
'వైఎస్ఆర్ ... ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు'
నల్గొండ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించి ఐదేళ్లయినా కోట్లాది మంది ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారని ఆ మహానేత తనయ వైఎస్ షర్మిల తెలిపారు. మంగళవారం నల్గొండ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన రెండో విడత పరామర్శయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలోని పులిగిల్ల గ్రామంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి షర్మిల పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడారు.
వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో కనీవినీ ఎరుగని పథకాలకు రూపకల్పన చేసి.. వాటిని అమలు చేశారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ ... పేదల గురించి తన కన్నబిడ్డలకన్నా ఎక్కువగా ఆలోచించేవారన్నారు. ఆరోగ్య శ్రీ పథకం, 108 వాహనాల... ద్వారా లక్షల మంది ప్రజలకు వైఎస్ఆర్ పునర్జన్మను ప్రసాదించారన్నారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ మహానుభావుడు మరణిస్తే కొన్ని వందల గుండెలు ఆగిపోయాయని తెలిపారు. రైతు, రైతు కూలీలను వైఎస్ఆర్ అన్ని విధాల ఆదుకున్నారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.