చంద్రబాబుకు టీడీపీ తెలంగాణ నేతల వేడుకోలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జిల్లాల వారీగా ఖాళీ అవుతున్న నేపథ్యంలో పార్టీని కాపాడాల్సిన బాధ్యతను నేతలు పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకే వదిలేశారు. ఏరోజు ఏ నాయకుడు టీడీపీకి రాజీనామా చేసి గులాబీ కండువా కప్పుకుంటాడో తెలియని పరిస్థితి ఏర్పడిందని చంద్రబాబు వద్ద మొరపెట్టుకున్నారు. తెలంగాణలో పార్టీని కాపాడాలంటే ఇక్కడి పది జిల్లాల మీద కూడా దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో సోమవారం తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబుతో సమావేశమయ్యారు.
సమైక్యవాదులుగా పేరు పొంది... కేసీఆర్‌ను బహిరంగంగా తిట్టిన నాయకులను కూడా టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని మంత్రులను చేస్తూ మైండ్‌గేమ్ ఆడుతున్నారని వారు పేర్కొన్నారు. ఇలా తెలంగాణలో తెలుగుదేశం ఉండదనే సంకేతాలను పంపిస్తుండడంతో టీడీపీ ఖాళీ అవుతోందని చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. కొందరు నాయకులు పోయినా ప్రజల్లో ఇంకా టీడీపీ మీద అభిమానం ఉందని, కేసీఆర్ మైండ్‌గేమ్‌కు లొంగవద్దని నేతలకు చంద్ర బాబు సూచించారు. పదిరోజులకోసారి తెలంగాణలోని ఒక్కో జిల్లాలో పర్యటిస్తానని, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై వారిలో ధైర్యాన్ని నింపుతానని పేర్కొన్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో వరంగల్ నుంచి ఈ పర్యటన ప్రారంభించే అవకాశం ఉందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, మాధవరం కృష్ణారావు, సండ్ర వెంకట వీరయ్య చంద్రబాబుతో జరిగిన ఈ సమావేశానికి హాజరు కాలేదు.
టీఆర్‌ఎస్‌లోకి టీఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు
టీఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్ సహా విద్యార్థి, యువ నేతలు టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించారు. సోమవారం ఇందిరాపార్క్ వద్ద వారు సమావేశమయ్యారు. చంద్రబాబు విధానాలకు నిరసనగా పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించారు.
పార్టీని మీరే కాపాడాలి..
Published Tue, Jan 20 2015 7:43 AM | Last Updated on Sat, Aug 11 2018 4:44 PM
Advertisement
Advertisement