ఉదయం 10.30 గంటల సమయంలో డాక్టర్లు రాకపోవడంతో ఖాళీగా ఉన్న కుర్చీలు
వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. వైద్యులు దేవుడితో సమానమని దీని అర్థం. అంతటి ప్రాధాన్యత ఉన్న డాక్టర్లు సమయ పాలన పాటించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన సమయంలో వైద్యం అందక పలువురు మృత్యు ఒడికి చేరుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. వరదయ్యపాళెం మండలం చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ దుస్థితి కనిపిస్తోంది.
సాక్షి, వరదయ్యపాళెం : 24గంటలు స్థాయి కలిగిన మండలంలోని చిన్న పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరు రోజురోజుకూ అధ్వానంగా మారుతోంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల సామాన్యులకు వైద్యసేవలు దూరమవుతున్నాయి. ముగ్గురు వైద్యులున్న ఈ ఆస్పత్రిలో సోమవారం ఉదయం 11గంటలు కావస్తున్నా ఏ ఒక్కరూ హాజరుకాలేదు. వైద్యం కోసం వచ్చిన రోగులు డాక్టర్ల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి. నిరీక్షించలేని రోగులు ఆస్పత్రిలో ఉన్న నర్సు ద్వారా తాత్కాలిక వైద్యం చేయించుకుని వెనుదిరిగారు. 11 గంటలు దాటిన తర్వాత ఓ వైద్యాధికారి వచ్చారు. మరో వైద్యాధికారిణి 11.40గంటలకు వచ్చారు. సరిగ్గా ఒంటిగంటకు వీరు తిరుగుపయనమయ్యారు. ఆస్పత్రికి వైద్యం కోసం ప్రతిరోజూ 100మందికి వస్తుంటారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆ సంఖ్య క్రమేణా తగ్గుతోంది. మండు వేసవి కారణంగా గ్రామాల్లో వడదెబ్బ బాధితులు అధికంగా ఉన్నారు. విషజ్వరాలు కూడా ప్రబలమవుతున్నాయి. ఇటీవల చిన్న పాండూరు ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎంజీనగర్ గిరిజనకాలనీలో ఊరంతా విషజ్వరాలు ప్రబలి నలుగురు మృతి చెందారు. అయినా ఇక్కడి వైద్యుల పనితీరులో మాత్రం మార్పు కనిపిం చడం లేదు.
ప్రభుత్వ నిబంధనలకు తూట్లు
వేసవి కాలం దృష్ట్యా ఉదయం 10 గంటలపైబడి ప్రభుత్వ కార్యాలయాల వద్దకు సామాన్య ప్రజలను రప్పించద్దంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే చిన్న పాండూరు ఆస్పత్రిలో పది గంటల వరకు డాక్టర్లు విధులకు హాజరుకాకపోవడం గమనార్హం. ఆస్పత్రి పనితీరు రోజురోజుకూ దిగజారుతోంది. 24 గంటలు స్థాయి కలిగిన ఈ ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు వైద్యులను ప్రభుత్వం నియమించింది. అయితే వీరు ముగ్గురు ఒక్క రోజు కూడా హాజరుకావడం లేదు. రోజు మార్చి రోజు విధులకు హాజరవుతూ హాజరు పట్టికలో మాత్రం నెలంతా హాజరైనట్లు నమోదు చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వం తప్పనిసరిగా బయోమెట్రిక్ ఏర్పాటు చేయాలని ఆదేశించినప్పటికీ అక్కడ నెట్ పనిచేయలేదన్న సాకుతో బయోమెట్రిక్ విధానం అమలుకు నోచుకోలేదు. రోజులో విధులకు హాజరయ్యే ఆ ఒక్క వైద్యుడు సైతం 2గంటలు మాత్రమే విధులు నిర్వహించడం గమనార్హం. లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటూ మొక్కుబడి విధులు నిర్వహించడమేమిటంటూ పరిసర ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment