులైన దారావత్ రాజు–సుజాత (వీరిద్దరూ దంపతులు), దారావత్ సంతోష్ (సూరారం గ్రామస్తుడు), కున్సోతు నరేష్(జూలూరుపాడు మండలం)ను సంప్రదించాడు. శ్యామ్‌ను చంపేసి, శవాన్ని మాయం చేసేందుకు వారందరికీ కలిపి రెండులక్షలు ఇచ్చేలా శారద, సాయికృష్ణ కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇలా చంపేశారు
ఏప్రిల్ 30వ తేదీ. శ్యామ్–శారద మధ్య ఎప్పటిలాగానే గొడవ జరిగింది. ‘‘ఇల్లెందులో ఉంటున్న మా బంధువుల వద్దకు వెళదాం, మన గొడవను అక్కడే పరిష్కరించుకుందాం’’ అని, శారద చెప్పింది. శ్యాం సరేనన్నాడు. ఇద్దరూ కలిసి స్కూటీపై ఇల్లెందు బయల్దేరారు. కొత్తగూడెం పట్టణంలోని గొల్లగూడెంలో తన బంధువులు ఉన్నారని, అక్కడ కొద్దిసేపు ఉండి ఇల్లెందు వెళ్దామని చెప్పింది. దీనికి కూడా, సరేనన్నట్టుగా శ్యాం తలూపాడు. దారావత్ రాజు–సుజాత ఇంటికి వెళ్లారు. అప్పటికే అక్కడ శారద ప్రియుడు సాయికృష్ణ, అతని స్నేహితులైన దారావత్ సంతోష్, కున్సోతు నరేష్ ఉన్నారు. శ్యామ్ ఆదమరపుగా ఉన్న సమయంలో అతడి మెడను చున్నీతో గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి చంపేశారు.
సంచుల్లో చుట్టి..
మృతదేహాన్ని గోనె సంచుల్లో చుట్టగా చుట్టారు. దారావత్ సంతోష్‌కు చెందిన ఆటోలో తీసుకెళ్లి, లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగు వద్ద రైల్వే బ్రిడ్జి సమీపంలో పడేశారు. పెళ్లికి వెళ్లాడని.. శ్యాం కనిపించడం లేదంటూ శారద కథ అల్లింది. మరుసటి రోజున (మే 1వ తేదీన) శ్యామ్ కుటుంబీకులతో.. ’’మేమిద్దరం కలిసి ముందు రోజున కొత్తగూడెం వెళ్లి షాపింగ్ చేసి, స్కూటీపై తిరిగొస్తున్నాం.
ఇల్లందు క్రాస్ రోడ్ వద్దకు రాగానే, ఇల్లందులో పెళ్లి ఉందని చెప్పి శ్యామ్ దిగిపోయాడు. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు’’ అని చెప్పింది. శ్యామ్ కుటుంబీకులు గాలింపు చేపట్టారు. ఇల్లందు వైపు వెళ్లాడని చెప్పడంతో అటువైపు వెళ్తున్నారు. లోతువాగు వద్ద జనం గుమిగూడి ఉండటాన్ని గమనించి దగ్గరగా వెళ్లేసరికి.. అక్కడ శ్యామ్ మృతదేహం కన్పించింది. వారు రోదిస్తూ, లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
నిందితుల అరెస్ట్
పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. దర్యాప్తును వేగవంతం చేశారు. మిస్టరీని త్వరగానే ఛేదించారు. శ్యామ్ భార్య శారద, ప్రియుడు సోమిశెట్టి సాయికృష్ణ, ఆటో డ్రైవర్ దారావత్ సంతోష్, దారావత్ రాజు, కున్సోతు నరేష్‌ను అరెస్ట్ చేశారు. దారావత్ సుజాత పరారీలో ఉంది. వీరి నుంచి ఆరు సెల్ ఫోన్లు, రిఫ్రిజిరేటర్ (శారద ఇచ్చిన డబ్బుతో వీటిని కొన్నారు), ఆటో, స్కూటీ, 80వేల రూపాయల నగదు, ఏటీఎం కార్డ్, చున్నీ స్వాధీనపర్చుకున్నారు. సమావేశంలో ఎస్సైలు ముత్యం రమేష్, డి.వరుణ్‌ప్రసాద్ పాల్గొన్నారు.