
సాక్షి, మెడ్చల్: అబ్దుల్లాపూర్ మండల రెవెన్యూ పరిధిలోని భూవివాదంతో తనకు ఎటువంటి సంబంధం లేదని ముడుచింతల జెడ్పీటీసీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గౌరెల్లి గ్రామ పరిధిలో కేవలం 9 ఎకరాల భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశానని వెల్లడించారు. టెనెంట్(పీ.టీ) హోల్డర్ నుంచి కొనుగోలు చేశానని, ఎటువంటి భూకబ్జాలకు పాల్పడలేదన్నారు.
కొన్ని మీడియా సంస్థల్లో తనపై అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. రాజకీయాల్లోకి వచ్చాక ఎవరి సంపాదన ఎంత, అది ఎలా వచ్చిందో విచారణ చేస్తే వాస్తవాలు బయటకొస్తాయని తెలిపారు. ఇరవై ఏళ్ల తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం వంటిదని తెలిపారు. కొనుగోలు చేసిన స్థలంలో ఇంతవరుకు కాలు కూడా మోపలేదని హరివర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.