కాడిపట్టే రైతు.. కాటికి చేరుతున్నాడు
17 మంది అన్నదాతల ఆత్మహత్య
సాక్షి నెట్‌వర్క్: తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదు. కాడి పట్టి దుక్కి దున్నే రైతన్న సాగు భారమై.. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు వివిధ జిల్లాల్లో 17 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా...
నర్వ మండలం కన్మనూర్‌కు చెందిన రైతు చిన్న కొండన్న(48) మూడున్నర ఎకరాల్లో వేసిన కంది పంట కళ్లముందే ఎండిపోయింది. సాగు కోసం చేసిన రూ. 4.5 లక్షల అప్పు తీర్చే మార్గం లేక ఉరి వేసుకున్నాడు. తలకొండపల్లి మండలం లింగరావులపల్లికి చెందిన రైతు పోతుగంటి వెంకట్‌రెడ్డి(40) 24 ఎకరాల్లో వేసిన పత్తి పంట ఎండిపోవడంతో మంగళవారం క్రిమిసంహారక మందు తాగాడు.
పెద్దకొత్తపల్లిమండలం చెన్నాపురావుపల్లికి చెందిన రైతు పిట్టల వెంకటస్వామి(40) పంట చేతికి వచ్చే పరిస్థితి లేక ఉరి వేసుకున్నాడు. మల్దకల్ గ్రామానికి చెందిన రైతు సుందర్‌రాజు సాగు కోసం రూ.2 లక్షలు అప్పు చేశాడు. తీరేమార్గం కనిపించక బుధవారం ఉరి వేసుకున్నాడు. భూత్పూర్ మండలం పెద్దతాండకు చెందిన ఉడ్యావత్ పాండు (39) అప్పు తీర్చే మార్గంలేక మంగళవారం పురుగుమందు తాగాడు.
మెదక్ జిల్లా..
పాపన్నపేట మండలం అన్నారం గ్రామానికి చెందిన జంగిడి పెంటయ్య(50) అప్పుల బాధ పెరగడంతో బుధవారం ఉరి వేసుకున్నాడు. దుబ్బాక మండలం పోతారెడ్డిపేటకు చెందిన మల్కనగిరి బాలయ్య(60) అప్పు తీర్చే మార్గం లేక ఉరేసుకున్నాడు. మెదక్ మండలం రాజ్‌పల్లికి చెందిన సార శంకర్‌గౌడ్(42) పంట కోసం 4 లక్షల అప్పు చేశాడు. తీరే మార్గంలేక మంగళవారం రాత్రి కరెంట్ వైర్లు పట్టుకున్నాడు. పటాన్‌చెరు మండలం ఐనోల్‌కు చెందిన రైతు చిట్టికింది ఎల్లయ్య(38) బుధవారం ఉరి వేసుకున్నాడు.
వరంగల్ జిల్లా...
గణపురం మండలం ధర్మారావుపేట శివారు జంగుపల్లికి చెందిన రైతు వేముల వీరారావు(40) అప్పుల బాధ తట్టుకోలేక గతంలో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ క్రమంలో బుధవారం ఉరి వేసుకున్నాడు. నర్సంపేట మండలం చంద్రయ్యపల్లికి చెందిన రైతు బాషబోయిన శ్రీను(35) అప్పులు పేరుకుపోవడంతో క్రిమిసంహారక మందు తాగాడు. నర్సంపేట మండలం మాధన్నపేటకు చెందిన రైతు మెంతుల సాంబరాజు(26) బుధవారం ఉరి వేసుకున్నాడు. గీసుకొండ మండలం శాయంపేటహవేలి గ్రామానికి చెందిన రైతు పంజాల రాజలింగం(65) పంటలు సరిగా పండకపోవడంతో రూ. 2 లక్షల వరకు అప్పు చేశాడు. ఈ నెల 19న ఆత్మహత్యాయత్నం చేశాడు. బుధవారం చనిపోయాడు.
రంగారెడ్డి జిల్లా..
మేడ్చల్ మండలం రావల్‌కోల్‌కు చెందిన రైతు గడీల లక్ష్మణ్(28) మొక్కజొన్న, పత్తి సాగు చేస్తున్నాడు. పంట ఎండు ముఖం పట్టడంతో అప్పు చేసి రెండు బోర్లు వేయించాడు. అయినా, చుక్కనీరు రాలేదు. అప్పు రూ. 3 లక్షలకు చేరడంతో తీర్చే మార్గం కనిపించక మంగళవారం ఉరి వేసుకున్నాడు. శంషాబాద్ మండలం రషీద్‌గూడకు చెందిన రైతు కోడూరి వెంకటేష్(38) పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు పెరిగాయి. దీంతో గతేడాది వెంకటేష్ భార్య చందన ఆత్మహత్యకు పాల్పడింది.
సాగు కోసం చేసిన అప్పులు రూ. 2.5 లక్షలకు చేరాయి. దీంతో ఈ నెల 21న క్రిమిసంహారక మందు తాగాడు. చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందాడు. షాబాద్ మండలం ఏట్ల ఎర్రవల్లికి చెందిన బేగరి విఠలయ్య(45) అప్పులు రూ. 5 లక్షలకు చేరడంతో మనోవేదనకు గురై బుధవారం సాయంత్రం పొలంలో ఉరివేసుకున్నాడు. మరోవైపు నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం చౌళ్లరామారం గ్రామానికి చెందిన రైతు మెట్టు కృపాకర్‌రెడ్డి(37) పెట్టుబడుల కోసం రూ. 7 లక్షల వరకు అప్పు చేశాడు. దిగుబడి సరిగా వచ్చే అవకాశం లేకపోవడంతో మనస్తాపానికి గురై మంగళవారం ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగాడు. హైదరాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, బుధవారం చనిపోయాడు.