రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ ఈ నెల 10, 11, 12 తేదీల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ బస్సు యాత్ర...
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ ఈ నెల 10, 11, 12 తేదీల్లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు ఇ.పెద్దిరెడ్డి, రావులపాటి సీతారామారావు, చాడ సురేష్‌రెడ్డి, బిల్యానాయక్ తెలిపారు. మంగళవారమిక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కళ్ల ముందే ఎండిపోతున్న పంటను చూసి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారులో చలనం లేదని ధ్వజమెత్తారు. రైతులకు అండగా నిలిచేందుకు 10న నల్లగొండ జిల్లా, 11న వరంగల్, 12న ఆదిలాబాద్ జిల్లాల్లో బస్సు యాత్ర చేస్తున్నట్లు చెప్పారు.
ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడమే పాలన అన్నట్లుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న అనాలోచిత విధానాల వల్లనే రైతులు మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్ జిల్లా పాలకుర్తిలో విమర్శించారు. ప్రతిపక్షాలపై అనవసర విమ ర్శలు మానుకోవాలన్నారు. మార్క్‌ఫెడ్, సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.