ఏపీ ప్రభుత్వంలో పనిచేయం..
- తమకు తెలంగాణ ప్రభుత్వమే జీతాలివ్వాలి..
- విద్యుత్తుసౌధ కాంట్రాక్టు ఉద్యోగుల డిమాండ్
పంజగుట్ట: ‘తాము 20 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాం. విభజన నేపథ్యంలో తమను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపే యత్నం జరుగుతోంది. మేం అక్కడ పనిచేయం. జీతాలు తెలంగాణ ప్రభుత్వమే ఇవ్వాలి. అక్కడి ప్రభుత్వం తమను ఉద్యోగాల్లోంచి తీసేస్తే పరిస్థితి ఏమిటని’విద్యుత్తుసౌధ కాంట్రాక్టు ఉద్యోగులు ప్రశ్నించారు. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలంటూ బుధవారం ఉద్యోగులు సౌధ ప్రాంగణంలో విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈసందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ప్రధానకార్యదర్శి సాయులు మాట్లాడుతూ విభజన నేపథ్యంలో సౌధలో ఆంధ్రప్రదేశ్‌కు 58 శాతం, తెలంగాణకు 42 శాతంగా విభజించారని..అయితే కాంట్రాక్టు ఉద్యోగుల్లో 90శాతం తెలంగాణ వారే ఉన్నార న్నారు. తమలో 150 నుంచి 200 మందిని ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేసే యత్నం జరుగుతోందని, అక్కడి ప్రభుత్వం,యాజమాన్యం తమను విధుల్లోనుంచి తొలగిస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
ఇప్పటికే చాలీచాలని వేతనాలతో ఉద్యోగులు తీవ్ర సతమతమవుతున్నారన్నారు. విద్యుత్‌సౌధలో కాంట్రాక్టు విధానం రద్దు చేసి..నేరుగా తెలంగాణ ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని, విడతల వారీగా ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.