
ప్రత్యేక అలంకరణలో ఉత్సవమూర్తులు
పంచనారసింహుడిగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు స్వస్తిశ్రీ వికారినామ సంవత్సర పాల్గుణ శుద్ధతదియ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 7వ తేదీ పాల్గుణ శుద్ధత్రయోదశిన శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. ప్రతిరోజూ స్వామివారి విశేష అలంకరణ పూజలు కొనసాగనున్నాయి. దీంట్లోభాగంగా ముఖ్య ఘట్టాలైన స్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం మార్చి 3న, తిరుకల్యాణం 4న, దివ్య విమాన రథోత్సవం 5న జరుగుతాయి. మార్చి 7న శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ఇందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో యాదాద్రి దేవస్థానం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
– యాదగిరిగుట్ట (ఆలేరు)
సాక్షి, యాదగిరిగుట్ట (ఆలేరు) : స్తంబోద్భవుడైన సర్వాంతర్యామి భూలోక వాసులకు అండగా ఉండేందుకు గుహల్లో కొలువై ఉంటాడు. నారసింహుడు రాతి గుహల్లో.. అటవీ ప్రాంతాల్లో ఉండేందుకే ఇష్టపడతాడు. అందుకే ఆ స్వామిని ‘మృగ నరహరి’గా పిలుస్తారు. అహోబిలంలో హిరణ్యకశపుడిని వధించాక.. ఆ ఉగ్రుడు అడవుల్లో సంచరిస్తుండగా ఆయనను శాంతింపజేసేందుకు బ్రహ్మాది దేవతలు లక్ష్మీదేవిని వేడుకుంటారు. అమ్మ చెంచు లక్ష్మీగా ఈ ప్రాంతంలో అవతరించి నరహరిని శాంతింపజేసింది. యాదవ మహర్షి తపస్సుతో సింహరూపుడు పంచరూపాలతో సాక్షాత్కరించి స్వయంభువుగా వెలిశారని ఈ క్షేత్ర చరిత్ర చెబుతోంది. రుష్యారాధన క్షేత్రంగానూ యాదాద్రి విరాజిల్లుతోంది. చతుర్వేదాలు ఇక్కడే తిష్టవేసినట్లు ఉంటుంది. ప్రతి జలధార బ్రహ్మ కడిగిన పాదాల పవిత్ర తీర్థమే అన్నట్లు గోచరిస్తోంది. అభయ ప్రధాత నారసింహుడు భక్తులను వెన్నంటి ఉండే ఆపద్భాందవుడిగా భక్తులు కొలుస్తుంటారు. పిలిస్తే పలికే ఆప్తుడిగా జనుల గుండెల్లో కొలువై ఉన్న యాదగిరీశుడి క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతోంది.
సౌభాగ్య ప్రదాయిని లక్ష్మీదేవితో కొలువైన క్షేత్రమిది. యాదగిరి లక్ష్మీనరసింహుడి రూపం ఉగ్రం, మనస్సు నవనీతం, ఘనసింహం గర్జిస్తున్నట్లు.. ముల్లోకాలను వణికించే మృగరాజు పంజా విసురుతున్నట్లు హిరణ్య కశపుడిని రక్కి, చీల్చి చండాడిన ఆ వాడి గోళ్ల చేతులు ఆది మహాలక్షి్మని మాత్రం అతి సున్నితంగా అక్కున చేర్చుకున్నాయి. సృష్టికర్త బ్రహ్మకే ఆయువు పోసిన బ్రహ్మాండనాయకుడని పురాణాలు ఘోషిస్తున్నాయి. నరసింహుడిని దర్శించుకున్న సృష్టికర్త బ్రహ్మ “ఉగ్రం వీరం మహా విష్ణుం.. జల్వంతం సర్వతో ముఖం.. నృసింహం భీషణం భద్రం.. మృత్యు మృత్యుం సమామ్యహం’ అంటూ అర్చించాకే బ్రహ్మ సృష్టి కార్యాన్ని ప్రారంభించాడని పండితులు చెబుతుంటారు. సింహరూపుడైన శ్రీహరి అంటే ఎంతో భక్తి కాబట్టే స్వహస్తాలతో బ్రహ్మోత్సవాలను ఆ చతుర్ముఖుడే స్వయంగా నిర్వహిస్తాడని క్షేత్ర చరిత్ర చెబుతోంది.
పురాణాల పరంగా..
ఇతిహాసాలు రామాయణ మహాకావ్యంలోనూ యాదాద్రి ప్రాశస్త్యం గురించి ప్రస్తావన ఉంది. మహాజ్ఞాని విభాండకుడి కుమారుడు రుష్యశృంగుడు, అతడి పుత్రుడైన యాద మహర్షి తపోశక్తితోనే యాదగిరిగుట్ట వెలసిందంటారు. యాదుడు బాల్యం నుంచి మహావిష్ణు భక్తుడు. ఉగ్రరూపుడైన నృసింహావతారం పట్ల ఎనలేని మక్కువ కలిగింది. దైవసాక్షాత్కరం కోసం దట్టమైన అడవుల్లో తిరుగుతూ కొండజాతికి చిక్కాడు. ఆటవికులు యాదుడిని క్షుద్ర దేవతలకు బలి ఇవ్వబోయారు. ఈ సమయంలో ఆంజనేయుడు అండగా నిలిచాడు. కీకారణ్యంలో సింహాకార గుట్టలు ఉన్నాయని, అక్కడికి వెళ్లి తపస్సు చేస్తే స్వామి సాక్షాత్కారిస్తాడని యాదుడికి ఆంజనేయుడు సూచించాడు. దీర్ఘకాలిక తపస్సుతో ఫలించి స్తంబోద్భవుడు తొలుత జ్వాలా, గండబేరుండ, యోగానంద, ఉగ్రసింహ, శ్రీలక్ష్మీ సమేతుడిగా (పంచరూపాలతో) దర్శనమిచ్చాడు. మహర్షి కోరిక ఫలితంగా సాక్షాత్కరించిన నారసింహుడు ఈ గుహలోనే కొలువై ఉన్నాడు. దీంతో ఈ క్షేత్రాన్ని పంచనారసింహ నిలయంగా పురణాలకెక్కింది. యాద రుషి కోరిక ఫలితంగా వెలసిన ఈ క్షేత్రం యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందింది.
.
బ్రహ్మోత్సవ వైభవం..
ఈ నారసింహ క్షేత్రంలో ప్రతి యేటా పాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఉత్సవాలను తొలుత సృష్టికర్త ప్రారంభించడంతో బ్రహ్మోత్సవాలన్న పేరు స్థిరపడింది. ఈ ఉత్సవాలతో స్వామి క్షేత్రం11 రోజులూ ముక్కోటి దేవతల విడిదిల్లుగా మారుతుంది. పూర్వం శ్రీస్వామి సన్నిధిలో వేద మంత్ర ఘోషలు వినిపించేవట. బ్రహ్మోత్సవ వేళ యాదగిరి వేదగిరి అన్న ప్రాచీణ నామాన్ని సార్థకం చేసుకుంటుంది. ఈ సందర్భంగా సకల దేవతల్ని శాస్త్రోక్తంగా ఆహ్వానించి వేదోక్తంగా పూజలు నిర్వహించడం సంప్రదాయం. విశ్వక్సేన పూజతో మొదలై స్వయంభువులకు నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మొదట ధ్వజారోహణంలో మహావిష్ణువు వాహనమైన వేద స్వరూపుడు గరుత్మంతుడికి పూజలు నిర్వహిస్తారు. మూడో రోజు నుంచి అలంకార సంబరాలు జరుగుతాయి. ఏడు, ఎనిమిది, తొమ్మిది రోజుల్లో విశేష పర్వాలైన ఎదుర్కోలు, కల్యాణ మహోత్సవం, రథయాత్ర నిర్వహిస్తారు. పదో రోజున చక్రస్నానం జరుపుతారు. అనంతరం రథోత్సవం నిర్వహిస్తారు.
