
1944, ఫిబ్రవరి నెల.. రెండో ప్రపంచ యుద్ధ కాలం.. ఇటలీలోని పోర్ట్ ఆఫ్ నేపల్స్.. బ్రిటిష్ ఆఫీసర్ బ్రౌన్ సైనికుల రిజిస్టర్ చెక్ చేస్తున్నాడు.. అప్పుడే ఈజిప్టు నుంచి వచ్చిన నౌకలో పోలండ్ సైనికుల బృందం ఒకటి దిగింది.. జర్మన్, ఇటలీ సైన్యానికి వ్యతిరేకంగా తమతో కలిసి పోరాడటానికి.. అందుకే వారందరి వ్యవహారాలు చూడ్డానికి బ్రౌన్ ఇక్కడికి వచ్చాడు..
రిజిస్టర్ చూస్తూ.. ఒక్కో సైనికుడి పేరు పిలుస్తున్నాడు.. కార్పొరల్ వాయ్‌టెక్.. ఎవరూ పలకలేదు.. మరోసారి గట్టిగా పిలిచాడు.. ఊహూ.. సౌండ్ లేదు.. మరోసారి రిజిస్టర్ చెక్ చేసుకున్నాడు.. కార్పొరల్.. ఆర్మీలో నాన్ కమిషన్డ్ జూనియర్ ఆఫీసర్ ర్యాంక్.. సర్వీసు నంబర్ అంతా సరిగ్గానే ఉంది.. ఏమయ్యాడబ్బా.. వాయ్‌టెక్ అంటూ చిరాగ్గా ముఖం చిట్లించాడు.. అప్పుడొచ్చాడు వాయ్‌టెక్.. మందగమనంతో.. కేర్‌లెస్‌గా.. గుర్రుమన్నాడు.. అంతే.. అంతోటి ఆఫీసరుకూ ఆ చలికాలంలో చెమటలు పట్టాయి.. ఎందుకంటే వాయ్‌టెక్.. ఓ ఎలుగుబంటి!!
ఓ ఎలుగుబంటి సైనికుడా.. అదెలా.. తెలియాలంటే.. ఓ రెండేళ్లు వెనక్కి వెళ్లాలి..
1942లో ఇరాన్‌లోని పోలిష్ ఆర్మీ క్యాంప్.. అక్కడ గొర్రెలు కాచుకునే ఓ అబ్బాయికి చిన్నపాటి ఎలుగుబంటి దొరికింది. దాన్ని పట్టుకుని తిరుగుతున్నాడు. పోలండ్ సైనికులు చూశారు. కొన్ని టిన్ల ఆహారం, చాక్లెట్, స్విస్ కత్తి ఇస్తే.. ఆ ఎలుగుబంటిని ఇచ్చేశాడు. వారు దాన్ని పెంచుకోవడం మొదలుపెట్టారు. వాయ్‌టెక్ అని పేరు పెట్టారు. తమకు వచ్చే రేషన్‌లోని ఆహారాన్ని వంతులవారీగా వాయ్‌టెక్‌కు పెట్టారు. వాయ్‌టెక్ సైనికుల్లా బీర్లు తాగడం మొదలుపెట్టాడు.
సిగరెట్టు తాగడం, తినడం మొదలుపెట్టాడు. నిజానికి ఆ క్యాంప్‌లో ఉన్నవారిలో ఎక్కువమంది యుద్ద ఖైదీలు. పోలండ్‌ను సోవియట్ యూనియన్ ఆక్రమించుకున్నప్పుడు పట్టుబడినవారు. జర్మనీ సోవియట్ మీద దాడి చేసిన సమయంలో వారిని వదిలేశారు. ఇంటికి తిరిగివెళ్దామనుకున్నారు.. కానీ తమ దేశం సోవియట్ అధీనంలో ఉంది. యుద్ధ సమయంలో చాలా మంది కుటుంబ సభ్యులూ చనిపోయారు. దీంతో వాళ్లకి వాయ్‌టెక్ ఓ ఎంటర్‌టైన్‌మెంట్. అందుకే వాడితోనే మల్లయుద్ధం, బాక్సింగ్ చేసేవారు.
