Sacred baths
-
కుంభమేళాలో 24 కోట్ల మంది పుణ్యస్నానం
అలహాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(అలహాబాద్)లో జరుగుతున్న ఆధ్యాత్మిక వేడుక కుంభమేళా ముగిసింది. మహాశివరాత్రితో పాటు కుంభమేళా చివరిరోజు కావడంతో సోమవారం పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పవిత్ర సంగమానికి పోటెత్తారు. జనవరి 15 న ప్రారంభమైన కుంభమేళాలో భాగంగా సోమవారం సాయంత్రం నాటికి మొత్తం 24.05 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహాశివరాత్రి నేపథ్యంలో ఒక్కరోజే 1.10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. సన్నటి వర్షపు జల్లులు కురుస్తున్నప్పటికీ భక్తులందరూ ‘హరహర మహాదేవ్’అంటూ శివనామస్మరణ చేస్తూ ముందుకుసాగారు. కుంభమేళా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కుంభమేళా చివరిరోజున యూపీ మంత్రి సురేశ్ రాణా పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం బోటులో విహరించారు. కుంభమేళా సందర్భంగా మూడు గిన్నిస్ రికార్డులు నెలకొల్పామని మంత్రి సురేశ్ రాణా తెలిపారు. ‘పెయింట్ మై సిటీ’పేరుతో మార్చి 1న 7,664 మంది వాలంటీర్లు 8 గంటల వ్యవధిలో చేతితో పెయింటింగ్ రూపొందించి గిన్నిస్‌రికార్డు సాధించినట్లు వెల్లడించారు. ఈ నెల 2న భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుని చీపుర్లతో రోడ్డును శుభ్రంచేసి గిన్నిస్ రికార్డును సాధించారని పేర్కొన్నారు. అలాగే 19వ జాతీయ రహదారిపై 500 బస్సులతో 3.2 కి.మీ పరేడ్ నిర్వహించి మరో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నామన్నారు. -
7 రోజుల్లో మొత్తంగా 80 లక్షల మంది
కొవ్వూరు : జిల్లాలో పుష్కర యాత్రికుల రద్దీ కొనసాగుతూనే ఉంది. సోమవారం సాయంత్రం 6గంటల సమయానికి జిల్లాలోని 97 ఘాట్లలో 13,31,038 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్టు అధికారులు ప్రకటించారు. కొవ్వూరు డివిజన్ పరిధిలోని ఘాట్లలో 7,54,128 మంది, నరసాపురం డివిజన్లోని మూడు మండలాల్లో 3,07,177 మంది, జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో 2,69,728 మంది పుష్కర స్నానాలు ఆచరించారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో 2.26 లక్షల మంది యాత్రికులు స్నానాలు ఆచరించినట్టు లెక్కగట్టారు. పుష్కరాలు మొదలయ్యాక 7 రోజుల్లో మొత్తంగా 80 లక్షల మంది జిల్లాలోని ఘాట్లలో స్నానాలు నిర్వహించినట్టు లెక్క తేల్చారు. -
పోటెత్తిన భక్తజన గోదారి
ఏపీలో ఒక్కరోజే 41 లక్షల మంది పుణ్య స్నానాలు వేచి ఉన్న మరో ఐదు లక్షల మంది భక్తులు వరుస సెలవులతో పెరిగిన రద్దీ రాజమండ్రి: గోదావరి రేవుల్లో భక్తజన గోదారి పరవళ్లు తొక్కింది. రాష్ర్టంలోని వివిధ జిల్లాలతోపాటు దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనంతో గోదావరికి ‘తూర్పు’న రాజమండ్రి, ‘పశ్చిమ’న కొవ్వూరు రహదారులు జనగోదారులను తలపిస్తున్నాయి. ఐదో రోజైన శనివారం నాడు వేకువజాము నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు 41లక్షల మంది భక్తులు స్నానమాచరించారని అధికారులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో 31,91,742 మంది, పశ్చిమ గోదావరిలో 9,21,043 మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారని పేర్కొన్నారు. మరో ఐదు లక్షల మంది(అంచనా) పుష్కర స్నానం కోసం వేచి ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికి కోటిన్నర మంది గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించగా, 8 లక్షల మంది పితృదేవతలకు పిండప్రదానాలు చేశారు. తరలివచ్చిన భక్తకోటితో గోదావరి జిల్లాల్లో ఊరూవాడా పుష్కర శోభను సంతరించుకున్నాయి. ముఖ్యంగా అఖండ గోదావరి తీరం రాజమహేంద్రికి రేయింబవళ్లు తేడా లేకుండా భక్తులు పోటెత్తారు. శుక్ర, శని, ఆదివారాల్లో పాఠశాలలకు, ప్రభుత్వ కార్యాలయాలకు వరుస సెలవులు రావడంతో అనేకమంది కుటుంబ సమేతంగా పుష్కరాలకు తరలివస్తున్నారు. సగానికిపైగా ఉత్తరాంధ్ర భక్తులే పుష్కరాలకు వస్తున్న భక్తుల్లో సగానికి పైగా ఉత్తరాంధ్ర జిల్లాలవాసులే కనిపిస్తున్నారు. వారిలో కూడా ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో పిల్లాపాపలతో తరలివస్తున్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలకు ప్రతి ఇంటిలో సగం మంది రావాలని, లేకుంటే కనీసం ఒకరైనా పుష్కర స్నానం చేసి తిరిగి వెళుతూ గోదావరి నీటిని తీసుకెళ్లి మిగిలినవారి నెత్తిన చల్లుతామని ఆ జిల్లా నుంచి వచ్చిన మహిళలు చెప్పారు. ధవళేశ్వరం మృతులకు పిండప్రదానం గత నెలలో ధవళేశ్వరం బ్యారేజిపై నుంచి తుపాన్ వ్యాన్ బోల్తాపడిన ఘోర ప్రమాదంలో దుర్మరణం పాలైన విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం మోసయ్యపేటకు చెందిన 22 మందికి గాయత్రీ బ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో పిండప్రదానం చేశారు. ప్రతిదారీ పద్మవ్యూహమే! ఏపీలో పుష్కర యాత్రికులకు ట్రాఫిక్ కష్టాలు రాజమండ్రి/కొవ్వూరు: పవిత్ర గోదావరి పుష్కరాలు.. వరుసగా రెండురోజుల సెలవులు.. ఇంతకంటే మంచి అవకాశం ఇంకేముంటుంది. రాష్ట్రంలో వాహనాలు గోదావరి తీరం వైపే సాగాయి. గోదావరికి దారితీసే అన్ని రహదారులు నిండిపోయాయి. ఇసుకేస్తే రాలని రీతిలో కార్లు, మినీ వ్యాన్లు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, ఆటోలు, సరకు రవాణా లారీలతో కిక్కిరిసిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలతో కష్టాలు రెట్టింపయ్యాయి. వీటివద్ద కనుచూపుమేర దాకా వాహనాలు బారులు తీరాయి. పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించేందుకు ఉత్సాహంగా బయల్దేరిన లక్షలాది మంది భక్తులు నడిరోడ్డుపై గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. జనం నరకయాతన అనుభవించారు. ఆకలిదప్పులతో అలమటించారు. కొందరు పుష్కర యాత్రను వాయిదా వేసుకొని వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. మరోవైపు రైళ్లు కూడా 5 నుంచి 9 గంటలపాటు ఆలస్యంగా నడిచాయి. యాత్రికుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. పుష్కరాల నేపథ్యంలో శనివారం రహదారులపై ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నించారు. విశాఖ జిల్లా నక్కపల్లి టోల్గేట్ నుంచి తూర్పుగోదావరి జిల్లా లాలాచెరువు వరకు 16వ నంబర్ జాతీయరహదారిపై తెల్లవారుజాము నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లపై కనీసం మోటార్ సైకిల్, ఆటోలు కూడావెళ్లే పరిస్థితి లేకపోవడంతో వాహనచోదకులు, భక్తులు కాలినడకన రాజమండ్రికి రావాల్సి వచ్చింది. -
పులకించిన గోదావరి
