
ట్యాబ్లెట్ల టార్గెట్ పిల్లలే..!
రెండేళ్ల కిందట ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో ట్యాబ్లెట్ల హవా మామూలుగా లేదు. బీభత్సమైన మోడళ్లతో కంపెనీలు మార్కెట్‌ను ముంచెత్తాయి.
దేశీ మార్కెట్లో 10% ఈ సెగ్మెంటే
వినోద, విజ్ఞాన యాప్‌లతో ఆకర్ష..
కంటెంట్ కోసం ఒప్పందాలు
రూ.10 వేల లోపు ధరలతో ప్రచారం
రెండేళ్ల కిందట ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో ట్యాబ్లెట్ల హవా మామూలుగా లేదు. బీభత్సమైన మోడళ్లతో కంపెనీలు మార్కెట్‌ను ముంచెత్తాయి. కానీ తక్కువ ధరకే పెద్ద స్క్రీన్లను అందించే ఫోన్లు రంగంలోకి రావటంతో పరిస్థితి మారిపోయింది. ట్యాబ్లెట్ల అమ్మకాలు ఆశించినంతగా పెరగలేదు. దీంతో భవిష్యత్ అంచనాలను కూడా సవరించాల్సి వస్తోంది. మరేం చేయాలి? కంపెనీల ఆలోచన ఇదే. బాగా ఆలోచించాక ఇపుడు ట్యాబ్లెట్ కంపెనీలన్నీ పిల్లలపై గురిపెట్టాయి. వినోదంతో పాటు విజ్ఞానం కూడా అందించే ట్యాబ్లెట్లతో ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా ట్యాబ్లెట్ పీసీల మార్కెట్ ఏడాదికి 40 లక్షల యూనిట్ల మేర ఉంటోందని అంచనా. ఇందులో పిల్లల విభాగం ట్యాబ్లెట్ పీసీల వాటా 8-10 శాతం మేర అంటే దాదాపు 4 లక్షల యూనిట్ల మేర ఉంటోంది. అందుకే కంపెనీలు ఈ వాటా కోసం పోటీ పడుతున్నాయి.
ఒక అధ్యయనం ప్రకారం భారత్‌లో పిల్లలు రోజులో సగటున రెండు గంటలు టీవీని చూస్తుండగా... అంతకు మించి ఎక్కువ సమయాన్ని తమ తల్లిదండ్రుల స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లలో గేమ్స్ ఆడుతూ గడుపుతున్నారు. మరోవంక టెక్నాలజీని అందిపుచ్చుకునే మధ్యతరగతి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో ఈ గణాంకాల్లో దాగి ఉన్న వ్యాపారావకాశాలపై ట్యాబ్లెట్స్ కంపెనీలు కన్నేశాయి. దేశీయంగా ప్రస్తుతం మిటాషీ ఎడ్యుటైన్‌మెంట్, స్వైప్ టెలికం, ఫ్యూజన్ డైనమిక్స్ వంటి సంస్థలు కిడ్స్ ట్యాబ్లెట్స్‌ను తయారు చేస్తున్నాయి. మెటిస్ లెర్నింగ్ సంస్థ... చిప్ తయారీ సంస్థ ఇంటెల్‌తో కలిసి ఏడీ పేరుతో ట్యాబ్లెట్స్ తయారు చేస్తోంది. మూడేళ్లు పైబడిన పిల్లల కోసం చోటా భీమ్ పేరిట ఫ్యూజన్ డైనమిక్స్ ట్యాబ్లెట్స్‌ను అందిస్తోంది. పలు కంపెనీలు ఈ మార్కెట్‌పై దృష్టి సారిస్తున్నాయి.
కంటెంట్‌పై కసరత్తు...
పిల్లలను ఆకట్టుకుకోవటంతో పాటు వాటిని తప్పకుండా కొనాలని పెద్దలక్కూడా అనిపించేలా ఆకర్షణీయమైన కంటెంట్‌ను అందించేందుకు కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. మెటిస్ లెర్నింగ్ సంస్థ తమ ఏడీ ట్యాబ్లెట్స్‌లో ప్రముఖ విద్యావేత్తలు సూచించినట్లు... రెండేళ్ల నుంచి పదేళ్ల లోపు పిల్లలు నేర్చుకోతగిన 160 పైచిలుకు లెర్నింగ్ యాప్స్‌ను పొందుపర్చింది. వినో దం, విద్య సంబంధ అంశాలను మరింతగా జోడిం చేందుకు మిటాషీ, స్వైప్ సంస్థలు ఎడ్యుకేషన్ యాప్స్ డెవలపర్లతో కలిసి పనిచేస్తున్నాయి. అలాగే వినోదపరమైన కంటెంట్ కోసం డిస్నీ, వార్నర్ బ్రద ర్స్ వంటి సంస్థలతో మిటాషీ చర్చలు జరుపుతోంది. ఆన్‌లైన్లో విక్రయాలు: చాలా మటుకు ట్యాబ్లెట్స్ విక్రయాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఆన్‌లైన్ సంస్థల ద్వారానే జరుగుతున్నాయి. స్వైప్‌కు చెందిన జూనియర్ ట్యాబ్లెట్ పీసీ రేటు రూ.5,749గా ఉంది. చోటా భీమ్ ట్యాబ్లెట్లు రూ.8,499 స్థాయిలో, మిటాషీ స్కై ట్యాబ్-2 రూ.5,999 నుంచి, మెటిస్-ఇంటెల్‌కి చెందిన ఏడీ ట్యాబ్లెట్ పీసీల రేట్లు రూ.9,999 స్థాయిలో ఉన్నాయి.
అమ్మకాలు 23.45 కోట్లు!
ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) అంచనాల ప్రకారం పర్సనల్ కంప్యూటర్ల అమ్మకాలు తగ్గుతుండగా ఆ స్థానాన్ని ట్యాబ్లెట్లతో పాటు ఫోన్లు, ఫ్యాబ్లెట్లు ఆక్రమిస్తున్నాయి. విండోస్ ప్లాట్‌ఫామ్ ద్వారా తనకున్న అనుకూలతను ఆసరా చేసుకుని ట్యాబ్లెట్ రంగంలో మైక్రోసాఫ్ట్ దూసుకెళుతుందని కూడా ఇది అంచనా వేసింది. ప్రస్తుతం 5.1 శాతంగా ఉన్న మైక్రోసాఫ్ట్ ట్యాబ్లెట్ల వాటా అంతర్జాతీయంగా 2019 నాటికి 14 శాతానికి చేరుతుందని ఐడీసీ పేర్కొంది. ‘‘ప్రపంచవ్యాప్తంగా 2015లో 23.45 కోట్ల ట్యాబ్లెట్లు అమ్ముడవుతాయి. 2014తో పోలిస్తే ఇది 2.1 శాతం ఎక్కువ. 2019 నాటికి అమ్మకాలు 26.9 కోట్లకు చేరుతాయి.
- సాక్షి బిజినెస్ విభాగం