5 రోజుల పాటు 25 మంది ఎంపీల సస్పెన్షన్ | 25 congress mps suspended for 5 days from loksabha, house adjourned for the day | Sakshi
Sakshi News home page

5 రోజుల పాటు 25 మంది ఎంపీల సస్పెన్షన్

Published Mon, Aug 3 2015 3:44 PM | Last Updated on Sat, Mar 9 2019 3:59 PM

5 రోజుల పాటు 25 మంది ఎంపీల సస్పెన్షన్ - Sakshi

5 రోజుల పాటు 25 మంది ఎంపీల సస్పెన్షన్

మంత్రులు రాజీనామా చేయాల్సిందేనంటూ విపక్ష సభ్యులు, కాదు వాళ్లు తప్పుకోవాల్సిన అవసరం లేదని అధికార పక్షం పట్టుబట్టడం, విపక్ష సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్ లోకి దూసుకురావడంతో.. 25 మంది కాంగ్రెస్ సభ్యులను లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఐదు రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఈ పరిణామంతో తీవ్ర గందరగోళం చెలరేగుతుండగానే సభను రేపటికి వాయిదా వేశారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం తర్వాత కూడా సభ నడిచే తీరులో ఎలాంటి మార్పు కనపడలేదు. ఈ సమయంలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ లేచి మాట్లాడారు.

''ప్రజాస్వామ్యంలో విపక్షాలకు గౌరవప్రదమైన స్థానం ఉంది. మంత్రులు ఎవరి మీదా ఎఫ్ఐఆర్లు దాఖలు కాలేదు, వాళ్లు తప్పు చేసినట్లు ఎక్కడా రుజువు కాలేదు. కనీసం సీవీసీ కూడా వాళ్లను తప్పుబట్టలేదు. అందువల్ల వాళ్లు రాజీనామా చేసే ప్రసక్తి లేదు'' అని చెబుతుండగా, విపక్ష కాంగ్రెస్, తృణమూల్ సభ్యులు ఒంటికాలి మీద లేచారు. మంత్రులు రాజీనామా చేయాల్సిందేనంటూ సభ్యులు నినాదాలు చేశారు. ఆ సమయంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ పదే పదే వారికి విజ్ఞప్తి చేసినా వినిపించుకోలేదు. తృణమూల్ సభ్యులు సౌగత్ రాయ్ తదితరులను ఉద్దేశించి, ఇది పద్ధతి కాదని, సభను డిస్ట్రబ్ చేయొద్దని అన్నారు. సభ్యుల ప్రవర్తన మారకపోతే కఠిన చర్యలు తప్పవని స్పీకర్ హెచ్చరించారు. ఎంపీలను సస్పెండ్ చేస్తామని బెదిరించడం పద్ధతి కాదని లోక్సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అన్నారు

అయితే.. తాను పోస్టర్లు, ప్లకార్డులు ప్రదర్శించొద్దని, ఉన్న సమయాన్ని బట్టి చెప్పదలచుకున్నది చెప్పాలని సూచించినా ఎవరూ వినిపించుకోలేదని స్పీకర్ అన్నారు. మీ ఇష్టం వచ్చినట్లు ఎవరికి వాళ్లు అరుస్తుంటే, వెల్లోకి దూసుకొస్తే సభను ఎలా నిర్వహించాలని అడిగారు. జేడీయూ వాళ్లు వేరే వేరే విషయాలు ప్రస్తావిస్తున్నారని, తాను అందరికీ అవకాశం ఇస్తానని చెప్పారు. కానీ అసలు ఎవరినీ మాట్లాడనివ్వకుండా చేస్తే తాను చేయగలిగింది కూడా ఏమీ లేదని ఆమె స్పష్టం చేశారు.
ఫ్లోర్ లీడర్లు తమ ఎంపీలను వెనక్కి పిలిపించాలని కోరారు.

సభ నడవాల్సిందేనని తృణమూల్ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ అన్నారు. అయితే ప్రభుత్వం కూడా మొండిగా వ్యవహరిస్తే ఎలా జరుగుతుందని ఆయన అడిగారు. సభలో ఏ ఒక్క సభ్యుడినీ సస్పెండ్ చేయడం ద్వారా పరిస్థితి మరింత దిగజారకుండా చూడాలని ఆయన కోరారు. ఆ సమయంలో ఏ సభ్యుడూ సభను ఇబ్బంది పెట్టకుండా మీరు గ్యారంటీ ఇస్తారా అని స్పీకర్ ప్రశ్నించగా, తాను తన పార్టీ తరఫున గ్యారంటీ ఇస్తాను గానీ అందరి తరఫున చెప్పలేనని ఆయన అన్నారు.

అందరిముందుకు వచ్చి నిలబడటం, ప్లకార్డులు ప్రదర్శించడం.. ఇది పద్ధతేనా అని స్పీకర్ ప్రశ్నించారు. ఐదు నిమిషాల పాటు తాను ఏమీ మాట్లాడకుండా ఊరుకుంటానని, ఆలోపు సభను ఎవరైనా పద్ధతిలో పెట్టగలరా అని అడిగారు. తనకు ఎవరూ సాయం చేయడంలేదని.. ప్లకార్డులు ఉపసంహరించడంలో ఎవరైనా సాయం చేస్తామంటే తీసుకుంటానని, కానీ అందుకు ఎవరూ ముందుకు రావట్లేదని ఆమె అశక్తత వ్యక్తం చేశారు.

తాను గతంలో కూడా ఎంపీగా ఉన్నానని, అప్పుడు బీజేపీ సభ్యులు నెల రోజుల పాటు సభను స్తంభింపజేసినప్పుడు ఏ ఒక్క సభ్యుడి మీద కూడా చర్య తీసుకోలేదని.. కానీ ఇప్పుడు మాత్రం తమను సస్పెండ్ చేస్తున్నారని, ఇది ఎలా కుదురుతుందని కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎంపీ అడిగారు. ఈ సమయంలోనే స్పీకర్ మొత్తం 25 మంది సభ్యుల పేర్లు చదివి, వాళ్లందరూ తాను ఎంతగా విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా సభకు ఆటంకం కలిగిస్తున్నారని, అందువల్ల వాళ్లను వరుసగా 5 రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు. దీంతో విపక్ష సభ్యులు ఒక్కసారిగా లేచి పెద్దపెట్టున నినాదాలు చేయగా.. ఆ సమయంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ లోక్సభను రేపటికి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement