తొలి ఐపీఎస్ కాకపోయినా ధీర వనితే!
న్యూఢిల్లీ: అస్సాంలో బోడో మిలిటెంట్లను తుదముట్టించడంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శిస్తున్న అస్సాం మహిళా ఐపీఎస్ ఆఫీసర్ సంజుక్త పరాశర్ గురించిన పలు కథనాలు సామాజిక వెబ్‌సైట్లలో, ప్రధాన మీడియా స్రవంతిలో గతవారం రోజులుగా కనిపిస్తూ, ఇటు వ్యూయర్స్‌ను, అటు పాఠకులను విశేషంగా ఆకర్శిస్తున్నాయి.
అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఈ 15 నెలల కాలంలోనే, రాష్ట్రంలో కేంద్ర సీఆర్‌పీఎఫ్ దళాలకు స్వయంగా నాయకత్వం వహించి 16 మంది బోడో మిలిటెంట్లను హతమార్చడమే కాకుండా దాదాపు 66 మందిని అరెస్టు చేసిన పరాశర్ ధీరత్వాన్ని సామాజిక వెబ్‌సైట్లు ‘లైక్స్’తో కొనియాడుతున్నాయి. ఒక్క ఫేస్‌బుక్‌లోనే ఆమె లైక్స్ గురువారం నాటికి యాభై వేలను దాటాయి. 2006 బ్యాచ్‌కు చెందిన పరాశర్‌ను అస్సాం నుంచి సెలెక్టయిన తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా పేర్కొనడంలో మాత్రం ఇటు సోషల్ మీడియా, అటు ప్రధాన మీడియా తప్పులో కాలేసింది.
ఇక్కడ 1977 బ్యాచ్‌కు చెందిన అస్సాం తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ యామిన్ హజారికా గురించి, ప్రస్తుతం నార్త్ ఈస్ట్ పోలీసు అకాడమీ డెరెక్టర్‌గా పని చేస్తున్న డీ. రాణి డోలే బర్మన్ (1986 బ్యాచ్ కేడర్) గురించి మరిచిపోవడం చరిత్రను విస్మరించడమే అవుతోంది. మాతృరాష్ట్రం అస్సాం నుంచి ఎంపికై, అస్సాంలోనే పనిచేస్తున్న తొలి మహిళా ఆఫీసర్‌గా పరాశర్‌ను పేర్కొనవచ్చు. అస్సాంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిని పెళ్లి చేసుకోవడం వల్ల ఆమెకు అస్సాంలో పనిచేసే అవకాశం లభించింది.