రక్షణగా సుదర్శన చక్రం..
తపోముద్రలో ఉన్న మహర్షిని మింగేయాలని ప్రయత్నించిన ఒక రాక్షసుడిని మరుక్షణమే విష్ణుమూర్తి సుదర్శన చక్రం అడ్డుకుని వధించింది. ఆటంకాలు, ఆపదలు కలగకుండా గుట్ట చుట్టూ సుదర్శనం రక్షా కవచంగా నిలిచి ఉంటుందన్నది భక్తుల అపార విశ్వాసం. స్వామి పుష్కరిణి సాక్షాత్తూ బ్రహ్మ కడిగిన పాదాల నుంచే పుట్టిందంటారు. ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే శారీరక రుగ్మతలు, గ్రహ బాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తు నమ్మకం. ఎంతో కాలం మరుగున పడిపోయిన ఈ క్షేత్ర మహత్యాన్ని స్థానిక గ్రామాధికారి గుర్తించాడట. స్వామి కలలో కనిపించిన తన అవతార రహస్యాన్ని చెప్పాడట. హైదరాబాద్ వాస్తవ్యులు రాజామోతీలాల్ 1920లో ఆలయాన్ని నిర్మించి పూజాధికాలు పునరుద్ధరించారని చరిత్ర చెబుతోంది. ఆయన హయాంలోనే పంచరాత్ర ఆగమ శాస్త్ర విధానంతో పూజలు మొదలయ్యాయి.
స్వస్తివాచనంతో ఆరంభం.. డోలోత్సవంతో ముగింపు
యాదగిరిగుట్ట (ఆలేరు) : అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు.. ఏకశిఖరవాసుడు.. పంచనారసింహుడిగా విరాజిల్లుతున్న పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు స్వస్తి శ్రీ వికారినామ సంవత్సర పాల్గుణ శుద్ధ తదియ బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 7 పాల్గుణ శుద్ధ త్రయోదశిన డోలోత్సవంతో ముగుస్తాయి. మార్చి 2 నుంచి 7 వరకు థార్మిక సాహిత్య సంగీత మహాసభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాల్లో 60 నుంచి 70మంది పారాయణీకులు, రుత్వికులు, ఆచార్యులు పాల్గొననున్నారు.
స్వస్తివాచనంతో ప్రారంభమై..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం శ్రీవిశ్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ప్రారంభమై, మార్చి 7న రాత్రి 9గంటలకు శ్రీస్వామి వారి డోలోత్సవంతో సమాప్తం అవుతాయి. 28వ తేదీన అలంకార సేవలు, వాహన సేవలకు శ్రీకారం చుడతారు. ఇక ప్రధాన ఘట్టాలు.. మార్చి 3న శ్రీస్వామి ఎదుర్కోలు ఉత్సవం, 4న శ్రీస్వామి తిరుకల్యాణోత్సవం, 5న దివ్య విమాన రథోత్సవ వేడుకలు నిర్వహిస్తారు.
11 రోజులు ఆర్జిత సేవలు బంద్..
బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదాద్రి కొండపై ఉన్న బాలాలయంలో ఈ నెల 26 నుంచి మార్చి 7 వరకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలు రద్దు చేస్తున్నట్లు ఈఓ పేర్కొన్నారు. మార్చి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు భక్తులచే నిర్వహించబడే అర్చనలు, బాలభోగాలు నిలిపివేయనున్నట్లు తెలిపారు. 6, 7తేదీల్లో అభిషేక, అర్చనలు రద్దు చేసినట్లు చెప్పారు.
యాదాద్రిలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. ఉదయం బాలాలయంలో ఉత్సవ మూర్తులను పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం పట్టువస్త్రాలను ధరింపజేసి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. వేకువజామునే ఆలయాన్ని తెరచి ఆరాధన, సహస్త్ర నామార్చన, సువర్ణ పుష్పార్చన వంటి నిత్య కైంకర్యాలను నిర్వహించారు. నిత్యకల్యాణంలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అంతకు ముందు శ్రీసుదర్శన నారసింహహోమం, అష్టోత్తర పూజలు చేశారు.
క్షేత్రపాలకుడికి ఆకుపూజ..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలోని విష్ణుపుష్కరిణి చెంతనున్న ఆంజనేయస్వావిుకి ఆచార్యులు విశేష పూజలు చేశారు. స్వామివారిని సింధూరంతో అభిషేకించి, తమలపాకులతో అలంకరించారు. శ్రీస్వామి భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.
యాదాద్రిని సందర్శించిన పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్ మంగళవారం దర్శించుకున్నారు. బాలాలయంలోని ప్రతిష్టమూర్తులకు ప్రత్యేక పూజలు చేసిన కార్పొరేషన్ చైర్మన్ దామోదర్‌కు మండపంలో ఆలయ ఆచార్యులు శ్రీస్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఇచ్చారు. ఆలయ అధికారులు లడ్డూప్రసాదం అందజేశారు.
భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. బుధవారం నుంచి ప్రారంభమయ్యే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయంతోపాటు ఆలయ వీధుల్లో, పట్టణంలో, ఘాట్ రోడ్డులో తాత్కాలిక విద్యుత్ దీపాలంకరణ చేస్తున్నాం. బాలాలయాన్ని పుష్పాలంకరణతో తీర్చిదిద్దుతున్నాం. ఈసారి కూడా శ్రీస్వామి వారి కల్యాణం ఉద యం బాలాలయంలో, రాత్రి హైసూ్కల్ మైదానం, దివ్య విమాన రథోత్సవం రాత్రి 7గంటలకు ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. 7.30గంటలకు వైకుంఠద్వారం నుంచి యాదగిరిగుట్ట పట్టణంలో ఊరేగింపు ఉంటుంది. – గీతారెడ్డి, యాదాద్రి దేవస్థాన ఈఓ
యాదాద్రిలో ఇలా..
యాదగిరిగుట్ట (ఆలేరు) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పూజా కార్యక్రమాల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సుప్రభాతం రూ.100, అష్టోత్తరం రూ.100, సువర్ణ పుష్పార్చన రూ.516, స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణం రూ.1250, అభిషేకం ఇద్దరికి రూ.500, సహస్త్ర నామార్చనలు ఒక్కరికి రూ. 216, శాశ్వత కల్యాణం రూ.6వేలు పది సంవత్సరాలు మాత్రమే, అమ్మవారి కుంకుమార్చన, సహస్త్ర నామార్చన రూ.216 ఒక్కరికి, శ్రీసుదర్శన నారసింహ హోమం రూ.1016, అన్నప్రాసన రూ.500, అండాల్ అమ్మవారి జోడు సేవ రూ.750 (ప్రతి శుక్రవారం), జోడు సేవ రూ.500 (ప్రతి రోజు), శతఘటాభిషేకం రూ.750 (స్వాతి నక్షత్రం రోజు), లక్ష పుష్పార్చన రూ.2016 (ప్రతి ఏకాదశి), శ్రీసత్యనారాయణస్వామి వ్రతం రూ.500, నిత్య బ్రహ్మోత్సవం రూ.2001, శాశ్వత బ్రహ్మోత్సవం రూ.10వేలు, శయనోత్సవం రూ.100 ఉంటుంది.
లడ్డూ ప్రసాదం ప్రత్యేకం
తిరుమల దేవస్థానం తర్వాత ఈ ఆలయంలో తయారు చేసే లడ్డూ, పులిహోరకు అంత ప్రాధాన్యత ఉంది. అభిషేకం లడ్డూ రూ.100, చిన్న లడ్డూ రూ.20, బెల్లం లడ్డూ రూ.25, పులిహోర రూ.15, వడ రూ.20, దద్దోజనం రూ.15లకు విక్రయిస్తారు.
ఇలా చేరుకోవచ్చు
యాదగిరిగుట్టకు బస్సు మార్గంలో చేరుకునే భక్తులు ఇలా రావొచ్చు. హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్లు, నల్ల గొండ నుంచి 90కిలోవీుటర్లు ఉంటుంది. నల్లగొండ జిల్లా నుంచి వచ్చే భక్తులు నల్ల గొండ, నార్కట్‌పల్లి, చిట్యాల, రామన్నపేట, వలిగొండ, భువనగిరి మీదుగా యాదగిరిగుట్టకు చేరుకోవచ్చు. సిద్దిపేట జిల్లా నుంచి వచ్చే భక్తులకు మూడు మార్గాలు ఉన్నాయి. సిద్దిపేట, దుద్దెడ, కొమురవెల్లి, కొండపోచమ్మ, రాజపేట, యాదగిరిగుట్ట ఒక మార్గం. ప్రజ్ఞాపూర్, జగదేవ్‌పూర్, తుర్కపల్లి మీదుగా యాదగిరిగుట్టకు రెండవ మార్గం ఉంది. మూడవ మార్గం సిద్దిపేట, దుద్దెడ, చేర్యాల, కొలనుపాక, ఆలేరు, వంగపల్లి, మీదుగా యాదగిరిగుట్టకు రావచ్చు. ఇక సూర్యాపేట నుంచి వచ్చే భక్తులు తిరుమలగిరి, మోత్కూర్, ఆత్మకూర్, యాదగిరిగుట్టకు రావొచ్చు. వరంగల్ నుంచి వచ్చే భక్తులు మడికొండ, స్టేషన్‌ఘన్‌పూర్, జనగాం, పెంబర్తి, ఆలేరు, వంగపల్లి మీదుగా చేరుకోవచ్చు. ఇక కీసర నుంచి వచ్చే భక్తులు కీసర, బొమ్మలరామారం, తుర్కపల్లి మీదుగా యాదగిరిగుట్టకు చేరుకోవచ్చు. హైదరాబాద్– సికింద్రాబాద్ నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంది. అలాగే నిజామాబాద్, మహబూబ్‌నగర్, షాద్‌నగర్, నారాయణఖేడ్, సిద్దిపేట, మెదక్, జగిత్యాల, రాణీగంజ్, నల్లగొండ, మేడ్చల్, తాండూరు, పరిగి, వనపర్తి, విజయవాడ, కర్నూల్, శ్రీశైలం, నారాయణపేట, వేములవాడ, కొమురవెల్లి, తదితర ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది.
రైల్వే సౌకర్యం
హైదరాబాద్, వరంగల్ మార్గాల నుంచి యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు రైల్వే సౌకర్యం ఉంది. భువనగిరితో పాటు, మండలంలోని రాయిగిరిలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి రాయిగిరి రైల్వేస్టేషన్‌లో పుష్‌పుల్, కాకతీయ ప్యాసింజర్లు, కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగుతాయి. రాయిగిరి రైల్వేస్టేషన్ నుంచి యాదగిరగుట్ట 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ దిగిన భక్తులకు ఆటోలు, బస్సుల సౌకర్యం ఉంటుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి భువనగిరి మీదుగా వరంగల్ వెళ్లే మంచిర్యాల, కృష్ణా, ఇంటర్‌సిటీ, తెలంగాణ, ఈస్ట్‌కోస్ట్, పుష్‌పుల్, గోల్కొండ, భాగ్యనగర్, కాకతీయ, గౌతమి, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు భువనగిరి రైల్వేస్టేషన్‌లో ఆగుతాయి. వరంగల్ వైపు నుంచి భువనగిరి మీదుగా తిరిగి సికింద్రాబాద్‌కు వెళ్లే ఈ రైళ్లన్నీ భువనగిరి స్టేషన్‌లో ఆగుతాయి. భువనగిరి నుంచి యాదగిరిగుట్టకు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడి నుంచి బస్సు, ఆటోల సౌకర్యం ఉంటుంది.
జట్కా సౌకర్యం
శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు ప్రయాణ సౌకర్యం లేనప్పటి నుంచి నేటి వరకు జట్కాలు రవాణా సౌకర్యం ఉంది. హైదరాబాద్–వరంగల్ నగరాలకు మధ్యలో ఉన్న యాదగిరిగుట్ట ఆవిర్భవించిన నాటి నుంచి టాంగాలు ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం పట్నం వాసులు పాతగుట్టకు వెళ్లాలంటే తాము తీసుకువచ్చిన వాహనాలను పక్కనపెట్టి జట్కాల (గుర్రపు బండ్ల) పైనే ప్రయాణం చేస్తుంటారు. అంతే కాకుండా పాతగుట్టతో పాటు స్థానికంగానే ఉన్న సురేంద్రపురి, హాయగీవ్ర ఆలయాలకు వెళ్లాలన్న జట్కాలపైనే ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తుంటారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే భక్తులకు భోజన సౌకర్యాన్ని కల్పిస్తుంది. సన్నిధి ఎమరాల్డ్ హోటల్. హోటల్‌కు వచ్చే భక్తులకు రూ.199తో బఫెట్ ఏర్పాటు చేశారు. ఈ భోజనం మధ్యాహ్నాం 12గంటల నుంచి ప్రారంభమై సాయంత్రం 4గంటల వరకు ఉంటుంది. బఫెట్‌లో 18రకాల రుచులను హోటల్ యాజమాన్యం అందిస్తుంది.
ఇక్కడ ఉండవచ్చు
కొండపైన విస్తరణ పనులు జరుగుతుండడంతో గదులను కూల్చివేశారు. దీంతో భక్తులకు కావలసిన గదులన్నీ తులసీ కాటేజీలో నిర్మాణం చేశారు. నృసింహ సదనంలో సుమారు 100 గదుల నిర్మాణం చేశా రు. ఇందులో ఒక్కో గది కేవలం రూ.300, ఉంటుంది. ఈ సదనం ప్రక్కనే లక్ష్మీ సదనం ఉంటుంది ఇందులో 100 గదులు ఉన్నాయి. ఇందులో రూ.500 ఒక్కో గదికి కిరాయిని ఏర్పాటు చేశారు. హాల్స్‌కు రూ. 1800 ఉంటాయి. యోగనంద నిలయంలో 58గదులు ఉంటాయి. బస్టాండ్ ముందు ఆండాల్ నిలయంలో 18గదులున్నా యి. వీటిలో కిరాయి రూ. 300 ఉంది. స్థాని కంగా ప ద్మశాలి అన్నదాన సత్రం, రెడ్డి సంక్షేమ సంఘ సత్రం, ఆర్యవైశ్య అన్నదాన సత్రం, గౌ డ సత్రం, కుమ్మరి సత్రం, కురు మ సత్రం, పట్కరి సత్రాలు ఉన్నాయి..
41 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నా..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గత 41 సంవత్సరాలుగా వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్నా. గతంలో మాదిరిగానే ఈసారి కూడా శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అర్చక బృందం సిద్ధమవుతోంది. స్వస్తివాచనంతో ఈ ఉత్సవాలకు శ్రీకారం చుడతాం. ప్రతిరోజు ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పే విధంగా ఈ ఉత్సవాలు జరిపిస్తాం.
– నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, ప్రధాన అర్చకులు
Comments
Please login to add a commentAdd a comment