ఇంకొంత కాలం ఇంటినుంచే | Work From Home Extended June In IT Companies At Hyderabad | Sakshi
Sakshi News home page

ఇంకొంత కాలం ఇంటినుంచే

Published Thu, May 21 2020 7:50 AM | Last Updated on Thu, May 21 2020 11:03 AM

Work From Home Extended June In IT Companies At Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రెండు రోజుల క్రితం రాష్ట్రమంతటా పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ తొలగిస్తున్నట్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం,  రాజధాని హైదరాబాద్‌తో సహా అన్ని జిల్లాలను గ్రీన్‌ జోన్‌గా ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వంద శాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అనుమతించింది. ఆంక్షలు వంద శాతం సడలించినా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో ఇంకా కరోనా భయం తొలగక పోవడంతో ఐటీ కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌ విధించకమునుపే అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ విధానానికి శ్రీకారం చుట్టాయి. (కరోనా: ఇంటి అవసరం.. ఇంకా పెరిగింది!)

లాక్‌డౌన్‌ పీరియడ్‌లో 95 శాతం మంది ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేందుకు మొగ్గు చూపగా, కంపెనీలు కూడా అనుమతించాయి. అవసరమైన ల్యాప్‌టాప్‌లు, బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్, డాంగుల్స్‌ వంటి వాటిని కూడా కొన్ని ఐటీ కంపెనీలు ఉద్యోగులకు సమకూర్చాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేసి వంద శాతం ఉద్యోగులతో కార్యకలాపాలు కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అయినా రెండు రోజులుగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల హాజరు శాతం 8 నుంచి పది శాతం లోపే ఉన్నట్లు ఐటీ వర్గాలు చెప్తున్నాయి.  

జూన్‌ నెలాఖరు వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 
కరోనాపై భయాందోళన తొలగక పోవడంతో విధులకు హాజరు కావాలంటూ ఒకటీ అరా మినహా పెద్ద ఐటీ కంపెనీలేవీ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేయలేదు. టీసీఎస్‌ వంటి బడా ఐటీ కంపెనీలు జూన్‌ నెలాఖరు వరకు వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానాన్ని పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. లాక్‌డౌన్‌ ఎత్తివేతను దృష్టిలో పెట్టుకుని కొన్ని ఐటీ కంపెనీలు కార్యాలయాల్లో శానిటైజేషన్, భౌతిక దూరం పాటించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. వారానికి ఐదు శాతం చొప్పున ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల హాజరు శాతం పెరిగి జూలై నెలాఖరుకు ఆఫీసుల నుంచే పనిచేసే పరిస్థితులు మెరుగవుతాయని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) అధ్యక్షులు భరణికుమార్‌ ఆరోల్‌ ‘సాక్షి’కి వెల్లడించారు. లాక్‌డౌన్‌ తొలగించినా ఉద్యోగుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత ఐటీ కంపెనీలపై ఉందన్నారు. ప్రస్తుతం ఐటీ కారిడార్లో ఉద్యోగుల హాజరు శాతం పది శాతం మేర ఉన్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ‘సాక్షి’కి వెల్లడించారు. ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ విధానంలో పనిచేసేందుకు ఐటీ కంపెనీలకు ఎలాంటి ఇబ్బందులు లేనందున మరికొంత కాలం ఇంటి నుంచే పనిచేసే అవకాశమున్నట్లు జయేశ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

యూరోప్, అమెరికా పరిస్థితిపై మదింపు 
ఐటీ రంగం లావాదేవీలు ఎక్కువగా అమెరికాతో పాటు యూరోప్‌ దేశాలపై ఆధారపడి ఉండటంతో అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఐటీ యాజమాన్యాలు దృష్టి పెడుతున్నాయి. లాక్‌డౌన్‌ మూలంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, టెలికామ్, రిటైల్‌ రంగాలపై భారీగా ప్రభావం పడింది. ఈ రంగాలు ఎంత త్వరగా పుంజుకుంటాయనే అంశంపైనే ఐటీ రంగం పురోగతి ఆధారపడి ఉందని భరణికుమార్‌ వెల్లడించారు. జూలై నెలాఖరుకు ఐటీ కార్యాలయాల్లో ఉద్యోగుల శాతం మెరుగవడంతో పాటు ఈ ఏడాది చివరి నాటికి ఐటీ రంగం పూర్వ స్థితికి చేరుకునే అవకాశముందన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement