ఏడాదికి ఒక్కో జిల్లాకు రూ.200 కోట్లు ఆర్థిక సాయం
అంగీకరించిన కేంద్రం, నాలుగేళ్లలో రూ.5,600 కోట్లు సాయం
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిధులు రాబట్టడంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజీపడుతున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం సెక్షన్-46 (2) అండ్ (3)లో వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని స్పష్టం చేశారు. ఆ చట్టంలో పేర్కొన్న మేరకు అధిక శాతం నిధులు రాబట్టేందుకు కేంద్ర ప్రభుత్వంపై గట్టి ఒత్తిడి తెచ్చి ఒప్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలం చెందారు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఏడు జిల్లాల్లో అభివృద్ధి ప్యాకేజీ నిధులను తగ్గించుకోవడానికి ఏపీ సీఎం అంగీకరించారు. ఫలితంగా వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ఏడు జిల్లాలకు ఏడాదికి రూ.1,400 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈమేరకు ఏడాదికి జిల్లాకు రూ.200 కోట్లు చొప్పున ఆర్థిక సాయం అందించనుంది.
నాలుగేళ్లపాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు మొత్తం రూ.5,600 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు ఉన్నతస్థాయి అధికారి తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం తొలుత ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద ఏడాదికి రూ.5,000 కోట్ల చొప్పున ఐదేళ్ల కాలంలో రూ.24,350 కోట్ల ఆర్థిక సాయం అందించాల్సిం దిగా ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఆ ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇన్ని నిధులు ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర, రాయలసీమ ఏడు జిల్లాలకు జిల్లాకు రూ.400 కోట్ల చొప్పున నాలుగు సంవత్సరాలపాటు ఆర్థిక సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రతిపాదనలను కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తిరస్కరించింది. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద గత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జిల్లాకు రూ.50 కోట్ల రూపాయల చొప్పున రూ.350 కోట్ల రూపాయలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం జిల్లాకు ఏడాదికి రూ.200 కోట్ల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ప్రతిపాదనలు పంపగా కేంద్ర ప్రభుత్వం సముఖత వ్యక్తం చేసిందని ఉన్నతాధికారి తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరం ఇచ్చిన నిధులు మళ్లింపు
గత ఆర్థిక సంవత్సరంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఇచ్చిన రూ.350 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లించింది. కేంద్రం ఇచ్చిన నిధులతో ఆయా జిల్లాల్లో ప్రత్యేక అభివృద్ధి పథకాల రూపకల్పన, అందుకు నిధుల విడుదలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చేయకపోవడం గమనార్హం.
ఏపీలో వెనుకబడిన జిల్లాలకు1400 కోట్లు
Published Wed, Aug 5 2015 2:13 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement
Advertisement