
షర్మిల పరామర్శయాత్ర షెడ్యూల్ విడుదల
21 నుంచి నల్లగొండ జిల్లాలో పర్యటన
సాక్షి, హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక అసువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 21 నుంచి నల్లగొండ జిల్లాలో చేపట్టనున్న పరామర్శ యాత్ర షెడ్యూల్ విడుదలైంది. ఆరు నియోజకవర్గాల్లో ఏడు రోజుల పాటు సాగనున్న ఈ యాత్రలో 34 కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పరామర్శ యాత్ర షెడ్యూల్‌ను సోమవారం ఆయన పత్రికలకు విడుదల చేశారు. 21న దేవరకొండ నియోజకవర్గంలో ప్రారంభమయ్యే యాత్ర 27న సూర్యాపేట నియోజకవర్గంలో ముగుస్తుందని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం షర్మిల దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలం మదనాపురం, చందంపేట మండలం దేవరచర్ల తండాతో పాటు, గువ్వలగుట్టలో మొత్తం మూడు కుటుంబాలను పరామర్శించనున్నారు.
అలాగే హుజూర్‌నగర్ నియోజకవర్గంలో నేరేడుచర్ల మండలం దిర్శించర్ల ఎస్సీ కాలనీ, కాలువపల్లి, హుజూర్‌నగర్‌లోని సుందరయ్యనగర్, మేళ్లచెరువు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ, ఇదే మండలంలోని కందిబండలో మొత్తం 5 కుటుంబాలను పరామర్శిస్తారు. కోదాడ నియోజకవర్గంలోని తొగర్రాయి, కోదాడ, ఆచార్యులగూడెం, గణపవరం, వెంకట్రాంపురంలో 5 కుటుంబాలను షర్మిల కలుసుకుంటారు.
మిర్యాలగూడ నియోజకవర్గంలోని నందిపాడు క్యాంప్, సల్కునూరు, మిర్యాలగూడ, ఆలగడపలో 4 కుటుంబాలను పరామర్శిస్తారు, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పెద్దవూర మండలం నాగార్జునసాగర్, హాలియా మండలం గరికేనాటి తండా, త్రిపురారం మండల కేంద్రంలో 3 కుటుంబాలను షర్మిల కలుసుకుంటారు. కాగా, సూర్యాపేట నియోజకవర్గంలో రెండురోజులపాటు షర్మిల పరామర్శ యాత్ర కొనసాగనుందని పొంగులే టి తెలిపారు. ఈ నియోజకవర్గంలోని పెన్‌పహాడ్ మండలం అనంతారం, చివ్వెంల మండలం హున్యానాయక్ తండా, ఆత్మకూర్-ఎస్ మండలం నశీంపేట, ముక్కుడుదేవుడుపల్లి, కందగట్ల, ఏనుభాముల, చివ్వెంల మండలం మంగలితండా, ఆత్మకరూర్-ఎస్ మండలం దుబ్బతండా, సూర్యాపేట మండలం కుడకుడలో పలు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారని తెలిపారు.