అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడ్ ఆర్థిక ఉద్దీపనపై ఆ బ్యాంక్ ఛైర్మన్ చేసిన అనుకూల ప్రకటన, చైనా సంస్కరణల ప్రభావంతో గతవారం ప్రధమార్థంలో వేగంగా పెరిగిన భారత్ మార్కెట్ ద్వితీయార్థంలో అదే ఫెడ్ కమిటీ సమావేశపు మినిట్స్ ప్రతికూలంగా వున్నాయన్న సాకుతో పడిపోయింది. వెరసి రెండు వారాలుగా 3 శాతం శ్రేణిలో స్టాక్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. మరోవైపు అమెరికా డోజోన్స్, ఎస్ అండ్ పీ సూచీలు ఏరోజుకారోజు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అయితే గతవారం అమెరికా ట్రెండ్ నుంచి భారత్‌తో పాటు మిగిలిన ప్రధాన ఆసియా దేశాల (జపాన్ మినహా) సూచీలు కూడా విడివడ్డాయి. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీలతో సహా హాంకాంగ్, తైవాన్, ఇండోనేషియా, సింగపూర్ సూచీలు తగ్గాయి. హఠాత్తుగా విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కూడా నిలిచిపోయాయి. గతవారం చివరిరెండు రోజులూ వారు స్వల్పంగా నికర అమ్మకాలు జరిపారు. భారత్‌లో పెట్టుబడులకు ఉద్దేశించిన గ్లోబల్ ఫండ్స్‌లోకి నిధుల రాక తగ్గినట్లు, చైనా ఫండ్స్‌లోకి ప్రవాహం పెరిగినట్లు ఈపీఎఫ్‌ఆర్ (గ్లోబల్ ఫండ్స్‌ఫ్లో ట్రాక్‌చేసే సంస్థ) తాజా డేటా వెల్లడిస్తున్నది. అలాగే అమెరికా డె డికేటెడ్ ఫండ్స్‌లో పెట్టుబడులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ అంశాలన్నీ భారత్ మార్కెట్‌ను ఆందోళనపర్చేవే. అయితే విదేశీ ఇన్వెస్టర్లు వారి పెట్టుబడుల ట్రెండ్‌ను వేగంగా మార్చేస్తుంటారు. ఈ వారాంతంలో క్యూ2 జీడీపీ డేటా, డిసెంబర్8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నందున, వచ్చే 15 రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు నిధుల ప్రవాహం మార్కెట్ కదలికలకు కీలకం కావొచ్చు. ఇక సాంకేతికంగా చూస్తే..గత రెండు వారాల శ్రేణిని ఎటువైపు ఛేదిస్తే సూచీలు అటు వేగంగా ప్రయాణించవచ్చు. లేదా ఎన్నికల ఫలితాలు వెలువడేవరకూ ఇదే శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చు.
సెన్సెక్స్‌పై సాంకేతిక అంచనాలు
నవంబర్ 22తో ముగిసినవారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 20,877 పాయింట్ల స్థాయికి కాస్త ఎగువన నిరోధాన్ని ఎదుర్కొని తిరిగి 20,137 కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 182 పారుుంట్ల నష్టంతో 20,217 వద్ద ముగిసింది. అమెరికా సూచీలు శుక్రవారం రికార్డు గరిష్టస్థాయిలో ముగిసిన ప్రభావంతో ఈ సోమవారం సెన్సెక్స్ గ్యాప్‌అప్‌తో మొదలైతే 20,390 సమీపంలో తొలి అవరోధం ఎదురుకావొచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే 20,580 వద్దకు క్రమేపీ పెరగవచ్చు. ఈ స్థాయిపైన ముగింపు 20,870 వద్దకు చేర్చవచ్చు, దీపావళినాటి 21,321 గరిష్టస్థాయి నుంచి నవంబర్ 22నాటి కనిష్టస్థాయి 20,137 వరకూ జరిగిన 1,184 పాయింట్ల పతనంలో 61.8% రిట్రేస్‌మెంట్‌స్థాయి అయిన 20,870 స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో అధిగమిస్తే ప్రస్తుత డౌన్‌ట్రెండ్ ముగియవచ్చు. ఈ వారం తొలిరోజే క్షీణత మొదలైతే తక్షణ మద్దతు 20,150 సమీపంలో లభిస్తున్నది. ఈ వారం రెండో నిరోధాన్ని దాటలేకపోయినా, తక్షణ మద్దతుస్థాయిని కోల్పోయినా 19,841 వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయి దిగువన 200 రోజుల చలన సగటు (200 డీఎంఏ) రేఖ సంచరిస్తున్న 19,552 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు.
నిఫ్టీ తక్షణ మద్దతు 5,972
గతవారపు అంచనాలకు అనుగుణంగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 6,200-5,950 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 61 పారుుంట్ల నష్టంతో 5,995 పాయింట్ల వద్ద ముగిసింది. నవంబర్ డెరివేటివ్ సిరీస్ ఈ వారం ముగియనున్న నేపథ్యంలో 6,000 స్థాయి టార్గెట్‌గా అటు కాల్, పుట్ ఆప్షన్ల రైటింగ్ జోరుగా సాగింది. ఈ వారం నిఫ్టీ 6,000స్థాయిపైన నిలదొక్కుకుంటే వేగంగా 100 పాయింట్ల వరకూ ర్యాలీ జరపవచ్చని, 6,000 స్థాయిని వదులుకుంటే పతనంకావొచ్చని ఆప్షన్ బిల్డప్ సూచిస్తున్నది. ఇక చార్టుల ప్రకారం చూస్తే....నిఫ్టీ గ్యాప్‌అప్‌తో మొదలైతే తక్షణ అవరోధం 6,050 వద్ద ఎదురవుతున్నది. ఈ నిరోధస్థాయిని దాటితే 6,106 పాయింట్లస్థాయికి పెరగవచ్చు. ఈ రెండు అవరోధాల్ని అధిగమిస్తే 61.8% రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 6,201 పాయింట్ల వరకూ నిఫ్టీ మరోసారి ర్యాలీ జరపవచ్చు. ఈ వారం క్షీణతతో మొదలైతే రెండు వారాల నుంచి మద్దతునిస్తున్న 5,972 పాయింట్ల స్థాయే ప్రధానం. ఈ స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో కోల్పోతే 150 డీఎంఏ అయిన 5,891 స్థాయికి పతనం కావొచ్చు. ఆ దిగువన 200 డీఎంఏ రేఖ కదులుతున్న 5,863 పాయింట్లస్థాయి మార్కెట్ అప్‌ట్రెండ్‌కు కీలకమైనది.
- పి. సత్యప్రసాద్
సెన్సెక్స్ మద్దతు 20,150
Published Mon, Nov 25 2013 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM
Advertisement
Advertisement