తాము ఏ దేశానికి వెళ్తే.. అక్కడికి తీసుకెళ్లేవారు. అయితే.. ఇప్పుడు వాయ్‌టెక్ ఆరడుగుల ఎలుగుబంటి. పెంపుడు జంతువంటే.. ఒప్పుకోవడానికి పోర్టు సిబ్బంది సిద్ధంగా లేరు. అందుకే.. పోర్ట్ ఆఫ్ నేపల్స్‌కు బయలుదేరినప్పుడు ఈజిప్టు పోర్టులో దాన్ని నిలిపేశారు. క్రూర జంతువన్నారు. దీంతో పోలండ్ సైనికులు ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. వాయ్‌టెక్‌ను సైనికుడిగా రిజిస్టర్ చేశారు. ర్యాంక్, సర్వీస్ నంబర్, పేబుక్ కూడా ఇచ్చారు. అందరిలాగే.. వాయ్‌టెక్‌కు శిక్షణ ఇచ్చారు. భారీ మందుగుండు సామగ్రి, క్షిపణులు ఉన్న బాక్సులను ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లడం నేర్పించారు.
ఇప్పుడు వాయ్‌టెక్ క్రూర జంతువు కాదు.. పోలండ్ సైనికుడు...
సైనికుడే కానీ సత్తా చాటే సమయం ఏదీ? అది కూడా రానే వచ్చింది. 1944.. మాంటే కసీనో యుద్ధం.. వెనుకంజ వేయలేదు.. బాంబులు పడుతున్నా బెదరలేదు..22వ ఆర్టిలరీ సప్లై కంపెనీ తరఫున యుద్ధ రంగంలోకి దూకాడు. మందుగుండు సామగ్రి ఉన్న బాక్సులతోపాటు భారీ క్షిపణులను మోస్తూ.. తమ సహచరులకు అందించాడు.. నిరంతరాయంగా పనిచేశాడు.. అచ్చంగా ఓ సైనికుడిలాగానే.. యుద్ధం ముగిసిన తర్వాత పోలండ్ సైనికులు బ్రిటన్ ఆశ్రయం కోరారు. వాళ్లతోనే వాయ్‌టెక్ కూడా.. స్కాట్లాండ్‌లో ఓ సెలబ్రిటీలా అయిపోయాడు. పిల్లలను తన వీపుమీద ఎక్కించుకుని.. వాగుల్లో ఈదాడు.
పార్టీల్లో డాన్సులేశాడు.. తర్వాత తర్వాత వాయ్‌టెక్‌ను ఎడిన్‌బర్గ్‌లోని జూకు పంపించారు. అంతవరకూ స్వేచ్ఛగా తిరిగిన వాయ్‌టెక్ నిర్బంధాన్ని తట్టుకోలేకపోయాడు.. విచారంగా ఉండేవాడు.. 1963లో జూలోనే చనిపోయాడు.. వాయ్‌టెక్ సేవలకు గుర్తింపుగా 22వ ఆర్టిలరీ కంపెనీ తమ లోగోను మార్చేసింది. క్షిపణులను మోస్తున్న వాయ్‌టెక్ బొమ్మను లోగోగా పెట్టుకుంది. ఎడిన్‌బర్గ్‌తోపాటు పలు ప్రాంతాల్లో వాయ్‌టెక్ విగ్రహాలు వెలిశాయి. యుద్ధంలో పాల్గొన్న ఎలుగుబంటిగా చరిత్రకెక్కాడు.. అందుకే అంటారు.. కార్పొరల్ వాయ్‌టెక్.. ఓ క్రూర జంతువు కాదు.. ఓ యోధుడు.. ఓ హీరో.. నాటికీ.. ఏనాటికీ..
– సాక్షి, తెలంగాణ డెస్క్
.
Comments
Please login to add a commentAdd a comment