నార్కట్‌పల్లి : అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన నార్కట్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధి గోపులాయపల్లి శివారు గుట్టపై పొదలలో శుక్రవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోపులాయపల్లి గ్రామానికి చెందిన గొర్లకాపరులు గురువారం సాయంత్రం గుట్ట కింద ద్విచక్ర వాహనం గమనించారు. తిరిగి శుక్రవారం ఉదయం గొర్రెలను మేపడానికి తోలుకెళ్తుండగా ఆ వాహనం అక్కడే దారిలో ఉండడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ మోతీరామ్, ఏఎస్‌ఐలు లింగారెడ్డి, గౌస్‌తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి గుట్టపై గాలింపు చర్యలు చేపట్టారు. గుట్టపై రాళ్ల మధ్యతో ఓ యువకుడి మృతదేహం కాలిపోయి ఉండడాన్ని గుర్తించారు.
గుట్ట కింద ఉన్న వాహనంలో మృతుడి వివరాలు గుర్తించారు.మృతుడు మండలంలోని తొండలవాయి గ్రామ పంచాయతీ పరిధి వెంకటేశ్వరబాయి గ్రామానికి చెందిన వడ్డెపల్లి నరేష్ (25)గా గుర్తించారు. మృతుడి వివరాలను తల్లి మంగమ్మకు తెలియజేయగా తన కుమారుడేనని గుర్తించింది. తన కుమారుడు నల్లగొండలోని ఎస్పీటీ మార్కెట్‌లో పనిచేస్తున్నాడని,నార్కట్‌పల్లిలోని ఓపెన్ పరీక్షలకు హాజరయ్యేందుకు వెళ్లి రెండు రోజులుగా ఇంటికి రాలేదని వివరించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి మంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మోతీరామ్ తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
Published Sun, May 10 2015 2:39 AM | Last Updated on Wed, Aug 1 2018 2:31 PM
Advertisement
Advertisement