
అలహాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(అలహాబాద్)లో జరుగుతున్న ఆధ్యాత్మిక వేడుక కుంభమేళా ముగిసింది. మహాశివరాత్రితో పాటు కుంభమేళా చివరిరోజు కావడంతో సోమవారం పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పవిత్ర సంగమానికి పోటెత్తారు. జనవరి 15 న ప్రారంభమైన కుంభమేళాలో భాగంగా సోమవారం సాయంత్రం నాటికి మొత్తం 24.05 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహాశివరాత్రి నేపథ్యంలో ఒక్కరోజే 1.10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. సన్నటి వర్షపు జల్లులు కురుస్తున్నప్పటికీ భక్తులందరూ ‘హరహర మహాదేవ్’అంటూ శివనామస్మరణ చేస్తూ ముందుకుసాగారు.
కుంభమేళా సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కుంభమేళా చివరిరోజున యూపీ మంత్రి సురేశ్ రాణా పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం బోటులో విహరించారు. కుంభమేళా సందర్భంగా మూడు గిన్నిస్ రికార్డులు నెలకొల్పామని మంత్రి సురేశ్ రాణా తెలిపారు. ‘పెయింట్ మై సిటీ’పేరుతో మార్చి 1న 7,664 మంది వాలంటీర్లు 8 గంటల వ్యవధిలో చేతితో పెయింటింగ్ రూపొందించి గిన్నిస్‌రికార్డు సాధించినట్లు వెల్లడించారు. ఈ నెల 2న భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుని చీపుర్లతో రోడ్డును శుభ్రంచేసి గిన్నిస్ రికార్డును సాధించారని పేర్కొన్నారు. అలాగే 19వ జాతీయ రహదారిపై 500 బస్సులతో 3.2 కి.మీ పరేడ్ నిర్వహించి మరో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నామన్నారు.