పులకించిన గోదావరి
తెలంగాణలో పుష్కరాల తొలిరోజే 30 లక్షల మంది పుణ్య స్నానాలు
నదిలో నీళ్లు లేకున్నా పోటెత్తిన భక్తజనం ఏ ధర్మపురిలో కుటుంబసమేతంగా సీఎం కేసీఆర్ పుష్కరస్నానం
భద్రాద్రికి భక్తుల వరద.. ఏ త్రివేణి సంగమం కాళేశ్వరం కళకళ.. తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు
హైదరాబాద్/నెట్‌వర్క్: జనవాహిని ఉప్పొంగింది. గోదావరి పులకించింది. పుష్కరుడు ఆగమించిన వేళ తెలంగాణ యావత్తూ కొత్త శోభతో కళకళలాడింది. బాసర నుంచి భద్రాచలం దాకా గోదావరి తీరం భక్తజన సంద్రాన్ని తలపించింది. రాష్ట్రంలో గోదావరి మహా పుష్కరాలు అంగరంగవైభవంగా మొదలయ్యాయి. మంగళవారం తొలిరోజే దాదాపు 30 లక్షల మంది పుణ్య స్నానాలతో తరించారు. నదిలో పెద్దగా నీళ్లు లేకపోయినా జనం లెక్కచేయలేదు. అన్ని ఘాట్లు భక్తుల జయజయధ్వానాలతో మార్మోగాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో జనం పోటెత్తగా.. వరంగల్ జిల్లాలోని మూడు ఘాట్ల వద్ద కాస్త పలుచగా కనిపించారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో మూడు లక్షల మంది దాకా పుణ్యస్నానాలు ఆచరించారు. భద్రాద్రిలో దాదాపు రెండు లక్షల మందికిపైగా నదీ స్నానం చేశారు. బుధవారం నుంచి తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. భద్రాచలం, బాసర, ధర్మపురి, కాళేశ్వరం తదితర క్షేత్రాలకు రద్దీ పెరగనున్నందున ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది.
కిక్కిరిసిన భద్రాద్రి: భద్రాచలం భక్తులతో కిక్కిరిసిపోయింది. రెండు లక్షలకుపైగా భక్తులు తరలివచ్చారు. ఉదయం 6.21 గంటలకు త్రిదండి చినజీయర్ స్వామి ఇక్కడే పుష్కరస్నానం చేశారు. శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం నుంచి సుదర్శన చక్రాన్ని తీసుకువచ్చి పూజలు చేశారు. మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు కూడా భద్రాద్రిలోనే పుణ్య స్నానాలు ఆచరించారు. ఆదిలాబాద్ జిల్లా బాసరలో నీళ్లు లేకున్నా లక్ష మంది వరకు స్నానం చేశారు. జిల్లావ్యాప్తంగా తొలిరోజు 4 లక్షల మంది స్నానాలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో లక్షన్నర మంది స్నానాలు చేశారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత పోచంపాడు వద్ద ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి స్నానమాచరించారు. వరంగల్ జిల్లాలో పెద్దగా భక్తులు రాలేదు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మంగపేట వద్ద స్నానమాచరించారు.
ధర్మపురిలో సీఎం పుణ్యస్నానం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ఉదయం కుటుంబసమేతంగా గోదావరి మాతకు పూజలు చేశారు. ఉదయం సరిగ్గా 6.21 గంటలకు పుణ్యస్నానం చేసి పుష్కరాలు ప్రారంభించారు. అంతకుముందు వివిధ పీఠాలకు చెందిన ఏడుగురు స్వామీజీలు శాస్త్రోక్తంగా స్నానాలు ఆచరించి సీఎం దంపతులకు ఆశీస్సులు అందజేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా ఇక్కడే పుణ్యస్నానం చేశారు. పుష్కర స్నానం అనంతరం ధర్మపురిలో పుష్కర పైలాన్ ఆవిష్కరించారు. నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున త్రివేణీసంగమ క్షేత్రం కాళేశ్వరానికి కూడా భక్తులు భారీగా వచ్చారు. రెండు లక్షలకుపైగా భక్తులు ఇక్కడ స్నానాలు ఆచరించారు. కాళేశ్వరం ఆయానికి సాధారణ రోజుల్లో రూ.2 లక్షల చొప్పున ఆదాయం ఉండగా మంగళవారం ఒక్కరోజే రూ.25 లక్షల దాకా సమకూరడం విశేషం. కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం, ధర్మపురి, మంథని, కోటిలింగాల క్షేత్రాల్లో తొలిరోజు దాదాపు 10 లక్షల మంది పుష్కర స్నానాలు చేసినట్టు అంచనా.