జలజలా వచ్చి.. జలమ్మను అర్చించి
జడివాన సవ్వడి చేసింది. పుష్కర యాగాన్ని చూసే యోగం దక్కిందన్నట్టుగా వరుణుడు కుండపోత వర్షం కురిపించాడు. తడిసి ముద్దవుతూనే గోదారమ్మ చెంతకు జనకోటి జలజలా తరలివచ్చింది. జలదేవత గోదారమ్మకు ప్రణమిల్లింది. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, వస్త్రాలు సమర్పించి ఆ ఆమ్మను అర్చించింది. పావన వాహిని మహాపర్వం మొదలై తొమ్మిది రోజులైనా యాత్రికుల సందడి ఏమాత్రం తగ్గలేదు.
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జోరు వానలోనూ భక్తజనం పోటెత్తింది. బుధవారం భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు పుష్కర పుణ్యస్నానాలు ఆచరించారు. జిల్లాలోని అన్ని ఘాట్లవద్ద యాత్రికుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. జిల్లాలో పుష్కర స్నానాలు ఆచరించే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. కుండపోత వర్షం కురవడంతో పుష్కర ఏర్పాట్లలోని డొల్లతనం బయటపడింది. పుష్కరాలు ప్రారంభమైన తర్వాత అడపాదడపా ఓ మాదిరి వర్షాలు కురిసినా బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో పుష్కర యాత్రికులు అవస్థలకు గురయ్యారు. జూలై నెలలో వర్షాలు భారీగా పడతాయని తెలిసినప్పటికీ అందుకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయలేకపోయారు. ఫలితంగా బుధవారం వేకువజామునుంచి మధ్యాహ్నం వరకు కుంభవృష్టిగా కురిసిన వర్షంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు.
కొవ్వూరు బురదమయం
బుధవారం అర్ధరాత్రి 2 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు కొవ్వూరు పట్టణం బురదమయంగా మారింది. గోష్పాద క్షేత్రంలోని ప్రధాన ఘాట్‌తోపాటు మిగిలిన 9 ఘాట్లలో నీరు నిలిచిపోయింది. వేలాది మంది భక్తులు బురదలోనే పుష్కర స్నాలు ఆచరించి పిండప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని ఘాట్లలో పిండప్రదాన షెడ్లు సరిపోకపోవడంతో ఇటీవలే టెంట్లు వేశారు. అవన్నీ వర్షానికి ఆ తడిసి.. లోనికి వాననీరు చేరడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో అనేక మంది బురదలోనే పిండప్రదానాలు నిర్వహించారు.
దుస్తులు మార్చుకోవడానికి ఏర్పాటు చేసిన టెంట్లు కూడా తడిసిపోవడంతో మహిళలు ఇబ్బందులు పడ్డారు. అలాగే తాత్కాలిక బస్టాండ్ పూర్తిగా బురదతో నిండిపోవడంతో భక్తులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వేస్టేషన్ రోడ్డు సహా పట్టణంలోని ప్రధాన రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎంపీ మాగంటి మురళీమోహన్ గోష్పాద క్షేత్రంలో పుష్కర స్నానాలు ఆచరించారు.
నరసాపురంలో అవస్థలు
నరసాపురం పట్టణంలో పుష్కర యాత్రికుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులు స్నానాలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఘాట్లకు వెళ్లే రహదారులు కిక్కిరిసిపోయాయి. వర్షం కారణంగా పిండప్రదానాలు చేసుకోవడానికి సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నా రు. ఆరుబయట గొడుగులు వేసుకుని ఈ తంతును కష్టం మీద పూర్తి చేసుకున్నారు. పారిశుధ్య నిర్వహణలో లోపా లు యథావిధిగా కొనసాగుతున్నాయి. వలంధర రేవులోని వీఐపీ ఘాట్‌లో చెత్త పేరుకుపోయి దుర్గంధం వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
సిద్ధాంతంలో బురద వరద
పెనుగొండ మండలం సిద్ధాంతంలోని ఘాట్లు వర్షంలోనూ భక్తులతో కిక్కిరిశాయి. కేదారీఘాట్ వద్ద ఉదయం నుంచే రద్దీ కనిపించింది. వర్షం కారణంగా ఘాట్లకు వెళ్లే రహదారులు బురదగా మారిపోయాయి. హిందూ ప్రతిష్టాక్ పీఠాధిపతి కమలానంద భారతీస్వామి కేదారీ ఘాట్‌లో పుణ్యస్నానం చేశారు.
కూలిన టెంట్లు
పెరవలి మండలంలోని ఘాట్లలో భారీ వర్షానికి పిండ ప్రదాన షెడ్లు, టెంట్లు కూలిపోయాయి. ఘాట్లకు వెళ్లే రహదారులు బురదగా మారి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. అధికారులు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులే రంగంలోకి దిగి ఇసుక పొరలు వేశారు. ఖండవల్లి, ఇమ్మిడివారిపాలెం, కానూరు అగ్రహారం, ఉసులుమర్రు ఘాట్లకు వెళ్లే రహదారులపై పేరుకుపోయిన బురదపై ఇసుక వేసి తాత్కాలికంగా ఇబ్బందులను తొలగించారు.
పట్టిసీమ క్షేత్రానికి రాకపోకలు బంద్
నీటిమట్టం పెరగడంతో పోలవరం మండలంలో భక్తుల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. పట్టిసీమ లాంచీల రేవులోని ప్లాట్‌ఫామ్‌లు నీట ముని గాయి. దీంతో మధ్యాహ్నం నుంచి లాంచీల రాకపోకలను నిలిపివేశారు. ఇసుక బస్తాలు వేసి ప్లాట్‌ఫామ్‌ను మెరక చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. పుణ్య పుష్కర స్నానం అనంతరం పట్టిసీమ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునే వారికి నిరాశ ఎదురైంది.
ప్రమాదకరంగా ఘాట్లు
నిడదవోలు మండలంలోని కల్యాణ్‌ఘాట్‌లో ప్లాట్‌ఫామ్ రాళ్లు పైకి లేచిపోయి స్నానాలు దిగిన భక్తులు గాయాల పాలవుతున్నారు. ఆచంట మండలం భీమలాపురం, కరుగోరుమిల్లి ఘాట్లలో వర్షం కారణంగా పిండ ప్రదానాలు చేసుకునే వీలు లేక ఇబ్బం దులు ఎదుర్కొన్నారు. యలమంచిలి మండలంలో ఘాట్లకు వెళ్లే రహదారులు బురదతో నిండిపోయినా భక్తుల రాక ఏమాత్రం తగ్గలేదు.