గెలుపుపై ధీమా... | Winning Election Candidates In Warangal | Sakshi
Sakshi News home page

గెలుపుపై ధీమా...

Published Wed, Nov 28 2018 9:38 AM | Last Updated on Wed, Nov 28 2018 9:38 AM

Winning Election Candidates In Warangal - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. గెలిచేందుకు ఎత్తుగడలు వేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థులు ముందుకు సాగుతున్నారు. ఒక వైపు ప్రచారం నిర్వహిస్తూనే మరో వైపు గ్రామాల్లోని పలు స్థాయిల్లో గల నాయకులను పార్టీల్లో చేర్చుకుంటున్నారు.మానుకోట అసెంబ్లీ ఎన్నికల బరిలో 11 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ నలుగురు అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఇద్దరి అభ్యర్థుల మధ్య పోటీ ఉండగా ఈ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ కనిపిస్తుంది. జరుగుతున్న ప్రచారం, చేరికలతో అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. 

     మానుకోట నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 7 సార్లు కాంగ్రెస్, ఒకసారి కాంగ్రెస్‌(ఐ), టీడీపీ, సీపీఐ రెండు సార్లు, టీఆర్‌ఎస్‌ ఒకసారి, పీడీఎఫ్, ఎస్‌సీఎఫ్‌ కూడా ఒక్కొక్కసారి గెలిచాయి. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అభ్యర్థులు మాత్రం  ఎవరికి వారే గెలుస్తామనే ధీమాతో దూసుకెళ్తున్నారు. ఎన్నికల వాతావరణం వేడెక్కింది. కేవలం పది రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రచారాన్ని వేగవంతం చేశారు. 

నలుగురి మధ్యే ప్రధాన పోటీ...
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్, కాంగ్రెస్‌ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా బానోత్‌ మోహన్‌లాల్, బీజేపీ అభ్యర్థిగా జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఆ నలుగురు అభ్యర్థులు ఎక్కడ ప్రచా రం నిర్వహించినా భారీ సంఖ్యలో జనం హాజరవుతున్నారు. పోటా పోటీగా ప్రచారం కొనసాగుతుంది. ఆ నలుగురి మధ్య పోటీ ఉంటుందని దానిపైనే ప్రజలు అంచనాలు వేసుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బీజేపీ అభ్యర్థి రేసులో ఉండడం తీవ్రంగా చర్చ నడుస్తుంది. 

చేరికలతో వేడెక్కిన రాజకీయం....
తొలుత టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బానోత్‌ శంకర్‌నాయక్‌ ఆధ్వర్యంలో చేరికలు ఎక్కువగా జరిగాయి. కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన హుస్సేన్‌నాయక్‌ వెంటనే బీజేపీలో చేరి టికెట్‌ తెచ్చుకోవడం జరిగింది. కొంత ఆలస్యంగానే బీజేపీ అభ్యర్థిగా హుస్సేన్‌నాయక్‌   ఆ పార్టీలో చేరిన వెంటనే ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పలు పార్టీల నాయకులను భారీగా పార్టీలో చేర్చుకున్నారు. చేరికల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాంనాయక్‌ ఆధ్వర్యంలోనూ  గతంలో కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి  వెళ్లిన కొంత మంది నాయకులు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. వారిలో ఒకరు జెడ్పీటీసీతో పాటు ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి బానోత్‌ మోహన్‌లాల్‌ తాను కూడా ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో పాటు చేరికలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆ పార్టీలోను టీడీపీ, టీఆర్‌ఎస్‌ నుంచి చేరికలు జరిగాయి. 

ఎవరి ధీమా వారిదే.....
టీఆర్‌ఎస్‌ ముందుగానే టికెట్లు ఖరారు చేయడంతో బానోత్‌ శంకర్‌నాయక్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సుమారు రెండు నెలలకు పైగా ప్రచారంలో ఉన్నారు. దాదాపు తండాల్లోని ప్రతీ ఇంటికి వెళ్లడంతో పాటు రెండో విడత ప్రచారం కూడా దాదాపు ముగించారు. నేటికి ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ నెల 23న జిల్లా కేంద్రంలో జరిగిన కేసీఆర్‌ బహిరంగ సభ ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్‌ అవ్వడంతో గెలుస్తామనే పూర్తి విశ్వాసంతో ముందుకు పోతున్నారు. దానికి తోడు కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, మేనిఫెస్టో, తాను చేసిన అభివృద్ధి ప్రజలకు కేసీఆర్‌పైన ఉన్న నమ్మకం తిరిగి అధికారంలోకి తీసుకొస్తుందని మానుకోటపై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమాతో ఉన్నారు. 

     కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ కేంద్ర మాజీ మంత్రిగా ఈ ప్రాంత వాసులకు సుపరిచితుడు, ముందు నుంచి ఎంపీ అభ్యర్థి అనుకున్న తరుణంలో చివరి క్షణంలో అధిష్టానం బలరాంనాయక్‌కు టికెట్‌ ఇచ్చింది. ఎక్కువ పర్యాయాలు కాంగ్రెస్‌ గెలవడం కాంగ్రెస్‌కు కంచుకోటగా ముద్ర పడడం, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని ఈ ఎన్నికల్లో ఓటు రూపంలో తీర్చుకోవాలని చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి స్పందన వస్తుంది. కాంగ్రెస్‌ మేనిఫెస్టో గతంలో తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. 

     బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి బానోత్‌ మోహన్‌లాల్‌ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత కొన్ని పరిణామాల దృష్ట్యా టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం అక్కడ టికెట్‌ ఇవ్వకపోవడంతో మళ్లీ టీడీపీకి వచ్చిన మహాకూటిమి సీట్ల సర్ధుబాటులో తనకు టికెట్‌ రాదని తెలవడంతో చేసిన కుట్రలను గమనించి వెంటనే బీఎల్‌ఎఫ్‌లో చేరారు. చేరికల సందర్భంగా మానుకోటలో ఏర్పాటు చేసిన బహిరంగసభ విజయవంతమైంది. గతంలో ఓటమి పాలయ్యారనే సానుభూతి, తనకు టీడీపీ ఇతర పార్టీల నాయకులతో ఉన్న సంబం«ధాలతో, చేరికలతో గెలుపు తధ్యమనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. చాలా తండాలు ఏకగ్రీవంగా తనకే ఓటు వేస్తామని తీర్మాణాలు కూడా చేస్తున్నాయని తనకు జరిగిన అన్యాయాన్ని, తాను చేసిన సేవా కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని చెబుతున్నారు. 

     బీజేపీ అభ్యర్థి జాటోత్‌ హుస్సేన్‌నాయక్‌ తాను గూడూరు మండలం కావడం వల్ల స్థానికుడనే ముద్ర ఉంది. ఆ లోకల్‌ తోనే ప్రజలు ఆలోచించి తనకే ఓటు వేస్తారని బలమైన నమ్మకంతో ముందుకు పోతున్నారు. కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి పార్టీ పరంగానే నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దాంతో హుస్సేన్‌నాయక్‌ పేరు పూర్తి స్థాయిలో తెలిసిపోయింది. ఆ తరువాత కాంగ్రెస్‌ టికెట్‌ పట్ల జరుగుతున్న కుట్రలను చూసి వెంటనే బీజేపీలో చేరారు. ప్రతి మండలంలో కొంత బలమైన నాయకులను భారీ ఎత్తున పార్టీలో చేర్పించుకున్నారు. చేరికల పర్వం నేటికీ కొనసాగుతూనే ఉంది. మాజీ ఎమ్మెల్యే మాలోత్‌ కవితకు సంబంధించిన కొంత మంది అనుచరులతో పాటు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొంత మంది నాయకులు పార్టీలో చేరారు.  బలమైన నాయకులే పార్టీలో చేరడంతో ప్రచారంలో దూసుకెళ్లడం వాటి వల్ల బీజేపీ అభ్యర్థి హుస్సేన్‌నాయక్‌ గెలుపు తధ్యమనే ధీమాతో ఉన్నారు. 

చేరికలతో ఎవరికి నష్టం
బీజేపీ, బీఎల్‌ఎఫ్‌లో చేరుతున్న నాయకులతో ఏ పార్టీ ఓటు బ్యాంక్‌ తమ వైపు తిప్పుకుంటున్నారో టీఆర్‌ఎస్‌ లేక మహాకూటమికి నష్టం జరుగుతుందా అనే చర్చ మాత్రం తీవ్రంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే స్వతంత్ర అభ్యర్థులు ఏ పార్టీ నాయకుల ఓటు బ్యాంకును తమ వైపు మలచుకుంటున్నారు వారి వల్ల కూడా కొంత ఓటు బ్యాంక్‌ మారనుంది. ఆ నలుగురు అభ్యర్థులు మాత్రం చేస్తున్న ప్రచారం, చేరికలతో అంచనా వేయలేని స్థితిలో ఉన్నా అభ్యర్థులు మాత్రం ఎవరికి వారే గెలుస్తామనే ధీమా, పట్టుదల వారిలో కనిపిస్తుంది. 

ద్వితీయ శ్రేణి నాయకులకు గాలం 
అభ్యర్థులు ప్రధానంగా ద్వితీయ శ్రేణి క్యాడర్‌పైన దృష్టి సారించారు. వారి బలాబలాలను చూసి వా రిని తమ పార్టీలోకి చేర్చుకునేందుకు అభ్యర్థులు తమదైన శైలిలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement