ప్రేమపేరుతో నాటకం.. రెండు రోజుల్లో పెళ్లి అనగా.. | Man Cheats Girl Over Love Affair In Chittoor District | Sakshi
Sakshi News home page

ప్రేమపేరుతో నాటకం.. శారీరకంగా వాడుకొని, రెండు రోజుల్లో పెళ్లి అనగా..

Published Tue, Mar 8 2022 8:52 AM | Last Updated on Tue, Mar 8 2022 12:46 PM

Man Cheats Girl Over Love Affair In Chittoor District - Sakshi

నిందితుడు కేదార్‌నాథ్‌తో చందన (ఫైల్‌)

నిమ్మనపల్లె(చిత్తూరు): ప్రేమ పేరుతో నయవంచనకు దిగాడో ప్రబుద్ధుడు. పదేళ్ల పాటు ప్రేమపేరుతో నాటకమాడి.. శారీరకంగా అనుభవించాడు. రెండు రోజుల్లో పెళ్లి అనగా ఊరు నుంచి ఉడాయించాడు. న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీస్‌ స్టేషన్ల చుట్టూ తిరుగుతోంది. సోమవారం తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి ప్రియుడి ఇంటి వద్ద నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాలు.. నిమ్మనపల్లె మండలం, చౌకిళ్లవారిపల్లెకు చెందిన దాసరి వెంకటరమణ రెండవ కుమారుడు డీ.కేదార్‌నాథ్‌(31) తమిళనాడులోని చెన్నై నగరంలో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నాడు.

చెన్నైలోని వెస్ట్‌తాంబరం, గాంధీనగర్, సలప్పస్ట్రీట్, ఎంసీపీ కాలనీకి చెందిన జయరాజ్, కుమారి దంపతుల ద్వితీయ కుమార్తె జీ.చందన(28)తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారి పదేళ్లకు పైగా కొనసాగింది. గత నెల ఫిబ్రవరి 21న చెన్నైలోని వెస్ట్‌తాంబరం, ముడిచెర్‌ రోడ్డు, పళనిగ్రాండ్‌ పార్టీ హాల్‌లో పెళ్లి జరిగేలా నిర్ణయించారు. ఆ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు రోజుల్లో పెళ్లి అనగా అక్కడి నుంచి ప్రియుడు మాయమయ్యాడు.

తర్వాత ఫోన్‌ చేసి తన తండ్రికి గుండెపోటు వచ్చిందని, స్వగ్రామం వెళ్తున్నాని ప్రియురాలికి చెప్పాడు. రెండు రోజులు తర్వాత కేదార్‌నాథ్‌తో మాట్లాడే ప్రయత్నం చేయగా అతని ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. కుటుంబ సభ్యులు సైతం స్పందించలేదు. దీంతో మోసిపోయానని చందన గ్రహించింది. తనకు న్యాయం చేయాలని చెన్నై పోలీసులను ఆశ్రయించింది. కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం బాధితురాలు చందన నిమ్మనపల్లె మండలం, చౌకిళ్లవారిపల్లెలోని ప్రియుడి ఇంటికి చేరింది.

అప్పటికే ప్రియుడు కుటుంబ సభ్యులతో సహా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయి ఉండడంతో అతని ఇంటిముందు కుటుంబ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఆపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనను పదేళ్లుగా ప్రేమ పేరుతో వంచించి, శారీరకంగా వాడుకుని మోసం చేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. స్పందించిన ఎస్‌ఐ ఫాతిమా నిందుడిని పట్టుకుని చెన్నై పోలీసులకు అప్పగిస్తామని తెలిపారు. ఈ నిరసనలో దళిత నాయకులు ఎర్రయ్య, గంగులప్ప పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement