
అండగా ఉంటాం..
- మహానేత తనయ షర్మిల భరోసా
- అంజయ్య యాదవ్ కుటుంబానికి ఓదార్పు
- కుటుంబ సభ్యుల్లో సంతోషం
‘మీ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా... నన్ను కలవండి’ అంటూ మహానేత తనయ వైఎస్ షర్మిల ఇచ్చిన భరోసాతో ఆ కుటుంబం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది. ఇంటి పెద్దను కోల్పోయి... ఆవేదనతో గడుపుతున్న ఆ కుటుంబ సభ్యుల్లో రాజన్న బిడ్డ మాటలు కొండంత ధైర్యాన్ని నింపాయి. సాక్షాత్తూ మహానేత తనయ తమ ఇంటికి రావడంతో వారి సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక సరూర్‌నగర్ మండలం జిల్లెలగూడకు చెందిన అంజయ్య యాదవ్ తనువు చాలించాడు. పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులను సోమవారం షర్మిల పరామర్శించారు. పేరు పేరునా పలుకరించారు. వారి క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మహేశ్వరం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించారు.
సాక్షి, సిటీబ్యూరో:
షర్మిల : ఏమ్మా.. అంజయ్య యాదవ్ ఎలా చనిపోయారు?
అంజమ్మ (అంజయ్య యాదవ్ భార్య): మా ఆయన వైఎస్సార్ వీరాభిమాని. మహానేత మరణించారని తెలిసి నాలుగు రోజుల పాటు అన్నం కూడా ముట్టలేదు. టీవీకే అతుక్కుపోయాడు. టీవీ చూస్తూనే సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో గుండెపోటు వచ్చి కుప్పకూలాడు. మమ్మల్ని వదిలి వెళ్లాడు... అంటూ కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతుండగా... ఉద్విగ్నంగా చెప్పింది అంజమ్మ.
షర్మిల: అంజయ్య యాదవ్ ఏం చేసేవారు?
- ఎంత మంది పిల్లలు?
అంజమ్మ: మా ఆయన నాంపల్లి పీడబ్ల్యూడీ డిపార్ట్‌మెంట్‌లో అటెండర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. నాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కోడలు మరణించడంతో కొడుకు మరో పెళ్లి చేసుకున్నాడు. వాడి తొలి భార్యకు ఇద్దరు... ప్రస్తుత భార్యకు ఒకరు మొత్తం ముగ్గురు సంతానం.
షర్మిల : వైఎస్సార్ అంటే యాదయ్యకు
ఎందుకంత ఇష్టం?
యాదగిరి (అంజయ్య యాదవ్ కుమారుడు): వైఎస్సార్ చేపట్టిన ప్రజా ప్రస్థానం యాత్ర సమయంలో మా నాన్న వీరాభిమానిగా మారారు. రాష్ట్రంలోని అరాచక, దుర్భిక్ష పరిస్థితులు వైఎస్సార్‌ముఖ్యమంత్రి అయితేనే మారతాయన్న విశ్వాసం ఆయనది. కాంగ్రెస్ పార్టీని పదేళ్ల పాటు రాష్ట్రంలో నిలబెట్టిన ఘనత ఆయనదేనన్నది నాన్న విశ్వాసం. మహానేతకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా సహించలేకపోయేవారు. వైఎస్సార్‌కు సంబంధించిన వార్తలను టీవీలు, పేపర్లలో తదేకంగా చూసేవారు. ఆయన మరణవార్తను టీవీలో వింటున్నప్పుడే హఠాత్తుగా గుండెనొప్పితో కుప్పకూలారు.
షర్మిల : ఏమ్మా... నీ కళ్లకు ఏమైంది?
కంటి చూపు బాగుందా..?
అంజమ్మ: లేదమ్మా. చిన్నప్పుడు కంటికి దెబ్బ తగిలితే చెట్ల మందులు వాడితే ఓ కన్ను చెడిపోయింది. మరో కన్ను మాత్రమే కనిపిస్తుంది. నా సొంత బిడ్డలా మా ఇంటికి వచ్చి బాధల్లో ఉన్న మమ్మల్ని పలకరించిన మిమ్మల్ని జీవితాంతం మరచిపోనమ్మా.
షర్మిల : మీ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా నేనున్నా.. ఏ కష్టమొచ్చినా ఈ నెంబరుకు ఫోన్ చేయండి... అని విజిటింగ్ కార్డు ఇచ్చారు. వారందరి నుంచి సెలవు తీసుకొని మంఖాల్‌కు పయనమయ్యారు. దారి పొడవునా జనం, మహిళలు మహానేత తనయ షర్మిలకు ఆత్మీయ స్వాగతం పలికారు. జోహార్ వైఎస్సార్.. షర్మిలక్క నాయకత్వం వర్థిల్లాలి అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పొరుగు గ్రామాల జనం రాకతో జిల్లెలగూడ గ్రామం జనసంద్రమైంది. ఊరిలోని అన్ని దారులూ కిక్కిరిసిపోయాయి.