1993 ముంబై పేలుళ్లు..
1993 మార్చి 12వ తేదీ.. ముంబై నగరం ఉగ్రరక్కసి కరాళనృత్యంతో నెత్తురోడిన రోజు. ఆ రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలుకొని 3:40 గంటల వరకూ 13 చోట్ల వరుస విరామాలతో బాంబు పేలుళ్లు సంభవించాయి. 257 మంది అమాయకులు చనిపోగా, 713 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్ల కుట్ర పన్నింది మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అని.. అతడికి సహచరుడైన టైగర్ మెమన్, అతడి సోదరులైన యాకూబ్ మెమన్, ఈసామెమన్, యూసుఫ్‌లు సాయం చేశారని దర్యాప్తు సంస్థలు నిగ్గుతేల్చాయి.
అంతకు 4 నెలల ముందు 1992 డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలో బాబ్రీమసీదు విధ్వంసం.. తదనంతరం దేశంలోని పలు ప్రాంతాలతో పాటు ముంబైలోనూ చెలరేగిన మతఘర్షణలు ఈ బాంబు దాడులకు కారణంగా చెప్తారు. ముంబై అల్లర్లలో దాదాపు 900 మంది చనిపోయారు. దీంతో ముంబైలో బాంబు పేలుళ్లతో రక్తపాతానికి పాక్‌కు చెందిన నిఘా సంస్థ ఐఎస్‌ఐ వ్యూహరచనతో దావూద్ ముఠా కుట్రపన్నింది. నగరంలో మైనారిటీ వర్గానికి చెందిన 19 మంది యువకులను ప్రలోభపెట్టి.. తొలుత దుబాయ్‌కి, అక్కడి నుంచి పాక్‌కు తరలించి.. బాంబులు, మారణాయుధాల వినియోగంలో శిక్షణనిచ్చారు. వారు ముంబైకి తిరిగివచ్చి నగరంలో బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు.
ముంబై పోలీసులు.. రెండు రోజుల్లోనే మాఫియా డాన్ దావూద్ హస్తాన్ని గుర్తించారు. వందలాది మందిని అరెస్ట్ చేశారు. వారిలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌ను 1993 ఏప్రిల్ 19న అరెస్ట్ చేశారు. ఆయన అక్రమంగా ఆయుధాలు కలిగివుండటం, సాక్ష్యాలను ధ్వంసం చేయటం అభియోగాల కింద అరెస్ట్‌చేశారు. 1993 నవంబర్ 4వన.. 189 మంది నిందితులపై 10 వేల పేజీలతో ప్రత్యేక టాడా కోర్టులో అభియోగపత్రం నమోదుచేశారు.
అప్పటికే దావూద్, టైగర్ మెమన్‌లు పాక్‌లో తలదాచుకుని ఉండటం.. కేసు తీవ్రత దృష్ట్యా అదే ఏడాది నవంబర్ 19న దర్యాప్తు సీబీఐకి బదిలీ అయింది. టాడా కోర్టు.. 1995 ఏప్రిల్ 10వ తేదీన నిందితుల్లో 26 మందిని నిర్దోషులుగా విడిచిపెట్టింది. సుప్రీం మరో ఇద్దరిని నిర్దోషులుగా వదిలిపెట్టింది. ఇద్దరు నిందితులు అప్రూవర్లుగా మారారు. 1996 మార్చి 26న టాడా కోర్టు జడ్జీగా పి.డి.కోడె నియమితులయ్యారు. 684 మంది సాక్షుల పరిశీలన 2000 అక్టోబర్ వరకూ కొనసాగింది.
2006 సెప్టెంబర్ 12 నుంచి కోర్టు తీర్పులు వెలువరించింది. మెమన్ కుటుంబంలో నలుగురిని దోషులుగా ప్రకటించింది. మరో ముగ్గురిని సందేహలాభం (బెనిఫిట్ ఆఫ్ డౌట్) కింద నిర్దోషులుగా వదిలిపెట్టింది. మొత్తం 100 మందికి శిక్షలు ప్రకటించింది. వారిలో యాకూబ్ సహా 12 మందికి మరణశిక్ష, 18 మందికి జీవితఖైదు విధించింది. అయితే దావూద్ ఇబ్రహీం, టైగర్‌మెమన్ పరారీలోనే ఉన్నారు. సుప్రీంకోర్టు.. యాకూబ్ మెమన్‌కు విధించిన మరణశిక్షను ఖరారు చేసింది. మిగతా వారికి విధించిన మరణశిక్షను జీవిత ఖైదుకు తగ్గించింది. సంజయ్‌దత్‌కు కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ.. అక్రమంగా ఆయుధాలు కలిగివుండటం, సాక్ష్యాలను ధ్వంసం చేయటం నేరాల కింద టాడా కోర్టు ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష వేసింది. సుప్రీం శిక్షను ఖరారు చేయడంతో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
→101 2015 జూలై నాటికి 101 దేశాల్లో మరణశిక్షను రద్దు చేశారు. ఎంత ఘోరమైన నేరానికైనా మరణశిక్ష ఉండదు.
→22 2014లో ప్రపంచవ్యాప్తంగా 22 దేశాలు మరణశిక్షను అమలు చేశాయి.
→2,466 2014లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 2,466 మందికి మరణదండన విధించారు. 2013తో పోలిస్తే ఇది 28 శాతం ఎక్కువ.