పొట్టి చిత్రాలు తీయడంలో మన సిటీ కుర్రాళ్లు దిట్టలు. సృజనాత్మకతకు పెట్టింది పేరు మనవాళ్లు. ఎంతగా అంటే.. సమాజాన్ని మొత్తం చుట్టేసి పది నిమిషాల నిడివిలో బంధించగలరు. అందులో ఎంతో విషయం ఉంటుంది. ఎందరినో మేల్కొలిపే జ్ఞానం ఉంటుంది. చాలామంది స్నేహం, ప్రేమ, బంధాలు.. కాలేజీ లైఫ్.. ఇలా యువతను ఆకట్టుకునే లఘు చిత్రాలను తీస్తుంటే కొందరు మాత్రం అందుకు భిన్నం అంటున్నారు. అలాంటివారిలో ‘శశాంక్ రామానుజపురం’ ఒకడు. ఇతడు మాత్రం సమాజంలో మార్పు తీసుకొచ్చే కథాంశాలతో పొట్టి చిత్రాలను రూపొందించి అందరిచేతా ఔరా అనిపించుకుంటున్నాడు.
సాక్షి, సిటీబ్యూరో: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్వహించిన షార్ట్‌ఫిల్మ్ పోటీల్లో పాల్గొనేందుకు బాలకార్మికుల కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ‘చైల్డ్ లేబర్’ ఫిలిం తీశాడు శశాంక్. లంచగొండితనంపై తీసిన ‘మార్పు’ చిత్రాన్ని చూసిన దర్శకుడు రాజమౌళి సైతం ఫిదా అయ్యారు. అంతేకాదు.. ఆ చిత్రానికి ‘బెస్ట్ షార్ట్‌ఫిల్మ్’ అవార్డును అందించారు. గోమాతను పూజించాలన్న థీమ్‌తో తీసిన ‘గోపురం’ షార్ట్‌ఫిల్మ్‌కు చిన్నజీయర్ స్వామి నుంచి కూడా అవార్డు అందుకున్నాడు. ఇలా ఇప్పటి వరకు శశాంక్ 24 షార్ట్‌ఫిలిమ్స్ తీశాడు. అవన్నీ సందేశాత్మక చిత్రాలే కావడం విశేషం.
‘బ్యూటీఫుల్ లైఫ్’గా సాగాలి..
మనది అందమైన జీవితం. అది ఎంతో విలువైంది. కళాశాల చదువుల్లో వేసే తప్పటడుగుల వల్ల ఎంతో మంది యువత రోడ్డు ప్రమాదాల్లో అసువులు బాస్తున్నారు. మద్యం తాగి వాహనం నడుపుతూ మరణాన్ని కొనితెచ్చుకుంటున్నారు. కన్నవారికి శోకం మిగిలిస్తున్నారు. ఇటీవల మాదక ద్రవ్యాలకు కూడా బానిసై యువత భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. దీనిపై యువతలో మార్పు తెచ్చేందుకు శశాంక్ ‘బ్యూటీఫుల్ లైఫ్’ షార్ట్‌ఫిలిం తీశాడు. దానికి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ మద్ధతు పలికారు. మద్యం తాగడం వల్ల కలిగే అనర్థాలు.. తల్లిదండ్రులకు మిగులుస్తున్న శోకం గురించి షార్ట్‌ఫిల్మ్ ద్వారా అందరికీ కన్నీళ్లు తెప్పించిన ఈ కుర్రాడు ఏకంగా ఉత్తమ సందేశాత్మక ఓరియంటెడ్ షార్ట్‌ఫిల్మ్‌గా జాతీయస్థాయి అవార్డును దక్కించుకున్నాడు. అంతేకాదు.. ఈ చిత్రాన్ని సినిమా థియేటర్లలో ప్రచారం చిత్రంగా ప్రదర్శిస్తున్నారు.
డ్రగ్స్‌పై జాగృతి కల్పించేలా..
సాధారణంగా డ్రగ్స్‌కు నగర యువతే ఎక్కువగా అలవాటు పడతారని చాలామంది అపోహ. ఈ ప్రభావం పల్లెలపై ఎలా పడుతుందో చూపిస్తూ రాచకొండ పోలీసుల సహాకారంతో ‘మరో లోకం’ తీశాడు శశాంక్. సినీనటులు సన, సమీర్ ఈ చిత్రంలో నటించి యువతకు విలువైన సందేశం ఇచ్చే పాత్రలను పోషించారు. జనవరి నెలాఖరు నాటికి ఈ షార్ట్‌ఫిల్మ్‌ని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ చేతుల మీదుగా విడదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నారు.
మార్పు తేవాలన్నదే తపన..
నేను పుట్టింది వరంగల్‌లో. చదువు అంతా హైదరాబాద్‌లోనే సాగింది. బీకామ్ కంప్యూటర్స్ చేశా. చిన్నప్పటి నుంచి సమాజంలో జరిగే ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించేవాణ్ని. నాన్న వ్యాస్ ఇచ్చిన ప్రోత్సాహంతో ‘మిస్టర్ మేధావి, డార్లింగ్’ చిత్రాల్లో నటించా. అదే సమయంలో నాలో ఉన్న సామాజిక అంశాలను షార్ట్‌ఫిల్మ్ ద్వారా ప్రజలకు చేరువ చేయాలన్న ఆలోచనతో ‘చైల్డ్ లేబర్స్’ తొలి షార్ట్‌ఫిల్మ్ తీశా. ఆ తర్వాత సమాజంలో వేళ్లూనుకున్న లంచగొండితనం ఆపడం కుటుంబం నుంచే మొదలుకావాలన్న అంశంతో ‘మార్పు’ తీశా. రక్తదానంపై అవగాహన కలిగించేందుకు ‘రీ బర్త్’ లఘుచిత్రానికి ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో వరల్డ్ వైడ్‌లో టాప్ 100లో చోటు దక్కించుకుంది. డ్రంకన్ డ్రైవ్‌పై అవగాహన కలిగించేలా తీసిన ‘బ్యూటీఫుల్ లైఫ్’ నాకు ఎంతో పేరు తెచ్చింది. ఇప్పుడు కూడా రాచకొండ పోలీసుల సహాకారంతో ‘మరో లోకం’ తీశా. యువత మాదకద్రవ్యాలకు బానిసవుతున్న ఇందులో చూపించా.
Comments
Please login to add a commentAdd a comment