
ప్రియుడి ఇంటి ముందు ధర్నా చేస్తున్న యువతి
సాక్షి, దస్తురాబాద్ (ఆదిలాబాద్) : ప్రేమించిన ప్రియుడి చేతిలో మోసపోయిన ఓయువతి ప్రియుడి ఇంటి ఎదుట దీక్షకు దిగిన ఘటన మండలంలోని బుట్టాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులోని భాగ్యపల్లికి చెందిన సునీత పని నిమిత్తం ముంబైకి వలస వచ్చి ఒకరి ఇంట్లో హౌజ్ కీపింగ్ పనులు చేస్తోంది. అదే ఇంట్లో పనిచేస్తున్న మండలంలోని బుట్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం మహేష్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో వీరిరువురు గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి గర్భవతిని చేశాడు. ఇంటి దగ్గర అప్పు చేసానని, తన దగ్గర రూ.లక్ష యాబై వేలు తీసుకుని ఇంట్లో పెద్దవారిని ఒప్పించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ముంబాయి నుండి ఇంటికి వచ్చాడు. తీరా ఇంటికి వచ్చాక పెళ్లి చేసుకోనని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్‌లో పెట్టాడు.
దీంతో తనకు ఏంచేయాలో తెలియక దుర్గం మహేష్‌తో అద్దె గదిలో ఉంటున్న తోటి 11మంది మిత్రులను తీసుకొని ముంబై నుంచి బుట్టాపూర్ గ్రామానికి చేరుకుంది. మహేష్ గురించి ఇంట్లో అడిగితే కుటుంబసభ్యులు దూషించారు. దీంతో ఏం చేయాలో తెలియక మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసు అధికారులు మూడు రోజుల నుంచి స్వీకరించలేదు. దీంతో మహిళా సంఘాల మద్దతుతో గురువారం పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నాకు దిగింది. పోలీసులు బాధితురాలు, మహిళా సంఘాలతో కలిసి బుట్టాపూర్ గ్రామంలో మహేష్ ఇంటి ఎదుట దీక్షకు దిగారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ సీఐ జయరామ్, దస్తురాబాద్ ఎస్సై అశోక్ అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం బాధితురాలిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment