ముప్పై రోజులే గడువు.. లేకుంటే జరిమానా
చట్టంలో మార్పులకు కసరత్తు
సాక్షి, హైదరాబాద్: మీ వాహనం రిజిస్ట్రేషన్ సందర్భంగా ఆర్టీఏ కార్యాలయంలో సమర్పించిన చిరునామా ఇంటి నుంచి మరో ఇంటికి మారారా? అయితే కొత్తింటి చిరునామాను ఇక వెంటనే ఆర్టీఏలో సమర్పించండి.. చిరునామా మారినప్పుడల్లా వివరాలను రవాణా శాఖకు అందించాల్సిందే.లేని పక్షంలో పెనాల్టీ చెల్లించాలి. ఈ మేరకు రవాణాశాఖ చట్టంలో మార్పులుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
చెకింగ్ సమయంలో చిరునామా ఆరా...
ప్రస్తుతం రవాణాశాఖ నుంచి గతంలో సేకరించిన చిరునామాలే పోలీసుల వద్ద ఉన్నాయి. ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ చిరునామాను ఆరాతీస్తే అక్కడ వాహన యజమానులు ఉండడం లేదు. ఈ-చలానాలు పంపినా రిజెక్ట్ అవుతున్నాయి. ఈ ఇబ్బందులను పోలీసులు రవాణాశాఖ దృష్టికి తీసుకువచ్చారు. దీనిని నివారించేందుకు ఆర్టీఏ చట్టంలో మార్పులు తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. వాహనదారులు ఇల్లుమారితే 30 రోజుల్లోగా కొత్త చిరునామాను ఆర్టీఏ కార్యాలయాలకు అందజేయాలి. ఈ విషయంలో వాహనదారుల్లో చైతన్యం తెచ్చేందుకు త్వరలో రవాణాశాఖ భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలకూ సిద్ధమవుతోంది.
ప్రతి సంవత్సరం వాహన ఇన్స్యూరెన్స్ రెన్యూవల్ చేసుకునేప్పుడు, పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకునేప్పుడు ఇంటి చిరునామాలను అప్‌డేట్ చేయించాలనే నిబంధన తీసుకురానున్నారు. వాహన ప్రమాదాలు, నేరాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో పోలీసు- రవాణాశాఖలు సంయుక్తంగా వ్యవహరించాలని నిర్ణయించాయి. ఈ కార్యాలయాల్లో రిజిస్టర్ అయ్యే ప్రతి వాహనం వివరాలు నేరుగా పోలీసు డేటా సర్వర్‌లో నమోదయ్యేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పుచేర్పులు చేయాలని నిర్ణయించారు. మరో నెల రోజుల్లో ఈ కసరత్తు పూర్తి కానుంది. వాహనం తయారీ కంపెనీ పేరు, రంగు, ఇంజిన్, ఛాసిస్, రిజిస్ట్రేషన్ నంబర్లు, యజమాని పేరు, చిరునామాతో సహా వివరాలు పోలీసు రికార్డుల్లోకి చేరుతాయి.
ఇల్లు మారితే ఆర్టీఏకు తెలపాల్సిందే
Published Sun, Aug 17 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM
Advertisement
Advertisement