తెలంగాణకు మేలు చేద్దాం
* పార్టీ సర్వసభ్య సమావేశంలో షర్మిల
* పార్టీకి పెద్ద సంఖ్యలో ఎంపీలు, ఎమ్మెల్యేలు లేరు
* కానీ కోట్లాది మంది ప్రజల గుండెల్లో వైఎస్ ఉన్నారు
* తెలంగాణకు వైఎస్ చేసినంత మేలు మరెవరూ చేయలేదు
* రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేద్దాం.. వైఎస్ పేరును నిలబెడదాం
సాక్షి, హైదరాబాద్: దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల సాధన కోసం, తెలంగాణ ప్రజల మేలు కోసం కృషి చేద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంతానికి వైఎస్ చేసిన మేలు మరే నాయకుడు చేయలేదని గుర్తుచేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తెలంగాణకు మేలు చేసిన నాయకుడు వైఎస్‌ను మించి మరెవరూ లేరు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే 7 గంటల ఉచిత విద్యుత్‌పై సంతకం చేసి, రూ.12 వేల కోట్ల విద్యుత్ బకాయిలను మాఫీ చేసింది ఒక్క వైఎస్ మాత్రమే.
రాష్ట్రంలో 28 లక్షల పంపుసెట్లు ఉంటే తెలంగాణలోనే 17 లక్షల పంపుసెట్లు ఉన్నాయని తెలిసీ, తెలంగాణకు మేలు చేసేందుకు, అక్కడి ప్రజలకు నేనున్నాననే భరోసా కల్పించేందుకు ఉచిత విద్యుత్‌పై వైఎస్ సంతకం చేశారు’‘ అని చెప్పారు. బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తొలి సర్వసభ్య సమావేశానికి ఆమె ప్రత్యేక అతిథిగా హాజరై ప్రసంగించారు. వైఎస్ మరణం తట్టుకోలేక వందల మంది మరణిస్తే, అందులో తెలంగాణ వారే ఎక్కువగా ఉన్నారన్నారు. ఈ రోజున తెలంగాణలో పార్టీకి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోయినా వైఎస్ మాత్రం కోట్లాది మంది తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు.
‘‘పార్టీ పటిష్టానికి మనం చేయాల్సిందల్లా, వైఎస్ వారసత్వం గల పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమే అని ప్రజల్లో నమ్మకం కలిగించడమే. తెలంగాణ ప్రజలకు మంచి చేసేందుకు వైఎస్ చేసిన ప్రతి మంచి పనిని పరిగణనలోకి తీసుకొని ఆయన ఆశయ సాధన కోసం, ప్రజల కోసం శ్రమించాలి’’ అని షర్మిల సూచించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసి వైఎస్ పేరును నిలబెడదామని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లుతో పాటు నేతలు గట్టు రాంచంద్రారావు, జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాశ్, రెహ్మాన్, శివకుమార్, పుత్తా ప్రతాప్‌రెడ్డి, కొండా రాఘవరెడ్డి, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, బీరవోలు సోమిరెడ్డి, గాదె నిరంజన్‌రెడ్డి, ఆదం విజయ్‌తోపాటు నియోజకవర్గ ఇన్‌చార్జీలు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమావేశానికి ముందు వేదికపై ఏర్పాటుచేసిన వైఎస్, కొమురం భీం చిత్రపటానికి వైఎస్ జగన్, షర్మిళ, నేతలు నివాళులర్పించారు.
వైఎస్ యుగం సువర్ణాధ్యాయం
‘‘అన్ని వర్గాల వారికి పార్టీలకతీతంగా ఇళ్లు, పింఛన్లు, ఫీజులు, వైద్యం అందించిన ఘనత ఒక్క వైఎస్‌దే. ఆపదలో అన్నలా ఆదుకున్న ఆయన యుగం ఓ సువర్ణాధ్యాయం’’
- పి.వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే
అలాగైతే అధికారంలో ఎందుకు
‘‘టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంతవరకు ఒక్క వాగ్దానం అమలు కాలేదు. మూడేళ్ల వరకు కరెంట్ ఇవ్వలేమని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు. ఇక మూడేళ్లు అధికారంలో ఉండడం దేనికి? ప్రతిపక్షాలు మాట్లాడితే కుక్కలని తిడతారు. మేం విశ్వాసం, నమ్మకం గల కుక్కలం. మీలా మొరిగే కుక్కలం కాదు. చేసిన వాగ్దానాలను వైఎస్‌లా టీఆర్‌ఎస్ నిలబెట్టుకోకుంటే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం’’
- తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే