2019 ఎన్నికల్లో క్రియశీలక పాత్ర: గట్టు శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్ : 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో క్రియశీలక పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ తెలంగాణ వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ నాయకత్వ స్ఫూర్తితో ముందుకు వెళదామని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ చంపాపేటలోని స్థానిక సామ నరసింహారెడ్డి గార్డెన్‌లో గురువారం జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశం ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి తన ప్రతి అడుగులో కూడా పేదవాడి గుండె చప్పుడు విన్నారన్నారు. ఆ మహానేతను మరవడం ఎప్పటికీ సాధ్యం కాదని అన్నారు.
అలాగే వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయగలిగేది వైఎస్ జగన్ మాత్రమే అన్నారు. వచ్చే ప్లీనరీకి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి హోదాలో హాజరు అవుతారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి తెలంగాణలో కేసీఆర్ పాలన కొనసాగుతోందని గట్టు శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. కాగా ప్లీనరీలో మొత్తం 12 తీర్మానాలను ఆమోదించిన పార్టీ, అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంటూ ఏకగ్రీవ తీర్మానం చేసింది.
ఈ సమావేశానికి తెలంగాణలోని 31 జిల్లాల పార్టీ అధ్యక్షులు, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతకు ముందు పార్టీ జెండా ఎగురవేసి ప్లీనరీని ప్రారంభించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి,మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు.