సత్తుపల్లి(ఖమ్మం): మత్తుకు అలవాటు పడి..కొందరు వింతగా చెప్పులు, ఎలక్ట్రికల్, ప్లాస్టిక్ వస్తువులను అతికించేందుకు వినియోగించే ‘బోన్‌ఫిక్స్’ అనే పదార్థాన్ని నిషాకు పీలుస్తున్నారు. ఒకప్పుడు తక్కువ అమ్మకాలు ఉండే బోన్‌ఫిక్స్ బేరాలు ఒక్కసారిగా జోరందుకున్నాయి. రూ.12 విలువ చేసే ఇది ఒక ద్రవ పదార్థంలాగా ఉంటుంది. దీనిని..గట్టి కాగితంలోకి తీసుకుని..ముక్కుతో పీల్చడం ద్వారా..ఒకేసారి పెగ్గుమద్యం తాగినంత నిషా ఉంటుందని కొందరు చెబుతుంటారు.
మత్తుకు బానిసైన యువత రోజుకు మూడు నుంచి నాలుగు బోన్‌ఫిక్స్‌లు కొనుగోలు చేస్తున్నారు. కిట్టీ పార్టీల తరహాలో పార్టీలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. సత్తుపల్లిలో ఎక్కువగా జోగుతున్నారని ప్రచారముంది. బోన్‌ఫిక్స్ లిక్విడ్‌ను పీల్చడం వల్ల ఒళ్లంతా మత్తులో తేలియాడుతుంది. దీంట్లో ఉండే ఆల్కాహాలిక్ మోతాదు నాడి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నరాలు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. కంటిచూపు, శ్వాసకోశ వ్యాధులకు గురవుతారు. తక్షణం జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది. తల వెంట్రుకలు ఊడిపోతాయి. కండరాల నొప్పులు ఉంటాయి. మోతాదుకు మించి పీల్చడం వల్ల కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. దీని వాడటం వల్ల ఆయుష్షు క్షీణించి 5 నుంచి 10 ఏళ్లలోపే మృత్యువాత పడతారు.
ముఖానికి కర్చీప్‌లు కట్టుకొని..
బోన్‌ఫిక్స్‌లోని అల్కహాల్ మోతాదుకు యువత మత్తులో జోగుతోంది. కేవలం రూ.12లకే లభిస్తుండటంతో మత్తు కోసం ఆశ్రయిస్తున్నట్లు పరిశీలనలో తేలింది. బోన్‌ఫిక్స్ ట్యూబ్‌లోని లిక్విడ్‌ను ఖర్చీప్‌లో వేసుకొని, ముక్కుకు దగ్గరగా గట్టిగా పీల్చుతూ.. అదే దస్తీని ముఖానికి కట్టుకొని తిరగుతుంటారు. ఇలాంటి మత్తు మందు వినియోగించే వారి ముఖం పాలిపోయి..పెదవులు పగిలిపోయి కన్పిస్తుంటారు. దేనిపైనా ఏకాగ్రత చూపించరు. ప్రతి చిన్నదానికి చిరాకు పడుతూ ఘర్షణలకు దిగుతుంటారు.
ముఖ్యంగా వివిధ కారణాలతో సతమతమవుతున్నవారు, మద్యం, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు దీనికి బానిసలవుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మత్తు పొందొచ్చని ఇలా అలవాటుపడి అనారోగ్యం పాలవుతున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఇలా పీల్చేసి, మత్తులో జోగుతున్నట్లు తెలిసింది. పోలీసులు..దృష్టి పెడితే ఇలా పెడదోవపడుతున్న వారు అనేకమంది బయటపడతారని, విద్యార్థులు, యువకులు చెడిపోకుండా కాపాడవచ్చని పలువురు అంటున్నారు.
సెమీడ్రగ్స్‌లా వాడుతున్నారు..
బోన్‌ఫిక్స్‌ను యువత మత్తుపదార్థంగా వినియోగిస్తున్నట్లు దృష్టికి వచ్చింది. సెమిడ్రగ్స్‌లా వాడుతున్నారు. బోన్‌ఫిక్స్‌పై నియంత్రణ అవసరం. కెమికల్ వాసనకు అలవాటుపడి బానిసలుగా మారుతున్నారు. దీని దుష్ప్రభావం నాడి వ్యవస్థపై పడి దెబ్బతింటుంది. ఇటీవలే ఇది వెలుగు చూడటంతో దీనిపై అధ్యయనం చేశాం. మనిషిని ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఇలాంటి మత్తు పదార్థాల వాడకం పట్ల అప్రమత్తత అవసరం. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల అలవాటుపై పూర్తిస్థాయి నిఘా పెడితేనే దీనిని నివారించవచ్చు. – డాక్టర్ పి.వసుమతీదేవి, ప్రభుత్వ వైద్యురాలు, సత్తుపల్లి
నిఘా పెంచుతాం..
బోన్‌ఫిక్స్‌ను మత్తుపదార్థంగా వినియోగిస్తున్నారనే సమాచారంపై నిఘాను పెంచుతాం. పిల్లలను గమనిస్తూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిపై మాకు సమాచారం అందిస్తే నియంత్రణకు అవకాశం ఉంటుంది. – బి.రాంప్రసాద్, ఎక్సైజ్ సీఐ, సత్తుపల్లి
Comments
Please login to add a commentAdd a comment