ఉరేసుకుని సచ్చిపోతా!
దుబాయ్‌లో ఓ యువకుడి వేదన
- వాట్సాప్, ఫేస్‌బుక్‌లో వీడియో మెసేజ్
- తల్లడిల్లుతున్న కుటుంబ సభ్యులు
కోరుట్ల: ‘నాకు ఒక్క రోజు జ్వరం వచ్చిందని రూంలో ఉన్న.. మా కంపెనీ ఏజెంట్ వచ్చి పనికి పొమ్మని కొట్టిండు.. నరకం చూపించిండు.. అక్కడి నుంచి తప్పించుకుని కలివెళ్లి అయిన.. నా పాస్‌పోర్టు కంపెనీలనే ఉన్నది. ఇంటికి పోదామని ఎంబసీకి వెళ్తే ఎవరూ పట్టించుకోలేదు. తిండి.. నిద్ర లేక పరేషాన్ అవుతున్న.. ఉరేసుకుని సచ్చిపోవాలనిపి స్తోంది.. ప్లీజ్ నన్ను ఈ నరకం నుంచి తప్పించండి’ అని సౌదీలో ఉన్న కోరుట్ల మండలం మోహన్‌రావుపేట వాసి తిప్పనవేని మల్లేశ్ సోషల్ మీడియాలో వీడియో మెసేజ్ పెట్టి వేడుకుంటున్నాడు.
నాలుగు నెలల క్రితం సౌదీకి..
తిప్పనవేని రాజం– బుచ్చమ్మ ఒక్కగానొక్క కొడుకు మల్లేశం(26). నాలుగు నెలల క్రితం సౌదీకి వెళ్లాడు. అక్కడ లేబర్ పనికి కుదిరిన మల్లేశ్‌కు నెలక్రితం జ్వరం రావడంతో రూంలో ఉండిపోయాడు. దీంతో ఆ కంపెనీ ఏజెంట్ పనికి ఎందుకు రాలేదని కొట్టాడు. రెండు రోజులు భోజనం పెట్టకుండా చిత్రహింసలు పెట్టాడు. ఓ రోజు కంపెనీ యజమాని, ఏజెంట్లు రంజాన్ సందడిలో ఉండగా మల్లేశ్ పారిపోయాడు. మల్లేశం పాస్‌పోర్టు కంపెనీలోనే ఉండిపో వడంతో ఎంబసీ అధికారులు సాయం చేయ లేకపోయారు.
చివరకు తన దీనస్థితి తెలుపుతూ వాట్సాప్.. ఫేస్‌బుక్‌లో మేసేజ్ పోస్ట్ చేశాడు. తనను ఆదుకోవాలని లేకుంటే ఉరేసుకుని సచ్చిపోతా.. అని పేర్కొన్నాడు. ఈ మేసేజ్‌లు మోహన్‌రావుపేటలోని మల్లేశ్ తల్లిదండ్రులకు, చుట్టాలకు చేరడంతో వారంతా తల్లడిల్లుతున్నారు. ఎంపీ కవిత స్పందించి మల్లేశం తిరిగి ఇంటికి వచ్చేలా చూడాలని వారు కోరుతున్నారు.