పోలీసుల సంక్షేమానికి కృషి చేస్తాం: డీజీపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపులో ఉంచడంలో పోలీసుల కృషి ఎనలేనిదని, వారి సంక్షేమానికి మరింత కృషి చేస్తామని డీజీపీ అనురాగ్‌శర్మ అన్నారు. పోలీసుల సంక్షేమంలో భాగంగా సిబ్బంది కంట్రిబ్యూషన్‌తో నడుస్తున్న ‘భద్రత’ పొదుపు సంఘం మొదటి సర్వసభ్య సమావేశం ఆదివారం డీజీపీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా 2014-15 సంవత్సర కార్యకలాపాలను ఐజీ సౌమ్యామిశ్రా, సంఘం కార్యదర్శి గోపాల్ రెడ్డిలు వివరించారు. సిబ్బంది జీతభత్యాలు, వారి కుటుంబ సభ్యుల మేలును దృష్టిలో పెట్టుకొని పొదుపు, ఆరోగ్య భద్రత పథకాలను మరింత ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2,441 మందికి వ్యక్తిగత రుణాల కింద రూ.30.06 కోట్లు అందజేసినట్లు వివరించారు.
అలాగే 252 మందికి గృహ అవసరాల కోసం రూ.17.23 కోట్లు, పిల్లల ఉన్నత చదువుల కోసం రూ.8.78 కోట్లు అందజేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆరోగ్య భద్రతపై ప్రత్యేకంగా చర్చించారు. వివిధ జిల్లాల ప్రతినిధులు మాట్లాడుతూ... కొన్ని ఆస్పత్రులు పోలీసు సిబ్బందిని పట్టించుకోవడం లేదని, ఎమర్జెన్సీ సమయంలో చేర్చుకోవడం లేదని అన్నారు. భద్రత సంస్థ చైర్మన్, డీజీపీ అనురాగ్‌శర్మ మాట్లాడుతూ పోలీసు సంక్షేమం కోసం నూతన పద్ధతులు అవలంబిస్తామని చెప్పారు. భద్రత, ఆరోగ్య సేవలకు సంబంధించి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తామన్నారు. త్వరలో ప్యానల్‌లో ఉన్న ఆస్పత్రులను పరిశీలిస్తామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో సంస్థ మేనేజింగ్ కమిటీ సభ్యులు వీవీ శ్రీనివాసరావు, బాలనాగదేవి, కల్పనా నాయక్, శివధర్‌రెడ్డిలతో పాటు పోలీసు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపిరెడ్డి, కరణ్‌కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.