తెలంగాణలో పుష్కరాల తొలిరోజే 30 లక్షల మంది పుణ్య స్నానాలు నదిలో నీళ్లు లేకున్నా పోటెత్తిన భక్తజనం ఏ ధర్మపురిలో కుటుంబసమేతంగా సీఎం కేసీఆర్ పుష్కరస్నానం భద్రాద్రికి భక్తుల వరద.. ఏ త్రివేణి సంగమం కాళేశ్వరం కళకళ.. తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు హైదరాబాద్/నెట్వర్క్: జనవాహిని ఉప్పొంగింది. గోదావరి పులకించింది. పుష్కరుడు ఆగమించిన వేళ తెలంగాణ యావత్తూ కొత్త శోభతో కళకళలాడింది. బాసర నుంచి భద్రాచలం దాకా గోదావరి తీరం భక్తజన సంద్రాన్ని తలపించింది. రాష్ట్రంలో గోదావరి మహా పుష్కరాలు అంగరంగవైభవంగా మొదలయ్యాయి. మంగళవారం తొలిరోజే దాదాపు 30 లక్షల మంది పుణ్య స్నానాలతో తరించారు. నదిలో పెద్దగా నీళ్లు లేకపోయినా జనం లెక్కచేయలేదు. అన్ని ఘాట్లు భక్తుల జయజయధ్వానాలతో మార్మోగాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో జనం పోటెత్తగా.. వరంగల్ జిల్లాలోని మూడు ఘాట్ల వద్ద కాస్త పలుచగా కనిపించారు. కరీంనగర్ జిల్లా ధర్మపురిలో మూడు లక్షల మంది దాకా పుణ్యస్నానాలు ఆచరించారు. భద్రాద్రిలో దాదాపు రెండు లక్షల మందికిపైగా నదీ స్నానం చేశారు. బుధవారం నుంచి తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. భద్రాచలం, బాసర, ధర్మపురి, కాళేశ్వరం తదితర క్షేత్రాలకు రద్దీ పెరగనున్నందున ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. కిక్కిరిసిన భద్రాద్రి: భద్రాచలం భక్తులతో కిక్కిరిసిపోయింది. రెండు లక్షలకుపైగా భక్తులు తరలివచ్చారు. ఉదయం 6.21 గంటలకు త్రిదండి చినజీయర్ స్వామి ఇక్కడే పుష్కరస్నానం చేశారు. శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం నుంచి సుదర్శన చక్రాన్ని తీసుకువచ్చి పూజలు చేశారు. మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు కూడా భద్రాద్రిలోనే పుణ్య స్నానాలు ఆచరించారు. ఆదిలాబాద్ జిల్లా బాసరలో నీళ్లు లేకున్నా లక్ష మంది వరకు స్నానం చేశారు. జిల్లావ్యాప్తంగా తొలిరోజు 4 లక్షల మంది స్నానాలు చేశారు. నిజామాబాద్ జిల్లాలో లక్షన్నర మంది స్నానాలు చేశారు. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత పోచంపాడు వద్ద ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి స్నానమాచరించారు. వరంగల్ జిల్లాలో పెద్దగా భక్తులు రాలేదు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మంగపేట వద్ద స్నానమాచరించారు. ధర్మపురిలో సీఎం పుణ్యస్నానం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ఉదయం కుటుంబసమేతంగా గోదావరి మాతకు పూజలు చేశారు. ఉదయం సరిగ్గా 6.21 గంటలకు పుణ్యస్నానం చేసి పుష్కరాలు ప్రారంభించారు. అంతకుముందు వివిధ పీఠాలకు చెందిన ఏడుగురు స్వామీజీలు శాస్త్రోక్తంగా స్నానాలు ఆచరించి సీఎం దంపతులకు ఆశీస్సులు అందజేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా ఇక్కడే పుణ్యస్నానం చేశారు. పుష్కర స్నానం అనంతరం ధర్మపురిలో పుష్కర పైలాన్ ఆవిష్కరించారు. నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున త్రివేణీసంగమ క్షేత్రం కాళేశ్వరానికి కూడా భక్తులు భారీగా వచ్చారు. రెండు లక్షలకుపైగా భక్తులు ఇక్కడ స్నానాలు ఆచరించారు. కాళేశ్వరం ఆయానికి సాధారణ రోజుల్లో రూ.2 లక్షల చొప్పున ఆదాయం ఉండగా మంగళవారం ఒక్కరోజే రూ.25 లక్షల దాకా సమకూరడం విశేషం. కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం, ధర్మపురి, మంథని, కోటిలింగాల క్షేత్రాల్లో తొలిరోజు దాదాపు 10 లక్షల మంది పుష్కర స్నానాలు చేసినట్టు అంచనా.