సాక్షి, ఇబ్రహీంపట్నం: కొన్నేళ్ల క్రితం ఆమె భర్త మృతిచెందాడు.. దీంతో పుట్టింటికి వచ్చింది. ఉన్న ఒక్కగానొక్క కుమారుడిని తన సర్వస్వంగా భావించి అతడిని అపురూపంగా పోషించుకుంటోంది. ఆ దేవుడు అంతలోనే వారిని చిన్నచూపు చూశాడు. మహిళ తన తల్లి, కుమారుడితో కలిసి స్కూటీపై వెళ్తుండగా మృత్యువు రూపంలో వచ్చిన ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఆమె మృతిచెందగా కుమారుడు, తల్లికి తీవ్రగాయాలయ్యాయి. అందరి హృదయాలను ద్రవింపజేసే ఈ విషాదకర ఘటన ఆదివారం ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చర్లపటేల్‌గూడ శివార్లలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఇబ్రహీంపట్నంలో నివాసముండే రామిడి పావని(28) తన తల్లి వసంత(55), కుమారుడు లిక్విత్‌రెడ్డి(10)తో కలిసి స్కూటీపై అమ్మమ్మ ఇల్లు అయిన కర్ణంగూడకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో చర్లపటేల్‌గూడ నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లే దారిలో స్కూటీని వేగంగా వచ్చిన ట్రాలీ ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో పావని అక్కడిక్కడే మృతిచెందింది. ఆమె కుమారుడు లిక్విత్‌రెడ్డి, తల్లి వసంతకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించారు. అయితే, పావని అత్తగారిల్లు ఆదిబట్ల. ఆమె భర్త తొమ్మిదేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో కుమారుడితో కలిసి తల్లి వద్ద నివసిస్తుండేది. ఘటనా స్థలంలో మృతురాలి తల్లి రోదించిన తీరు హృదయ విదారకం. దేవుడా ఎంత పనిజేస్తివి అంటూ గుండెలుబాదుకుంది. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment