పోటెత్తిన భక్తజన గోదారి
ఏపీలో ఒక్కరోజే 41 లక్షల మంది పుణ్య స్నానాలు
వేచి ఉన్న మరో ఐదు లక్షల మంది భక్తులు
వరుస సెలవులతో పెరిగిన రద్దీ
రాజమండ్రి: గోదావరి రేవుల్లో భక్తజన గోదారి పరవళ్లు తొక్కింది. రాష్ర్టంలోని వివిధ జిల్లాలతోపాటు దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనంతో గోదావరికి ‘తూర్పు’న రాజమండ్రి, ‘పశ్చిమ’న కొవ్వూరు రహదారులు జనగోదారులను తలపిస్తున్నాయి. ఐదో రోజైన శనివారం నాడు వేకువజాము నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు 41లక్షల మంది భక్తులు స్నానమాచరించారని అధికారులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో 31,91,742 మంది, పశ్చిమ గోదావరిలో 9,21,043 మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారని పేర్కొన్నారు. మరో ఐదు లక్షల మంది(అంచనా) పుష్కర స్నానం కోసం వేచి ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికి కోటిన్నర మంది గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించగా, 8 లక్షల మంది పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. తరలివచ్చిన భక్తకోటితో గోదావరి జిల్లాల్లో ఊరూవాడా పుష్కర శోభను సంతరించుకున్నాయి. ముఖ్యంగా అఖండ గోదావరి తీరం రాజమహేంద్రికి రేయింబవళ్లు తేడా లేకుండా భక్తులు పోటెత్తారు. శుక్ర, శని, ఆదివారాల్లో పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు వరుస సెలవులు రావడంతో అనేకమంది కుటుంబ సమేతంగా పుష్కరాలకు తరలివస్తున్నారు.
సగానికిపైగా ఉత్తరాంధ్ర భక్తులే
పుష్కరాలకు వస్తున్న భక్తుల్లో సగానికి పైగా ఉత్తరాంధ్ర జిల్లాలవాసులే కనిపిస్తున్నారు. వారిలో కూడా ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో పిల్లాపాపలతో తరలివస్తున్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు ప్రతి ఇంటిలో సగం మంది రావాలని, లేకుంటే కనీసం ఒకరైనా పుష్కర స్నానం చేసి తిరిగి వెళుతూ గోదావరి నీటిని తీసుకెళ్లి మిగిలినవారి నెత్తిన చల్లుతామని ఆ జిల్లా నుంచి వచ్చిన మహిళలు చెప్పారు.
ధవళేశ్వరం మృతులకు పిండప్రదానం
గత నెలలో ధవళేశ్వరం బ్యారేజిపై నుంచి తుపాన్ వ్యాన్ బోల్తాపడిన ఘోర ప్రమాదంలో దుర్మరణం పాలైన విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మోసయ్యపేటకు చెందిన 22 మందికి గాయత్రీ బ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో పిండప్రదానం చేశారు.
ప్రతిదారీ పద్మవ్యూహమే! ఏపీలో పుష్కర యాత్రికులకు ట్రాఫిక్ కష్టాలు
రాజమండ్రి/కొవ్వూరు: పవిత్ర గోదావరి పుష్కరాలు.. వరుసగా రెండురోజుల సెలవులు.. ఇంతకంటే మంచి అవకాశం ఇంకేముంటుంది. రాష్ట్రంలో వాహనాలు గోదావరి తీరం వైపే సాగాయి. గోదావరికి దారితీసే అన్ని రహదారులు నిండిపోయాయి. ఇసుకేస్తే రాలని రీతిలో కార్లు, మినీ వ్యాన్‌లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ఆటోలు, సరకు రవాణా లారీలతో కిక్కిరిసిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలతో కష్టాలు రెట్టింపయ్యాయి. వీటివద్ద కనుచూపుమేర దాకా వాహనాలు బారులు తీరాయి. పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ఉత్సాహంగా బయల్దేరిన లక్షలాది మంది భక్తులు నడిరోడ్డుపై గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. జనం నరకయాతన అనుభవించారు. ఆకలిదప్పులతో అలమటించారు. కొందరు పుష్కర యాత్రను వాయిదా వేసుకొని వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.
మరోవైపు రైళ్లు కూడా 5 నుంచి 9 గంటలపాటు ఆలస్యంగా నడిచాయి. యాత్రికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. పుష్కరాల నేపథ్యంలో శనివారం రహదారులపై ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నించారు. విశాఖ జిల్లా నక్కపల్లి టోల్‌గేట్ నుంచి తూర్పుగోదావరి జిల్లా లాలాచెరువు వరకు 16వ నంబర్ జాతీయరహదారిపై తెల్లవారుజాము నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లపై కనీసం మోటార్ సైకిల్, ఆటోలు కూడావెళ్లే పరిస్థితి లేకపోవడంతో వాహనచోదకులు, భక్తులు కాలినడకన రాజమండ్రికి రావాల్సి వచ్చింది.