నేటి నుంచి షర్మిల పరామర్శయాత్ర
నల్లగొండ జిల్లాలో 4 రోజులపాటు పర్యటన
⇒ ఆరు నియోజకవర్గాల పరిధిలో 18 కుటుంబాలకు పరామర్శ
⇒ వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్‌రెడ్డి, శివకుమార్
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నల్లగొండ జిల్లాలో రెండో విడత యాత్రను మంగళవారం నుంచి చేపట్టనున్నారు.
శుక్రవారం వరకు నాలుగు రోజులపాటు ఆరు నియోజకవర్గాల్లోని 18 కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆయన తరఫున పరామర్శ యాత్రను చేపట్టిన షర్మిల.. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో ఇదివరకే యాత్రను నిర్వహించారు. నల్లగొండ జిల్లాలో మిగిలిన భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, నకిరేకల్, నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల పరిధిలో పరామర్శ యాత్ర చేపట్టేందుకు మంగళవారం ఉద యం 9.30కు హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్ లోని తమ నివాసం నుంచి బయలుదేరుతారు.
బుధవారం నుంచి యాత్ర ఇలా..
బుధవారం ఉదయం ఆలేరు నియోజకవర్గం లోని శారాజీపేటలో ఎదుల్ల శ్రీనివాస్ కుటుం బాన్ని షర్మిల పరామర్శిస్తారు. అక్కడి నుంచి తుంగతుర్తి నియోజకవర్గం పల్లెపహాడు, మోత్కూరు మీదుగా పొడిచేడు చేరుకుని దీటి గౌరమ్మ కుటుంబ సభ్యులను కలుసుకుం టారు. అనంతరం నకిరేకల్ నియోజకవర్గం రామన్నపేట మీదుగా సిరిపురం చేరుకుని పున్న వీరయ్య కుటుంబాన్ని, కట్టంగూరు టౌన్‌లో గాదగోని రాములు కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత నకిరేకల్‌లోని మర్రూరుకు చేరుకుని పుట్ట సైదులు కుటుంబాన్ని కలుసుకుంటారు.
ఇక గురువారం ఉదయం నకిరేకల్ నియోజకవర్గ భీమారంలో నెమ్మాది శేఖర్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి నల్లగొండ నియోజకవర్గం ఇందుగులకు చేరుకుని రాయించు నర్సింహ కుటుంబా న్ని, తిప్పర్తిలో గుంటి వెంకటేశం, చందనపల్లిలో చింతా భిక్షయ్య కుటుంబాన్ని, నల్లగొండ టౌన్‌లో బాండేకర్ దయానంద్ కుటుంబాన్ని కలుసుకుంటారు.
శుక్రవారం ఉదయం కనగల్ చౌరస్తాలో వైఎస్సార్ విగ్రహానికి షర్మిల పూల మాల వేసి యాత్ర కొనసాగిస్తారు. మునుగోడు నియోజకవర్గం నాంపల్లికి చేరుకుని ఆస్తర్‌బీ, తాన్‌దార్‌పల్లిలో మునగాల పుల్లమ్మ కుటుంబాలను, తర్వాత చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో బిగ్ర వసంతరావు కుటుం బాన్ని పరామర్శిస్తారు.
బీబీనగర్ వద్ద ప్రారంభం..
నల్లగొండ జిల్లా భువనగిరి నియోజకవర్గ పరిధిలోని బీబీనగర్ టోల్‌గేట్ సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి షర్మిల పూలమాల వేసి.. పరామర్శ యాత్రను ప్రారంభిస్తారని వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రధాన కార్యద ర్శులు కె.శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ‘‘బీబీనగర్‌లోని వెంకిర్యాలలో చెరుకు కిష్టయ్యగౌడ్ కుటుంబాన్ని తొలుత పరామర్శిస్తారు. అక్కడి నుంచి రాఘవాపురం, చిన్నరావులపల్లి, ఎర్రంబెల్లి, గౌస్‌నగర్ మీదుగా కంచనపల్లికి చేరుకుని అక్కడ కొలిచెల్మి అంజయ్య కుటుంబ సభ్యులను కలుసుకుంటారు.
భోజన విరామం అనంతరం బండ సోమారం, చాడ ఎక్స్‌రోడ్ మీదుగా ముస్త్యాలపల్లి చేరుకుని కళ్లెం నర్సయ్య కుటుంబాన్ని, అనంతరం ఆలేరు నియోజకవర్గంలోని దాతరుపల్లిలో ఎ.చంద్రమ్మ కుటుంబాన్ని, యాదగిరిపల్లిలో చింతల కృష్ణ కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తారు’’ అని వివరించారు.