
విగ్గుల నగరి
బంజారాహిల్స్, న్యూస్‌లైన్: కృష్ణానగర్.. సినీప్రేమికుల నగరం. ప్రస్తుతం విగ్గులకు కేంద్రంగా మారింది. సినిమాలతో పాటు.. బుల్లితెరలో సీరియళ్లు.. షోల సంఖ్య పెరగడంతో.. విగ్గులకు గిరాకీ పెరిగింది. దీంతో ఈ ప్రాంతంలో వీధికో విగ్గుల దుకాణం ఏర్పాటవుతోంది. మేకప్ వేసే నైపుణ్యం ఉన్నవారే విగ్గులను తయారు చేయగలరని అయ్యప్ప కాస్మటిక్స్ అండ్ విగ్స్ అధినేత, సినీ మేకప్‌మ్యాన్ ఎం.బాబు తెలిపారు. మేకప్‌మ్యాన్ అయితేనే పాత్రలకు, నటులకు సరిపోయే విధంగా విగ్గును డిజైన్ చేస్తారని చెప్పారు.
చెన్నై నుంచి..
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న చాలా మంది చెన్నై నుంచి వచ్చినవారే. 30 ఏళ్ల క్రితం పరిశ్రమతో పాటే ఫిలింనగర్‌కి వచ్చారు.
విగ్గుల తయారీ తేలిక కాదని శ్రీ భువనేశ్వరి విగ్‌షాప్ యజమాని మల్లికార్జునరావు వెల్లడించారు. ఓపికతో పాటు సృజన అవసరమని వివరించారు. ప్రస్తుతం విగ్గుల తయారీలో చాలామంది నిరుద్యోగ యువత ఉపాధి పొందుతున్నారు. శ్రీకృష్ణానగర్, ఇందిరానగర్, ఫిలింనగర్‌లలో 400 మంది విగ్గుల తయారీలో నిమగ్నమయ్యారు. తమకి పాత్రపేరు చెబితే దాని ప్రకారం విగ్గులను తయారు చేస్తామని పాండు అనే విగ్గుల తయారీదారుడు చెప్పారు. భీముడు, యముడు తదితర పౌరాణిక పాత్రలతో పాటు, జానపద సినిమాల్లో అవసరమైన విగ్గులను రూపొందిస్తామని నందు అనే విగ్గు తయారీదారుడు చెప్పారు. విగ్గుకి ఒక్కరోజుకి రూ. 200 నుంచి 500ల వరకు అద్దె రూపంలో వసూలు చేస్తామని వెల్లడించారు.
నిత్యం 30 వరకు..
గ్రామీణ వాతావరణంలో ఉండే హీరో గెటప్‌కు, సిటీలో ఉండే హీరో తరహాకు జుట్టులో, మీసంలో చాలా తేడాలుంటాయని ఆ పాత్రలు ఆకళింపుచేసుకుని దర్శకుడు, నటీనటుల చెప్పినవిధంగా రూపొం దిస్తామని సుబ్బారావు అనే విగ్గు తయారీ దారుడు చెప్పారు. శ్రీకృష్ణానగర్ ప్రాంతం పరిధిలో నిత్యం 30 వరకు విగ్గులను తయారుచేస్తుంటారు. ఒకసారి వాడిన విగ్గును ఇంకోసారి వాడరని దాన్ని పక్కన పెట్టేస్తామని, ఎప్పటికప్పుడు కొత్తవి రూపొం దిస్తామని విగ్గు తయారీదారులు స్పష్టంచేశారు.
ఉపాధి లభిస్తోంది..
విగ్గుల తయారీ చాలా కష్టమైంది. నాణ్యమైన వెంట్రుకలను సేకరించి విగ్గులు తయారు చేస్తుంటాం. బ్రౌన్, వైట్, నేచురల్ బ్లాక్, డార్క్‌బ్లాక్, సింథటిక్ హెయిర్‌తో ఈ విగ్గులు రూపుదిద్దుకుంటాయి. పాత్రలను బట్టి మీసాలు, గడ్డం, తలవెంట్రుకలు తీర్చిదిద్దుతాము. చాలామంది నిరుద్యోగులు ఈ విగ్గుల తయారీతో ఉపాధి పొందుతున్నారు. టీవీ సీరియళ్లకు కూడా విగ్గులు రూపొందిస్తున్నాం.
- శ్రీనివాస్, విగ్గుల తయారీదారు, సినీ మేకప్ మ్యాన్, శ్రీకృష్ణానగర్