తుర్కపల్లిలో మహిళ హత్య..! | Woman killed in turkapalli | Sakshi
Sakshi News home page

తుర్కపల్లిలో మహిళ హత్య..!

May 29 2014 11:21 PM | Updated on Mar 28 2018 10:59 AM

మండల పరిధిలోని తుర్కపల్లిలో ఓ మహిళ హత్యకు గురైంది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే దారుణం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.

శామీర్‌పేట్, న్యూస్‌లైన్:  మండల పరిధిలోని తుర్కపల్లిలో ఓ మహిళ హత్యకు గురైంది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే దారుణం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. ఈ సంఘటన గురువారం జరిగింది. పేట్ బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు, శామీర్‌పేట్ పోలీసులు, మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. నిజమాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం రత్నగిరిపల్లెకు చెందిన సూరి నర్సమ్మ(43), రాజయ్య దంపతులు. వీరికి ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. కొన్నాళ్ల క్రితం నర్సమ్మ భర్త మృతిచెందాడు. ఈక్రమంలో ఆమె బతుకుదెరువు కోసం పిల్లలను తీసుకొని శామీర్‌పేట్ మండలంలోని తుర్కపల్లికి వలస వచ్చింది.

 ఓ అద్దె ఇంట్లో ఉంటూ సీజన్‌పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. మూడేళ్ల క్రితం తుర్కపల్లికి చెందిన జీడిపల్లి గురుస్వామితో ఆమెకు పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం గురుస్వామి ఇంట్లో తెలిసింది. పలుమార్లు పంచాయితీ పెట్టి తీరు మార్చుకోవాలని ఇద్దరినీ హెచ్చరించిన ఫలితం లేకుండా పోయింది. ఈక్రమంలో బుధవారం రాత్రి నర్సమ్మ, గురుస్వామి తుర్కపల్లి శివారులోని ఓ దాబా వెనక ఉన్నారు. ఈవిషయం తెలుసుకున్న గురుస్వామి భార్య తులసమ్మ, కుమారుడు శ్రీకాంత్ అక్కడికి చేరుకున్నారు. తులసమ్మ, శ్రీకాంత్ నర్సమ్మను తీవ్రంగా చితకబాదారు.

అనంతరం అర్ధరాత్రి సమయంలో వారు నర్సమ్మను ఓ ఆటోలో తీసుకొచ్చి ఆమె ఇంటి దగ్గర వదిలేసి వెళ్లారు. నర్సమ్మ కుమారుడు రాజశేఖర్ గమనించి తల్లిని ఆస్పత్రికి తరలించే యత్నం చేశాడు. కొద్దిసేపటికే నర్సమ్మ మృతిచెందింది. శామీర్‌పేట్ పోలీసులు, పేట్‌బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు. పోలీసులు గురుస్వామి, ఆయన భార్య తులసమ్మతో పాటు కుమారుడు శ్రీకాంత్‌లను అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement