మెదక్ రూరల్ : మహిళ దారుణహత్యకు గురైన సంఘటన మండల పరిధిలోని భూర్గుపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, మృతురాలి కుమారుడు అరవింద్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన మైసన్నగారి కిష్టవ్వ (42), మైసయ్య దంపతులకు ఓ కుమార్తె స్వప్న, కుమారుడు అరవింద్ ఉన్నారు. మైసయ్య ఉపాధి పనుల నిమిత్తం కొన్నేళ్ల క్రితం ముంబ యికి వలస వెళ్లాడు. అయితే కుమార్తె స్వప్న కొద్ది రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
దీంతో కిష్టవ్వ, కుమారుడు అరవింద్ మాత్రమే ఇంట్లో ఉంటున్నారు. కాగా మృతురాలు కిష్టవ్వ మంగళవారం మెదక్‌కు వచ్చి కిరాణా సామగ్రిని కొనుగోలు చేసి ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అరవింద్, అతని మిత్రుడు రవితేజలు ఇంట్లో టీవీ చూస్తూ తొమ్మిది గంటల ప్రాంతంలో మూత్ర విసర్జన నిమిత్తం బయటకు వచ్చారు. ఈ సమయంలో ఇంటి సమీపంలో ఓ వ్యక్తి సెల్‌ఫోన్ పట్టుకుని తచ్చాడుతూ కనిపించాడు.
అయితే చీకట్లో సరిగా కనపడకపోవడంతో గ్రామానికే చెందిన వ్యక్తి అయి ఉండవచ్చని భావించిన అరవింద్ మిత్రుడితో కలిసి ఇంటికి వచ్చి రాత్రి పది గంటల వరకు టీవీ చూసి పడుకున్నారు. ఉదయం లేచి చూసేసరికి తల్లి నెత్తుటి మడుగులో ఉన్న విషయాన్ని చూసి అరవింద్ బోరుమన్నాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ రాజరత్నం, పట్టణ సీఐ కొమురయ్య, రూరల్ ఎస్‌ఐ వినాయక్ రెడ్డిలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీం వివరాలను సేకరించింది.
అదే విధంగా డాగ్‌స్క్వాడ్.. మృతురాలి ఇంటి నుంచి సమీపంలోని ఓ కల్లు దుకాణంలోకి వెళ్లి అక్కడ కూర్చుంది. అక్కడి నుంచి నేరుగా ఎస్సీ కాలనీలో గల పలువురు వ్యక్తుల ఇళ్ల ముందు నుంచి కాలనీలో తిరుగుతూ ప్రధాన సీసీ రోడ్డుకు వెళ్లింది. ఈ మేరకు పోలీ సులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
హంతకుడిని పట్టుకుంటాం : డీఎస్పీ రాజరత్నం
హత్యా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ రాజరత్నం అనంతరం విలేకరులతో మాట్లాడారు. కిష్టమ్మను పరిచయస్తులే చంపినట్లు హత్యా స్థలాన్ని బట్టి తెలుస్తోందన్నారు. మృతురాలి ఒంటిపై ఉన్న కడియాలు, పట్టగొలుసులు, గుండ్లను హంతకుడు అపహరించినట్లు ఆయన అనుమానించారు. కాగా నిందితుడు హత్యను పక్కదారి పట్టించేందుకు పుస్తెలతాడు, చెవి కమ్మలను అలాగే వదలి పోయాడని డీఎస్పీ చెప్పారు. హంతకుడిని అతి త్వరలో పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు.
మహిళ దారుణహత్య
Published Thu, Nov 13 2014 12:02 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement