
నేటి నుంచి నల్లగొండ జిల్లాలో షర్మిల పరామర్శ యాత్ర
6 నియోజకవర్గాల్లో 30 కుటుంబాలకు పలకరింపు
సాక్షి, హైదరాబాద్/నల్లగొండ: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిం చేందుకు ఆయన కుమార్తె, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నేటి నుంచి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో చేపడుతున్న తొలివిడత పరామర్శ యాత్ర కోసం బుధవారం ఉదయం లోటస్‌పాండ్ నివాసం నుంచి షర్మిల బయలుదేరి వెళ్తారు.
నల్లగొండ జిల్లాలోని మాల్‌కు చేరుకుని అక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి యాత్రను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి దేవరకొండ నియోజకవర్గానికి చేరుకుని చింతపల్లి మండలం మదనాపురంలో ఆడేపు బాలమ్మ కుటుంబాన్ని, చందంపేట మండలం ఎల్మలమంద గ్రామం దేవరచర్ల తండాలో లక్ష్మి కుటుంబాన్ని, ఇదే మండలంలోని గువ్వలగుట్టలో బి.మణి కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శిస్తారని వైఎస్సార్‌సీపీ తెలంగాణ కమిటీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దేవరకొండలో పరామర్శ పూర్తయ్యాక27వ తేదీ వరకు హుజూర్‌నగర్, కోదాడ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, సూర్యాపేట నియోజకవర్గాలలో ఈ యాత్ర కొనసాగనుంది. పరామర్శ యాత్రలో భాగంగా ఏడు రోజులపాటు ఆరు నియోజకవర్గాల్లోని 30 కుటుంబాలను షర్మిల కలుసుకోనున్నారు.
కొన్ని రోజుల తర్వాత రెండోవిడత పరామర్శ యాత్రలో జిల్లాలోని మిగిలిన 6 నియోజకవర్గాల్లో ఆమె పర్యటిస్తారు. వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలొదిలిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు వస్తానని ఐదున్నరేళ్ల క్రితం నల్లకాల్వ సాక్షిగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం సోదరి షర్మిల ఈ పర్యటనను నిర్వహిస్తున్నారు. జిల్లాలో షర్మిల పరామర్శ యాత్రను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. భవిష్యత్‌లోనూ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో షర్మిల పర్యటించి వైఎస్సార్ అభిమానుల కుటుంబాలకు అండగా నిలుస్తారన్నారు.