సంక్రాంతి సకినాల పండగ.. ఉగాది బూరెల పండగ... సద్దుల బతుకమ్మ, దసరా ధూం..ధాం... ఈ పండగ వేళల్లో కొడుకులు, కోడళ్లు, మనవలు, మనవరాళ్లతో ఇళ్లంతా కోలాహలమే. క్యాలెండర్‌లో లేని, అనుకోని పండగలా మంగళవారం సర్వే పండగ వస్తోంది. సర్వేకోసం ఎక్కడెక్కడో ఉన్నవారంతా సొంతూళ్లకు వస్తుండడంతో జిల్లాలో ప్రతీ ఇంటా పండగ వాతావరణం అలుముకుంది.
పెద్దపల్లి : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కుటుంబ సర్వే దేశంలోనే ఓ వినూత్న సందర్భంగా మిగిలిపోనుంది. మంగళవారం జరగనున్న సర్వే కోసం సుదూర ప్రాంతాల్లో నివాసముంటున్న వారందరూ ఆదివారం రాత్రి నుంచే జిల్లాకు చేరుకుంటున్నారు.మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించడంతో తమ పిల్లలను వెంటేసుకుని కుటుంబాలు సొంతింటికి బయలుదేరాయి.
జిల్లాకు చెందిన సుమారు 25 వేల మంది హైదరాబాద్‌లో నివసిస్తుండగా.. చెన్నై, బెంగళూర్, పుణె, ముంబయి నగరాల్లో వందలాది మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. వారందరూ కూడా సమగ్ర సర్వేలో పాల్గొనేందుకు ఇళ్లలోకి చేరుకుంటున్నారు. ప్రధాన మైన పండగలకు మాత్రమే వచ్చే కొడుకులు, కోడళ్లు.. మనవళ్లు, మనవరాళ్లు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో సమగ్ర సర్వే కోసం రావడంతో మంగళవారం ప్రతీ ఇంటా పెద్ద ఎత్తున విందులు చేసుకునే అవకాశాలున్నాయి.
బొగ్గుబాయి.. దుబయి
జిల్లాలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉద్యోగరీత్యా సింగరేణి గనుల్లో బొగ్గుబాయి కార్మికులుగా పనిచేస్తున్నారు. ‘ఉపాధి’ కోసం దుబయి లాంటి విదేశాలకు వలస వెళ్లిన వారు సైతం సమగ్ర కుటుంబ సర్వే కోసం వస్తున్నారు. సర్వే ద్వారా తమ జీవితాల్లో అంతో.. ఇంతో... వెలుగు నిండుతుందన్న ఆశతో వారు సర్వేకు హాజరయ్యేందుకు బయలుదేరారు. సింగరేణి గనుల్లో పనిచేస్తూ నాలుగైదేళ్లలోపే ఉద్యోగ విరమణ పొందే వారంతా ముందుగానే తమ సొంత గ్రామస్తుడిగా గుర్తింపు పొందేందుకు సర్వే పట్ల ఆసక్తి చూపుతున్నారు.
వీరు తమ ఇళ్లలోకి చేరుకుంటున్నారు. ఇలా... పెద్ద సంఖ్యలో గ్రామాలకు చేరుకుంటున్న వారితో పల్లెలన్నీ కళకళలాడనున్నాయి. పొద్దంతా ఎన్యూమరేటర్ల కోసం ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఆ రోజు తమ తమ ఇళ్లలో పండగ జరుపుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీని కోసం తమ కొడుకులు, కోడళ్లు వస్తున్నారని, అందరూ కలిసి పండుగ చేసుకునేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు.
సర్వే పండగ
Published Sun, Aug 17 2014 11:49 PM | Last Updated on Mon, Oct 22 2018 7:50 PM
Advertisement