బిందెలతో మంత్రి లక్ష్మారెడ్డి ఇల్లు ముట్టడి
జడ్చర్ల (మహబూబ్‌నగర్ జిల్లా) : తాగు నీటి కోసం మహిళలు ఖాళీ బిందెలతో రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి ఇంటిని ముట్టడించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని మంత్రి లక్ష్మారెడ్డి ఇంటి ముందు బైఠాయించి ధర్నా నిర్వహించి మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక తాలుకా క్లబ్, విద్యానగర్, మసీద్ ఏరియా ప్రాంతాలకు సంబంధించి గత కొంత కాలంగా తాగు నీటి ఏర్పాట్లు లేవని, కొత్తగా ఏర్పాటు చేస్తున్న పైపు లైను పనులు కూడా నాసిరకంగా ఉన్నాయని, అవి కూడా అసంపూర్తిగా ఉన్నాయని, తమ సమస్యను పరిష్కరించడంలో మంత్రి లక్ష్మారెడ్డి నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు.
ఎన్నికల సమయంలో మంత్రి సతీమణి తమ దగ్గరకు వచ్చి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, అనంతరం తమ సమస్యను పట్టించుకోలేదని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. వెంటనే తమ సమస్యను పరిష్కరించే వరకు తాము ఇక్కడి నుండి కదలబోమని స్పష్టం చేశారు. దీంతో టీఆర్‌ఎస్ నాయకులు, సంగిల్ విండో మాజీ చైర్మన్ పిట్టల మురళి సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి మూడు రోజులలో తాగు నీటి సమస్యను పరిష్కరిస్తామని, ఇంటింటికి నీటిని సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ధర్నా విరమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ జంగయ్య ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును నిర్వహించారు.సమస్య పరిష్కారం కాకపోతే మళ్లీ ఆందోళనకు దిగుతామని ఈ సందర్భంగా మహిళలు హెచ్చరించారు.