పాకిస్థాన్ జైళ్ల నుంచి 338 మంది భారతీయ ఖైదీలు విడుదల కానున్నారు. వీరిలో 8 మంది పిల్లలు సైతం ఉన్నారు. వీళ్లంతా వాఘా-అటారీ సరిహద్దు వద్ద శనివారం నాడు భారతదేశంలోకి ప్రవేశిస్తారు. ఈ మేరకు పాకిస్థాన్కు చెందిన లీగల్ ఎయిడ్ ఆఫీసు (ఎల్ఏఓ) ప్రతినిధి రిజ్వానుల్లా జమీల్ నుంచి అధికారిక సమాచారం అందినట్లు భారత్-పాక్ దేశాల మధ్య శాంతి కోసం ప్రయత్నాలు చేస్తున్న జతిన్ దేశాయ్ తెలిపారు. కరాచీ లోని రెండు వేర్వేరు జైళ్లలో మగ్గుతున్న భారతీయ ఖైదీలను శుక్రవారం నాడు అక్కడ విడుదల చేస్తారని, వీళ్లంతా ఎనిమిది ప్రత్యేక బస్సులలో లాహోర్ లోని వాఘా సరిహద్దు, అమృతసర్ సమీపంలోని అటారీ సరిహద్దులకు చేరుకుంటారని దేశాయ్ చెప్పారు.
కరాచీలోని మాలిర్ జిల్లా జైల్లో ఉన్న 330 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేయాలని పాకిస్థాన్ ప్రభుత్వం నిర్ణయించడంతో ఇది సాధ్యమైంది. అలాగే, కరాచీలోని బాల నేరస్థుల పారిశ్రామిక పాఠశాలలో ఉన్న ఎనిమిది మంది బాల నేరస్థులను కూడా విడిచిపెడుతున్నారు. త్వరలో పాకిస్థాన్లో భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పర్యటిస్తున్న నేపథ్యంలో సుహృద్భావ సూచకంగా ఈ ఖైదీల విడుదల కార్యక్రమాన్ని చేపట్టామని, దీనివల్ల ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని జమీల్ అన్నారు.
ఖైదీలను భారతదేశానికి పంపేందుకు ఎల్ఏఓ సింధ్ ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా ఏసీ బస్సులు సిద్ధం చేసింది. దీంతోపాటు వారికి వాఘా సరిహద్దుకు వెళ్లేవరకు కావల్సిన ఆహారం కూడా అందించనుంది. వీరికి ఎల్ఏఓతో పాటు ప్రోటోకాల్ అధికారులు, స్పెషల్ బ్రాంచి పోలీసులు సరిహద్దు వరకు తోడుగా వెళ్తారు. ప్రస్తుత జైలు రికార్డుల ప్రకారం, 427 మంది భారతీయ మత్స్యకారులు, ముగ్గురు అండర్ ట్రయల్ ఖైదీలు, శిక్షపడిన ఒక ఖైదీ, ఎనిమిది మంది మైనర్లు పాకిస్థాన్లో ఉన్నారు.
మూడు రోజుల్లో పాక్ నుంచి 338 మంది భారతీయ ఖైదీల విడుదల
Published Wed, Aug 21 2013 2:20 PM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM
Advertisement
Advertisement