తల్లి శవాన్ని ఇంట్లో 9 నెలలు ఉంచుకుని..
కోల్కతా: బెంగాల్లో మరో దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. నదియా జిల్లాలోని సింహట్ గ్రామంలో ఇద్దరు సోదరులు మరణించిన తల్లికి అంత్యక్రియలు చేయకుండా, ఆమె శవాన్ని దాదాపు 9 నెలల పాటు ఇంట్లోనే పెట్టుకుని నివసించారు. చాలా రోజులుగా ఆమె కనిపించకపోవడంతో సందేహించిన స్థానికులు బలవంతంగా ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, బెడ్పై అస్థిపంజరం కనిపించింది. స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.
పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ఇద్దరు సోదరులు అరుణ్ సాహా (65), అజిత్ సాహా (55)లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారించగా, జూన్ 16న తమ తల్లి మరణించినట్టు కొడుకులు చెప్పారు. వాతావరణ పరిస్థితుల కారణంగా తల్లి శవాన్ని అంత్యక్రియలు చేయడానికి తీసుకెళ్లలేదని తెలిపారు. అన్నదమ్ములు ఇరుగుపొరుగు వారితో కలిసేవారు కాదని, ఎవరితో మాట్లాడకుండా సమాజానికి దూరంగా ఉండేవారని స్థానికులు చెప్పారు. అంతేగాక వారి ఇల్లు ఊరికి కాస్త దూరంగా ఉండటంతో వృద్ధురాలు మరణించిన విషయం స్థానికులు వెంటనే తెలుసుకోలేకపోయారు. అన్నదమ్ములకు మానసిక సమస్యలు ఉండవచ్చని పోలీసు అధికారులు సందేహం వ్యక్తం చేశారు. వృద్ధురాలి అస్థిపంజరాన్ని ఫోరెన్సిక్ పరీక్షలకు తరలించారు. గతేడాది కోల్కతాలో ఇలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది.