
సాక్షి, సిటీబ్యూరో: ఇతర వ్యాపారాలతో పోలిస్తే ప్రైవేట్ పాఠశాల విద్య లాభసాటిగా మారింది. తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు సంపాదించి పెడుతోంది. అందుకే చాలామంది ప్రైవేట్ పాఠశాలలపై దృష్టిసారించారు. కాలనీల మధ్య ఖాళీ స్థలం ఉంటే చాలు ఎంచక్కా ఓ భవనం నిర్మించి స్కూల్ పెట్టేస్తున్నారు. లేకపోతే ఓ భవనాన్ని అద్దెకు తీసుకొని ఓ బోర్డు తగిలించేస్తున్నారు. ఎలాగూ ఇంటి పక్కనే స్కూలు ఉండడంతో తల్లిదండ్రులు కూడా మంచీచెడు ఆలోచించకుండా పిల్లలను వాటిలో చేర్పిస్తున్నారు. యాజమాన్యం అడిగినంత ఫీజూ చెల్లిస్తున్నారు. తీరా వాటికి గుర్తింపు లేదని తెలిసి తాము మోసపోయామంటూ ఆందోళనకు దిగుతున్నారు. అంతేకాదు నగరంలోని 50 శాతానికి పైగా ప్రైవేట్ పాఠశాలల్లో ఫైర్‌సేఫ్టీ లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక క్రీడా మైదానాల సంగతీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కనీసం గాలి కూడా దూరనంత ఇరుకైన గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. ఏదైనా విపత్తులు జరిగినప్పుడు భారీ మూల్యమే చెల్లించుకోక తప్పదు. కొన్ని యాజమాన్యాలు స్టేట్ సిలబస్‌కు గుర్తింపు తీసుకొని, గుట్టుచప్పుడు కాకుండా ఐఐటీ లాంటి కోర్సులు నిర్వహిస్తూ.. ఆ పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నాయి.
హైదరాబాద్‌లో 175 స్కూళ్లు...
హైదరాబాద్ జిల్లా పరిధిలో గుర్తింపు లేని ప్రాథమిక పాఠశాలలు 86 ఉండగా.. ప్రాథమికోన్నత పాఠశాలలకు అనుమతి తీసుకొని ఉన్నత పాఠశాల తరగతులు నిర్వహిస్తున్నవి 89 ఉన్నాయి. నాంపల్లి మండలంలో 6 ఉండగా, అమీర్‌పేట మండలంలో 14, బహదూర్‌పురా మండలంలో 17, బండ్లగూడలో 3, సైదాబాద్‌లో 5, ముషీరాబాద్‌లో 4, షేక్‌పేటలో 5, ఖైరతాబాద్‌లో 1, అసిఫ్‌నగర్‌లో 16, గోల్కొండలో 5, సికింద్రాబాద్‌లో 6, మారేడుపల్లిలో 4 ప్రైమరీ/అప్పర్ ప్రైమరీ పాఠశాలలకు గుర్తింపు లేనట్లు విద్యాశాఖ గుర్తించింది. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీకి గుర్తింపు తీసుకొని ఉన్నత పాఠశాలలు నడుపుతున్నవి భారీగానే ఉన్నాయి. జిల్లాలో అత్యధికంగా షేక్‌పేట మండలంలో 22 పాఠశాలలు ఉండగా, ఖైరతాబాద్‌లో 19, బహదూర్‌పురాలో 12, గోల్కొండ, ముషీరాబాద్ మండలాల్లో 15 పాఠశాలల చొప్పున ఉన్నట్లు గుర్తించారు. గుర్తింపు లేని ప్రైమరీ పాఠశాలల్లో ప్లేస్కూళ్లు, కిండర్ గార్డెన్ స్కూళ్లు ఎక్కువగా ఉంటే... ఆ తర్వాతి తరగతులకు అనుమతి లేని వాటిలో క్రిస్టియన్ మైనార్టీ పాఠశాలలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అధికారికంగా ఎలాంటి గుర్తింపు లేకపోయినా ఆయా పాఠశాలల్లో యథేచ్ఛగా అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆయా పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి, గుర్తింపు లేని వాటిని సీజ్ చేయాల్సిన జిల్లా విద్యాశాఖ కేవలం నోటీసుల జారీతో సరిపెడుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రంగారెడ్డిలో 40 స్కూళ్లు...
రంగారెడ్డి జిల్లాలో సుమారు 40 పాఠశాలలకు గుర్తింపు లేనట్లు విద్యాశాఖ గుర్తించింది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో ఈ గుర్తింపు లేని పాఠశాలలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. జిల్లాలో అత్యధికంగా ఒక్క సరూర్‌నగర్ మండలంలోనే ఎనిమిది పాఠశాలలు ఉన్నట్లు గుర్తించి, వాటికి ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు. ఇక మేడ్చల్ జిల్లాలోనూ 20 స్కూళ్లకు పైగా గుర్తింపు లేనట్లు సమాచారం. నోటీసుల తర్వాత కొన్ని యాజమాన్యాలు గుర్తింపు కోసం జిల్లా విద్యాశాఖకు దరఖాస్తు చేసుకున్నాయి. ఫైర్‌సేఫ్టీ, క్రీడలు, ఇతర మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అధికారులు అనుమతికి నిరాకరించినట్లు తెలిసింది. కానీ ఆయా పాఠశాలల్లో యథేచ్ఛగా అడ్మిషన్లు జరుగుతున్నాయి. అధికారికంగా ఒక బ్రాంచ్‌కి గుర్తింపు తీసుకొని, అనధికారికంగా అదే పేరుతో మరో చోట మరో బ్రాంచ్‌ను ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. ఆసక్తికరమైన అంశమేమిటంటే చాలా పాఠశాలలు స్టేట్ సిలిబస్‌కు అనుమతులు తీసుకొని ఐఐటీ, ఐసీఎస్సీ, సీబీఎస్‌సీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఇలా స్టేట్ సిలబస్ బోధించే పాఠశాలల్లో నేషనల్, ఇంటర్నేషనల్ సిలబస్‌ను ప్రవేశపెట్టి, కనీస అనుభవం, అవగాహన లేని ఉపాధ్యాయులతో బోధిస్తున్నాయి. పాఠశాల ఆవరణలోనే స్టేషనరీని తెరిచాయి. బుక్స్, షూస్, డ్రెస్‌లు, బ్యాగులు, లంచ్‌బాక్స్‌ల వరకు అన్ని యథేచ్ఛగా విక్రయిస్తున్నాయి. అంతే కాకుండా ఇక్కడ విక్రయించే వస్తువులకు బిల్లులు ఇవ్వడం లేదు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసి, వాటికి బిల్లులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. అదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే మేనేజ్‌మెంట్ ఆదేశాలు అంటూ సిబ్బంది సమాధానమిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment