తెలంగాణ సీఎం వద్ద భారీగా పేరుకుపోయిన ఫైళ్లు | Lot files pending at Telangana Chief Minister Office | Sakshi
Sakshi News home page

తెలంగాణ సీఎం వద్ద భారీగా పేరుకుపోయిన ఫైళ్లు

Published Mon, Sep 15 2014 1:33 AM | Last Updated on Tue, Oct 2 2018 3:04 PM

తెలంగాణ సీఎం వద్ద భారీగా పేరుకుపోయిన ఫైళ్లు - Sakshi

తెలంగాణ సీఎం వద్ద భారీగా పేరుకుపోయిన ఫైళ్లు

  • వెయ్యి వరకు అక్కడే ఉన్నట్లు సమాచారం
  •   జాబితాలో పద్మ అవార్డులు, టీపీఎస్‌సీ,
  •   ఫాస్ట్ మార్గదర్శకాలు, రోడ్ల నిర్మాణం ఫైళ్లు
  •   పరిశ్రమల సింగిల్ విండో, ఆస్తి పన్ను,
  •   భూముల ఫైళ్లకూ కలగని మోక్షం
  •   సమీక్షలు, రాజకీయ వ్యూహాలతోనే ముఖ్యమంత్రి బిజీ
  •   కేసీఆర్ ఆధ్వర్యంలోని కీలక శాఖల సాధారణ ఫైళ్లూ పెండింగ్
  •   ఇప్పటికీ అమలు కాని తొలి కేబినెట్ భేటీ నిర్ణయాలు
  •  
     సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వద్ద భారీగా ఫైళ్లు పేరుకుపోతున్నాయి. మరీ అత్యవసరమైన వాటిని తప్ప ఇతర ఫైళ్లను ఆయన చూడడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారులు కూడా ఫైళ్లను ఎప్పటికప్పుడు ఆయన వద్దకు తీసుకెళ్లడం లేదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర కోణంలోనే విధానాల రూపకల్పన జరగాలని, అందుకు తగ్గట్టుగా చట్టాలు ఉండాలని కేసీఆర్ నిర్దేశించిన సంగతి తెలిసిందే. ఈ దిశగా శాఖలవారీగా కొత్త విధానాల రూపకల్పన, సూత్రీకరణ కోసం ఉన్నతాధికారులతో గంటల తరబడి సమీక్షలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి తీరికలేకుండా గడుపుతున్నారు. మరోపక్క రాజకీయంగా స్థిరత్వం సాధించేందుకూ ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో సీఎం కార్యాలయంలో ఫైళ్లు పేరుకుపోతున్నాయి. వీటి సంఖ్య వెయ్యి వరకు ఉన్నట్లు సమాచారం. వివిధ శాఖల నుంచి వస్తున్న ఫైళ్లను కేసీఆర్ కానీ, ఆయన కార్యాలయ అధికారులు కానీ చూడడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. విధానాల రూపకల్పనపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు ప్రభుత్వం చెబుతున్నా.. వాటి అమలుకు సంబంధించి ఇప్పటివరకు ఏ ఒక్క స్పష్టమైన ఉత్తర్వూ బయటకు రాలేదన్న వాదన వినిపిస్తోంది. సమీక్షా సమావేశాల్లో ప్రస్తావనకు వస్తున్న పలు అంశాలకు వాస్తవ రూపం రావడం లేదని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫైళ్లను పంపించడం మినహా.. తర్వాత వాటి విషయాన్ని సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం కూడా ఫైళ్లు పేరుకుపోవడానికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పలు కీలక శాఖలు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఉండటంతో ఆయా శాఖలకు సంబంధించిన సాధారణ ఫైళ్లు కూడా ఆయన వద్దకు వెళ్లి ఆగిపోతున్నాయి. ఆర్థిక సంబంధమైన, కోర్టు అంశాలపై మాత్రమే అధికారులు స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లి ఆయన ముఖ్యకార్యదర్శికి వివరించి మరీ సంబంధిత ఫైళ్లకు సీఎంతో ఆమోదం వేయించుకుంటున్నారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలతో సహా మొత్తం 43 తీర్మానాలను ఆమోదించడంతో వాటి అమలు ఇక వేగవంతమవుతుందని అంతా ఆశించారు. కేబినెట్  ఆమోదించిన అంశాలకు సంబంధించిన ఫైళ్లను ఆయా శాఖలు తిరిగి ముఖ్యమంత్రికి పంపించి లాంఛనంగా ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫైళ్లలో చాలా వాటికి ఇంకా మోక్షం దక్కలేదని విశ్వసనీయ సమాచారం.
     
     రోజురోజుకీ పెరుగుతున్న జాబితా
     గత నెల చివరి వారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన జరిగిన పద్మ అవార్డుల కమిటీ పరిశీలనకు 37 మంది పేర్లు రాగా.. ఈ జాబితాను సగానికి కుదించి   ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఫైలును పంపించారు. దీనికి ఇప్పటి వరకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. పద్మ అవార్డులకు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాల్సిన గడువు ఈ నెల 15తో ముగుస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీపీఎస్‌సీ) ఏర్పాటైనప్పటికీ.. దానికి చైర్మన్‌తో పాటు సభ్యులను నియమించాల్సి ఉంది. దీని ఏర్పాటుకు తొలి కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకున్నా ఇప్పటి వరకు అది కార్యరూపం దాల్చలేదు. అలాగే పురపాలక శాఖకు సంబంధించిన భూ వినియోగ మార్పిడి ఫైళ్లు అనేకం ముఖ్యమంత్రి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ శాఖ సీఎం చేతిలోనే ఉంది. ఈ శాఖ ఫైళ్లను మంత్రి హోదాలో కేసీఆరే ఆమోదించాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను సవరణకు అనుమతి కోరుతూ ముఖ్యమంత్రికి ఫైలును పంపించారు. ఇది కూడా ఇప్పటివరకు తిరిగి రాలేదు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డు కమిటీల ఏర్పాటుకు సంబంధించిన ఫైలు కూడా పెండింగ్‌లో ఉంది. ప్రజాప్రతినిధులకు ఎప్పుడు, ఎక్కడ శిక్షణ ఇవ్వాలన్న ఫైలు కూడా ఇంకా సీఎం వద్దనే పరిశీలనలో ఉంది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ బోర్డు సమావేశానికి ముఖ్యమంత్రి సమయం కేటాయించాల్సి ఉంది. నీటిపారుదల శాఖ పెండింగ్ బిల్లులకు సంబంధించిన పలు ఫైళ్లు కూడా సీఎం పేషీలోనే ఆగిపోయాయి. బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ఏర్పాటు, పరిశ్రమలకు ఏక గవాక్ష పద్ధతిలో అన్ని అనుమతులు మంజూరు చేయాలన్న విధానపరమైన నిర్ణయానికి సంబంధించిన ఫైలు, రాష్ర్టంలో కొత్త యూనివర్సిటీల ఏర్పాటు, 104, 108 కింద పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు, ఎస్‌పీడీసీఎల్ సీఎండీ నియమాకం, జిల్లాల నుంచి మండల కేంద్రాలకు రెండు లైన్ల రోడ్ల నిర్మాణం, జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు నాలుగు లైన్ల రహదారుల నిర్మాణానికి సంబంధించిన ఫైలు వంటివన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇలా లెక్కకు మించిన ఫైళ్లు ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించే పథకం(ఫాస్ట్)కు సంబంధించిన మార్గదర్శకాలను కూడా కేసీఆర్ ఇప్పటికీ ఆమోదించలేదు. ఒకవైపు ఇంజనీరింగ్ తొలిదశ ప్రవేశాలు పూర్తయినా దీనిపై స్పష్టత రాకపోవడం అధికారులను కలవరపరుస్తోంది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement