
సాక్షరభారత్ కోఆర్డినేటర్లకు సంఘీభావం తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ నేతలు
పెద్దపల్లి రూరల్: పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామంటూ పదేపదే చెబుతున్న సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి బాధల తెలంగాణాగా మార్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల గోవర్ధనశాస్త్రీ అన్నారు. పెద్దపల్లి అమరవీరుల స్థూపం వద్ద రిలేదీక్ష చేస్తున్న సాక్షరభారత్ కోఆర్డినేటర్ల శిబిరాన్ని పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొమ్మ రాజయ్యయాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీకాంత్‌రెడ్డితో కలిసి ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా గోవర్ధనశాస్త్రీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు బంగారు తెలంగాణ ఏమో కానీ సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు మయమైందన్నారు. ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని, స్వరాష్ట్రంలో ఇక కాంట్రాక్టు ఉద్యోగులు ఉండరని ప్రకటించి, పీఠమెక్కాక ఉన్న ఉద్యోగాలను కూడా తొలగించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
సాక్షరభారత్ కోఆర్డినేటర్ల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రెండు నెలలుగా దీక్ష చేస్తున్నా కనీసం స్పందించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఎనిమిదేళ్లపాటు గ్రామాల్లో అక్షరాలు నేర్పించడంతోపాటు సర్కార్ పథకాల అమల్లోనూ పాలుపంచుకున్నా వారికి ఉద్యోగభద్రత కల్పించకపోవడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్ గారడీ మాటలతో తెలంగాణ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని విమర్శించారు. ఈ పరిస్థితి మరెంతో కాలం సాగదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి పాలనలో పేదకుటుంబాల్లో వెలుగునింపేలా పథకాలకు రూపకల్పన చేశారని తెలిపారు. ఆ పథకాల ఫలాలు పొందినవారంతా ఇప్పటికీ వైఎస్సార్‌ను తమ హృదయాల్లో పదిలపర్చుకున్నారని పేర్కొన్నారు.
నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఉన్నత చదువులు టీఆర్‌ఎస్ పాలనలో అందని ద్రాక్షగా మారాయన్నారు. టీఆర్‌ఎస్ పాలనలో కిందిస్థాయి ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ సాక్షరభారత్, పంచాయతీ కార్మికులు, విద్యుత్ ఉద్యోగులు నిరసనలు చేపట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, నిరసనలో భాగంగా కోఆర్డినేటరుల దీక్షా శిబిరం వద్ద సంక్రాంతి ముగ్గులు వేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ల సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి మారం వెంకటరమణ, రజిత, స్వప్న, లలిత, శ్రీలత, శ్రీవాణి, కమల, ఎలిగేడు, జూలపల్లి మండలాల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.