ఇంకా ఆరంభమే! | Yet opening! | Sakshi
Sakshi News home page

ఇంకా ఆరంభమే!

Published Tue, Dec 2 2014 2:28 AM | Last Updated on Tue, Nov 6 2018 4:57 PM

కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు - Sakshi

కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు

టీఆర్‌ఎస్ పాలనకు ఆరు నెలలు
     ప్రణాళికలు ఘనం.. ఆచరణ స్వల్పం
     విధానపరమైన నిర్ణయాల అమలులో కానరాని పురోగతి
     కరెంట్ సమస్య, రైతు ఆత్మహత్యలపై వెల్లువెత్తిన విమర్శలు
     సర్కారుకు మచ్చగా మారిన     ‘సామాజిక పింఛన్ల’ ఆందోళనలు
     ఉద్యోగాలు వస్తాయని    ఆశలు పెట్టుకున్న యువతలో నిరాశ
     ఇంకా మొదలుకాని పోస్టుల భర్తీ
     వాగ్దానాల అమలు మున్ముందు
     సర్కారుకు తలకు మించిన భారమే!

 సాక్షి, హైదరాబాద్:  ఉద్యమ పిడికిళ్ల నుంచి ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బాధ్యత లు స్వీకరించిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు... గడచిన ఆరుమాసాల్లో రాష్ట్ర భవిష్యత్ చిత్రపటాన్ని ఆవిష్కరించడానికే అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. జూన్ 2న సీఎంగా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ దసరా తర్వాత తన ప్రభుత్వ కార్యాచరణ మొదలవుతుందని ప్రకటించినా... ఇప్పటికీ మొదలు కాలేదు. కొత్త సర్కారు మొదటి ఆరు నెలల సమయాన్ని ప్రణాళికల రూపకల్పనకే వెచ్చించింది. పునర్విభజన చిక్కులు, రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డుతగిలాయి. అందుకే... కార్యాచరణ కన్నా భవిష్యత్తు అంచనాలకే ప్రభుత్వం ఎక్కువ సమయం కేటాయించింది. రాష్ట్ర ప్రజలు తమ భవిష్యత్తును ఊహల్లో తేలియాడేలా చేసే విధాన నిర్ణయాలకు శ్రీకారం చుట్టింది.
 
ప్రణాళికలు ఘనమే కానీ..
 ఆర్థిక ప్రణాళికలో ప్రజలను భాగస్వామ్యం చేస్తామంటూ పల్లె నుంచి జిల్లా వరకు ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసింది. అయితే ఆ ప్రణాళికల అమలు తీరులో ఇప్పటికీ పురోగతి లేదు. ఆలస్యమైనా.. ఖరీఫ్ ముగిసేలోగా రైతులకు రూ.లక్ష రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది. అదే సమయంలో నిరుపేద దళితులకు మూడెకరాల భూమిని పంపిణీ చేసే కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈ కార్యక్రమం అమలు తీరుపైనా సవాలక్ష సందేహాలు ముప్పిరిగొన్నాయి. ఉద్యమంలో కలిసొచ్చిన ఉద్యోగ వర్గాలను ఆకట్టుకునేందుకు వెంటనే ఇంక్రిమెంట్‌ను ప్రకటించిన ప్రభుత్వం.. వివిధ శాఖల్లో పీఆర్‌సీ అమలుపై తాత్సారం చేస్తోంది. రాష్ట్రంలో వెంటాడుతున్న విద్యుత్తు సంక్షోభాన్ని అధిగమించేందుకు దాటవేత ధోరణిని అనుసరించింది. పొంచి ఉన్న విద్యుత్ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ముందుగానే గ్రిడ్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే లైన్లను రిజర్వు చేసుకోవడం వంటి అంశాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోకుండా మరి కొంత కాలం విద్యుత్తు కోత తప్పదని ప్రభుత్వ పెద్దలు ప్రజలకు చెబుతున్నారు. మూడేళ్ల తర్వాత నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తామంటూ భవిష్యత్తు ప్రణాళికలను ఆవిష్కరించిన సర్కారు.. రైతు ఆత్మహత్యలను నివారించేందుకు, అన్నదాతల్లో మనోధ్యైర్యం కల్పించేందుకు చర్యలేవీ చేపట్టలేదు. ఇక ఇంటింటికీ రక్షిత మంచినీటిని సరఫరా చేసే ‘తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్’ను ఫోకస్ చేసేందుకు ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది. పల్లెలకు ఆయువు పట్టుగా నిలిచే చెరువులన్నీ  పునరుద్ధరించేందుకు ‘కాకతీయ మిషన్’ తలపెట్టింది. శరవేగంగా రోడ్లన్నీ అధునీకరించేందుకు ‘తెలంగాణ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్’ను ప్రకటించింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు నూతన పారిశ్రామిక విధానం తీసుకొచ్చింది. ఇవన్నీ రూట్‌మ్యాప్‌గా, స్కెచ్‌గా ఉండటంతో.. కార్యాచరణ ఇంకా మొదలు కాలేదు.

 వాగ్దానాల మున్ముందు భారమే...
 ఉద్యమ సమయంలో, ఎన్నికల సమయంలో వివిధ వర్గాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు సర్కారుకు మున్ముందు తలకు మించిన భారంగా పరిణమించనున్నాయి. రాష్ట్రంలో ఉన్న అన్ని విభాగాల్లో ఖాళీలు గుర్తిస్తామని.. వాటిని భర్తీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేస్తామన్న హామీ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఇప్పటికీ మల్లగుల్లాలు పడుతోంది. బడ్జెట్ సమావేశాల ముందు వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఫించన్ల పంపిణీ ప్రారంభించింది. కానీ.. కొత్త ఆహార భద్రత కార్డులు, ఫించన్ల కోతతో క్షేత్రస్థాయిలో ఆందోళనలు సర్కారుకు మచ్చ తెచ్చిపెట్టాయి. ఫించన్ రావటం లేదని ఆందోళనతో పండుటాకులు చనిపోయిన విషాద ఘటనలు.. రైతు ఆత్మహత్యల తరహాలోనే వెంటాడాయి.

 బాధల తెలంగాణగా మార్చారు: పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ అధ్యక్షుడు
 ‘‘రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ పాలన మొదలైన 180 రోజుల్లో 480 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రుణమాఫీ పేర ఆగమాగం చేసి, మాఫీకి కొర్రీలు పెట్టి, మళ్లీ రుణం పుట్టకుండా చేశారు. ఆసరా పేరుతో ఆశపెట్టారు. పెన్షన్లు రాక వద్ధులు గుండెలు పగిలి చస్తున్నారు. యువతకు ఉద్యోగాలు లేవు. యూనివర్సిటీలో ఉద్యమాలు జరుగుతున్నాయి. 108కు కనీసం డీజిల్ కూడా పోయలేని దుస్థితి. మూడు నెలల్లో తెస్తానన్న కరెంటు ఏమైంది? నాలుగు నెలల్లో ఇస్తానన్న 12 శాతం రిజర్వేషన్ ఎటు పోయింది? విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు. అన్నింటా అనిశ్చితి. ఏ ఒక్క వర్గమన్నా ఈ పాలనతో సంతృప్తిగా ఉందా..? అంకెల గారడి బడ్జెట్, అనైతిక రాజకీయాలకు పాల్పడడం తప్ప ఆరు నెలల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సాధించింది ఏముంది. బంగారు తెలంగాణ అన్నారు.. కానీ బాధల తెలంగాణగా మార్చారు’’
 
 విచిత్రమైన ‘అద్భుత’ పాలన : కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
 ‘‘శాసనసభ సమావేశాలు జరిపేందుకు గడువు దాటిన తర్వాత నాలుగు నెలల పాటు కాలయాపన చేసిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో, ఏ దిశగా సాగుతుందో చూడాలి. ఆరు నెలల కాలాన్ని ఐదేళ్ల పాలనకు గీటురాయిగా భావించటం తొందరపాటే అవుతుంది. కానీ ఈ ఆరునెలల వ్యవహారం మాత్రం ఏమాత్రం బాగోలేదని కచ్చితంగా చెప్పొచ్చు. అన్నింటినీ అద్భుతంగా తీర్చిదిద్దుతానని పదేపదే సీఎం చెబుతున్నారు. ఈ ఆరునెలల పాలనను విచిత్రంగా ఉన్న ‘అద్భుత’పాలనగా చెప్పాలి. ముఖ్యమంత్రి మాటలు చాలా బాగుంటాయి. కానీ చేతలు ఎలా ఉంటాయో ఎదురు చూడాల్సి ఉంది. ఎందుకంటే చెప్పిన మాటలను అమలులో పెట్టడం మొదలే కాలేదు. పింఛన్ల మొత్తాన్ని పెంచారు.. బాగుంది, కానీ దాన్ని ఎంతమందికి అందజేస్తారు? అదనంగా ఎవరికైనా లబ్ధి కలుగుతుందా అన్నది అనుమానమే. అలాగే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఆలోచన బాగుంది.. కానీ అది ఎప్పటికి అమలు చేస్తారో అంతుచిక్కటం లేదు.

ప్రభుత్వం కొలువుదీరగానే అమలు చేసినవేంటంటే... అయ్యప్ప సొసైటీలో ఇళ్ల ధ్వంసం, పింఛన్ల కోత, ఫీజుల రీయింబర్స్‌మెంట్‌లో వివాదాస్పద నిర్ణయం. ఓవైపు ఎన్నడూ లేనట్టుగా రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కరెంటు లేక రాష్ట్రం అంధకారమవుతోంది. వీటి విషయంలో సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవటంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వ హనీమూన్ ముగిసింది. ఇక సరైన నిర్ణయాలు తీసుకోవటమే మిగిలింది. కొద్దిరోజుల్లో ప్రభుత్వ వాస్తవ పాలన పటుత్వమేంటో తేటతెల్లమవుతుంది’’

 ఏ వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేదు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్
 ‘‘వాగ్దానాలు, హామీలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఊహాలోకాల్లో విహరింపజేస్తోంది. ప్రజలను ఆశల్లో బతికిస్తున్నారు. పాలన రియాలిస్టిక్‌గా లేదు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా ఏ వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేదు. రైతుల రుణమాఫీ, సంక్షేమ కార్యక్రమాలు, దళితులు, మైనారిటీల సంక్షేమం, రేషన్‌కార్డులు, పెన్షన్లు ఇలా దేన్ని కూడా పూర్తి చేయలేదు. రైతుల రుణమాఫీలో నాలుగో వంతే రద్దయింది. ఒక్క కొత్త రుణం కూడా ఇవ్వలేదు. రైతుల విషయంలో చేసిన వాగ్దానాన్ని ఎలా తప్పించుకోవాలన్న ధోరణి తప్ప.. సమర్థవంతంగా అమలుచేసేందుకు ప్రయత్నించడం లేదు.

 విశ్వాసాన్ని కోల్పోతున్న దశలో ఉంది: చాడ వెంకటరెడ్డి, తెలంగాణ సీపీఐ కార్యదర్శి
 ప్రభుత్వం ప్రస్తుతం క్రమక్రమంగా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్న దశలో ఉంది. ఆరు నెలల పాలన చూస్తుంటే ప్రజల్లో మునుపటి విశ్వాసం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. రైతుల రుణమాఫీని నాలుగోవంతు మాత్రమే చేశారు. దళితులకు భూమి పంపిణీ నామమాత్రంగా చేశారు. తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకే వస్తాయని చెప్పి, ఉద్యోగాల కల్పనకు ఏ చర్యలు తీసుకోకపోవడంతో నిరుద్యోగ యువత, విద్యార్థులు తీవ్ర నిరాశలో ఉన్నారు
 
 అడుగు ముందుకు పడలేదు: తమ్మినేని వీరభద్రం, సీపీఎం కార్యదర్శి
 ‘‘ఆరు నెలల పాలనలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు, వాగ్దానాలు ఇంకా అమలుకు నోచుకోలేదు. వాటిని అట్లానే పక్కన పెట్టి ఇప్పుడు ఇంకా కొత్త వాగ్దానాలు మాత్రం పుష్కలంగా ఇస్తున్నారు. రైతుల ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభం, కరెంట్ సమస్య వంటి వాటిపై కచ్చితమైన కార్యాచరణ ఏదీ చేపట్టలేదు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ సమస్యల పరిష్కారానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. వాగ్దానాలను, హామీలను ఎలా అమలు చేయబోతున్నది స్పష్టం చేయలేదు. ప్రస్తుత పరిస్థితే కొనసాగితే హామీల అమలుకు మరో పదేళ్లు పడుతుంది’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement