వైఎస్ పథకాలతోనే బంగారు తెలంగాణ
- వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సాక్షి, ఖమ్మం: దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాల అమలుతోనే బంగారు తెలంగాణ సాధ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ 2004లో అధికారంలోకి రాగానే రుణాలు, విద్యుత్ బిల్లుల మాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలతో రైతులు, పేద ప్రజలకు లబ్ధిచేకూర్చారన్నారు.
కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయాలని కోరారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం వస్తే తమ బతుకులు బంగారుమ యం అవుతాయన్న ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌ను ప్రజలు అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. పింఛన్లు అందడం లేదని వికలాంగులు, వితంతువులు, వృద్ధుల నుంచి వేలాదిగా అభ్యర్థనలు వస్తున్నాయని ప్రభుత్వం దృష్టికి వైఎస్సార్‌సీపీ తీసుకెళ్లిందన్నారు.
ఖరీఫ్‌లో నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో నీటి విడుదల సరిగా లేకపోవడంతో పంటల దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఈ లోటును పూడ్చడానికి ఈ రబీలోనైనా రెండో జోన్ పరిధిలోని చివరి ఆయకట్టు భూమి వరకు నీటిని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కొంతమంది పార్టీని వీడుతున్నారని, వాళ్లు వెళ్లినంత మాత్రాన అభిమానులు, నేత లు, శ్రేణులు అధైర్యపడడం లేదన్నారు.
వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందినవారి కుటుంబాలను పరామర్శించడానికి పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఓదార్పుయాత్ర చేశారన్నారు. తన సోదరి షర్మిలతో మహబూబ్‌నగర్‌లో పరామర్శ యాత్ర చేయించారని, ఈనెల 21 నుంచి నల్లగొండ జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. మిగతా జిల్లాలో కూడా నెలకు ఒక జిల్లా చొప్పున షర్మిల పరామర్శ యాత్ర చేస్తారని ఎంపీ పొంగులేటి వెల్లడించారు.